భారత్‌-న్యూజిలాండ్‌ సెమీస్‌ ఫలితం..

0
48

ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. మంగళవారం తేలిపోవాల్సిన భారత్‌-న్యూజిలాండ్‌ సెమీస్‌ ఫలితం.. వరుణుడి పుణ్యమా అని తర్వాతి రోజుకు వాయిదా పడింది. ఈ వర్షం భారత్‌కు మేలు చేస్తుందా.. చేటు చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. వర్షం మ్యాచ్‌ను తుడిచి పెట్టేస్తే లీగ్‌ దశలో కివీస్‌ కన్నా ఎక్కువ పాయింట్లతో ఉన్న భారతే ఫైనల్‌ చేరుతుందన్న సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు! బుధవారం మధ్య మధ్యలో ఆటకు అంతరాయం కలిగిస్తే భారత్‌ అవకాశాలపై ప్రభావం పడటం ఖాయం. వర్షం వల్ల మైదాన పరిస్థితులు ఇప్పటికే భారత్‌కు కొంత ప్రతికూలంగా మారి ఉంటాయి. అసలే పిచ్‌ నెమ్మదిగా ఉండగా.. వర్షం వల్ల పరిస్థితులు బౌలర్లకు మరింత అనుకూలంగా మారొచ్చు. మంగళవారం పిచ్‌ ఎలా ఉన్నప్పటికీ.. ఔట్‌ఫీల్డ్‌ మాత్రం వేగంగానే ఉంది. వర్షం తర్వాత బంతి ఆశించినంత వేగంగా పరుగులు పెట్టకపోవచ్చు. కాబట్టి పూర్తి మ్యాచ్‌ సాగినా ఛేదన అంత సులువు కాకపోవచ్చు. వర్షం పడకపోయి ఉంటే.. కివీస్‌ 240 లోపు స్కోరుకు పరిమితమయ్యేదేమో. భారత బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ ప్రకారం చూస్తే.. అప్పటి పరిస్థితుల్లో ఛేదన భారత్‌కు అంత కష్టం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వర్షం తర్వాత పరిస్థితులు మారుతాయి. లక్ష్యం 240 లోపే ఉన్నా.. బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీలను కాచుకుని ఛేదన పూర్తి చేయడం సవాలే. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో బౌల్ట్‌ నుంచి ముప్పు తప్పదు. వర్షం  లేకుండా మ్యాచ్‌ మామూలుగా సాగిపోయినా పర్వాలేదు. అలా కాకుండా ఆటకు అంతరాయం కలిగించి డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే ఆందోళన తప్పకపోవచ్చు. మ్యాచ్‌ ఆగిన చోటే న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడి ఉంటే.. ఆ తర్వాత ఆట సాధ్యమయ్యే సమయాన్ని బట్టి భారత్‌ లక్ష్యం 46 ఓవర్లలో 237, 40 ఓవర్లలో 223, 35 ఓవర్లలో 209, 30 ఓవర్లలో 192, 25 ఓవర్లలో 172, 20 ఓవర్లలో 148గా ఉండేది. పిచ్‌, వాతావరణ పరిస్థితులు, కివీస్‌ బౌలింగ్‌ను బట్టి చూస్తే ఈ సమీకరణాలు ఏవైనా సవాలు విసిరేవే! ఒక రకంగా మంగళవారం మ్యాచ్‌ కొనసాగనందుకు టీమ్‌ఇండియా సంతోషించాల్సిందే. ఓవర్లు కుదిస్తే ఇబ్బందులు తప్పకపోయి ఉండొచ్చు. ఒకవేళ బుధవారం వర్షం వల్ల పిచ్‌ సంక్లిష్టంగా మారి, ఇలాంటి సమీకరణాలే ఎదురైతే భారత్‌ పరిస్థితేంటన్నది ప్రశ్న. మొత్తానికి సెమీస్‌లో న్యూజిలాండ్‌ లాంటి సులువైన ప్రత్యర్థి ఎదురైందని సంబరపడితే.. వరుణుడు ప్రత్యర్థికి అదనపు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాడు. ఈ సవాల్‌ను భారత్‌ ఎలా ఛేదిస్తుందో మరి?