పేదల సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించారు

0
37

అభివృద్ధి పనులను పట్టించుకోలేదు
తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు

అమరావతి: ‘ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా లేదు. పేదల సంక్షేమానికి దోహదం చేసేలా లేదు. వైకాపా నేతల మాటలకు, చేతలకు పొంతన లేదనటానికి ఈ బడ్జెట్టే నిదర్శనం. బడ్జెట్‌ ప్రసంగం పుస్తకాన్ని కూడా పార్టీ పుస్తకంగా, వైకాపా కరదీపికగా మార్చారు’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సున్నా వడ్డీ రుణాలకు రూ.4 వేల కోట్లు అవసరం ఉంటే.. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించటంపై రైతులకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో రైతులకు అన్యాయం చేసి వచ్చే బడ్జెట్‌లో సరిచేస్తామని చెప్పటం సరికాదని విమర్శించారు.
బడ్జెట్‌పై స్పందన ఆయన మాటల్లోనే..
నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయింపుల్లో 22 శాతం కోత పెట్టారు. పొరుగు రాష్ట్ర భూభాగంలో నీరు పారించటంపైనే శ్రద్ధ పెట్టారు. బీసీల సంక్షేమం కోసం కేటాయించే నిధులూ తగ్గించారు. 139 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటికి కేటాయింపులపై స్పష్టత లేదు. ముస్లిం మైనారిటీలకు తెదేపా హయాంలో రూ.1,102 కోట్లు కేటాయించాం. వాటికంటే ఇప్పుడు 13.56 శాతం నిధులను తగ్గించారు.
అమ్మఒడి పథకానికీ ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తేడా లేకుండా ప్రతి తల్లికీ ఇస్తామని చెప్పి.. ప్రస్తుత బడ్జెట్‌లో మాత్రం 43 లక్షల మందికి మాత్రమే అని చూపారు.
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేసి, మద్యం విక్రయాలను పోత్సహించటం వైకాపా ప్రభుత్వానికే చెల్లింది.
సహజ మరణానికి చంద్రన్న బీమా కింద ఇచ్చే రూ.2 లక్షల మొత్తాన్ని సగానికి తగ్గించారు.
రాజధానికి రూ.500 కోట్లు, కడప ఉక్కు కర్మాగారానికి రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ప్లాంటు ఏర్పాటుకు తీసుకున్న భూమి చదును చేయటానికి కూడా సరిపోవు. రాజధానిలో ఇప్పటికే భూముల ధరలు భారీగా పతనమయ్యాయి.లక్షలాది కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు నిధుల్లో కోత పెట్టి రాష్ట్ర ప్రగతికి గండికొట్టారు.
ఆర్టీసీ విలీనం, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చిత్తశుద్ధి లేదు.
రాష్ట్ర రుణ బకాయిలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రోజుకో రకంగా మాట్లాడుతూ, పొంతనలేని లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.