ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రం మరో లేఖ

0
42

అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రం మరో లేఖ రాసింది. పీపీఏల పునఃసమీక్షపై మరోసారి ఆలోచించాలని కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్‌ లేఖలో పేర్కొన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు కేంద్రం కూడా సహకరిస్తుందని, ఈ తరుణంలో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయాలు పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని మంత్రి సూచించారు.

భారత్‌లోని సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆర్‌కే సింగ్‌ తెలిపారు. దేశంలో సౌర, పవన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఆటంకం కలిగితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదముందని, చట్టానికి లోబడి అన్ని అంశాలను  పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు.

గతంలోనూ ఇదే విషయంపై ఏపీ ప్రధాన కార్యదర్శికి  కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. మరోవైపు పీపీఏలను పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సీఎం జగన్‌ దీనిపై ఓ కమిటీని నియమించారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రే స్వయంగా లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వం పీపీఏలపై పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.