2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాo?

0
56

అమరావతి: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అందుకోసం తగిన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. వీటితో పాటు సాగునీటి అవసరాలను తీర్చే పలు ప్రాజెక్టులను సైతం సత్వరమే పూర్తి చేస్తామని వెల్లడించారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.13,139.13 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ ‘హరితాంధ్రప్రదేశ్‌’ కలను సాకారం చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

* పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం. అందుకు తగిన బడ్జెట్‌ కేటాయిస్తాం. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునః పరిష్కారం, పునరావాసం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
* పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1ని ఏడాదిలో పూర్తి చేస్తాం. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తాం. మరో రెండేళ్లలో సొరంగం-2, రెండో దశను పూర్తి చేస్తాం.
* అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తాం. సంవత్సరంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఒకటో దశను పూర్తి చేస్తాం. గండికోట రిజర్వాయరులో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి ఒకటో దశను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని ప్రస్తుతమున్న చెరువులను నింపేందుకు ఒక నిర్ణీత కాలావధి విధానంలో రెండో దశను పూర్తి చేస్తాం.
* శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి వంశధార ప్రాజెక్టు, సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంతో పాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* 2019-20 సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు రూ.13,139.13 కోట్లు