మాంచెస్టర్: ప్రపంచకప్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. బుధవారం న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు, స్టాఫ్ తిరిగి స్వదేశానికి రాడానికి టికెట్లు సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. దీంతో ఆదివారం వరకూ కోహ్లీసేన మాంచెస్టర్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి చేరుకునేందుకు బీసీసీఐ ప్రయత్నించినప్పటికీ ఆదివారం వరకు టికెట్లు దొరకలేదు. ‘చాలా మంది ఆటగాళ్లు మాంచెస్టర్‌లోనే ఉన్నారు. వాళ్లకి టికెట్లు సర్దుబాటు చేస్తున్నాం. అక్కడి నుంచే తిరిగి పయనమవుతారు. అందులో కొందరే భారత్‌కు తిరిగి వస్తారు. మిగతా ఆటగాళ్లు బృందాలుగా రెండు వారాల పాటు ఎక్కడికైనా విహారానికి వెళ్తారు. వారికి టికెట్లు సర్దుబాటు చేస్తున్నాం’ అని ఓ బీసీసీఐ అధికారి తాజాగా పేర్కొన్నారు.
టీమిండియా తదుపరి షెడ్యూల్ వెస్టిండీస్‌తో జరగనుంది. వచ్చేనెల మూడు నుంచి నెలరోజుల పాటు అమెరికాలో విండీస్‌తో తలపడనుంది. 3 టీ20లు, 3 వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది.