కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది

0
48

దిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది.

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్‌ రమేశ్ కుమార్‌ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. మరో రోజు వచ్చి రాజీనామాలు సమర్పించి, దానికి సహేతుకమైన వివరణ ఇవ్వాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. దీంతో రెబల్‌ ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంలో పడినట్లయింది. మరోవైపు అసమ్మతులను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ నేడు ముంబయి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలను కలవకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. మరి ఈ సంక్షోభానికి ఎలాంటి ముగింపు వస్తుందో వేచి చూడాల్సిందే.