కదలకపోతే వెన్నుపాము కరుస్తుంది!

0
63

కంప్యూటర్‌, టీవీ, మొబైల్‌ ఫోన్‌.. మనిషిని కదలకుండా ఒకరకంగా కట్టిపడేస్తున్నాయి. ఇలా ఒకే చోట కదలకుండా ఉండటమంటే మీ వెన్నుకు మీరు చేటు చేసుకున్నట్లే. అదే పనిగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను డిస్కుల్లో ఇబ్బందులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*  40 నిమిషాల కంటే ఎక్కువ కూర్చుంటే నష్టమే
* నగరంలో పెరుగుతున్న వెన్నునొప్పి బాధితులు
గతంతో పోల్చితే నడుము నొప్పి, వెన్ను నొప్పితో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, అధిక పనిగంటలు, నిద్రలేమి వల్ల ఎక్కువ మంది వెన్నెముక నొప్పికి గురవుతున్నారు. యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘నడుం నొప్పికి అత్యాధునిక చికిత్స’ అనే అంశంపై శుక్రవారం నగరంలో కార్యశాల నిర్వహించారు. యువత, వయసు మీదపడుతున్న వారు, మహిళలు వెన్నెముక నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఎవరు ఎందుకు..?
* యువత: ఐటీ, డెస్క్‌ ఉద్యోగులు ఎక్కువగా కూర్చొని ఉద్యోగం చేస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఇబ్బందిపడుతున్నారు.
* మహిళలు: మహిళల్లోనూ సమస్య అధికం. హర్మోన్లలో మార్పులు, ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం, జాగ్రత్తలు తీసుకోకుండా బరువులు ఎత్తడం నడుంనొప్పికి కారణమవుతున్నాయి.
* పెద్దలు వయస్కులు: వయసు మీదపడే పడే కొద్ది సమస్యలు వస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు అవసరం..
* జీవనశైలిలో మార్పుల వల్ల చాలా మందిలో శారీరక శ్రమ తగ్గింది. వ్యాయామం లేకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా 25 ఏళ్లు దాటితే ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి.
* ఈ క్రమంలో ప్రతి 40 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి 10-15 సెకండ్లు అటుఇటు తిరగాలి.
* బరువు తగ్గిపోవాలని చాలామంది తిండి మానేసి ఎక్కువ సమయం జిమ్‌ల్లో గడుపుతుంటారు. శక్తికి మించిన బరువులు ఎత్తేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. నిపుణుల పర్యవేక్షణ లేకుండా బరువులు ఎత్తే ప్రయత్నం వద్దు.

* సమతుల్య ఆహారం తీసుకోవాలి.
* సుక్షితులైన నిపుణులు తోడు లేకుండా సాహాస క్రీడల్లో పాల్గొనకూడదు.
* ఎక్కువ దూరం బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది.

ఎక్కువ కూర్చుంటే ఏమవుతుంది..?
రోజుల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఆ ప్రభావం వెన్నులోని లిగమెంట్లుపై పడుతుంది. చివరికి ప్రభావం పడే డిస్కుల్లో సమస్య ఏర్పడుతుంది. అదే నొప్పిగా వెంటాడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిత్యం ప్రయాణించే వారిలోనూ..
నగరంలో చాలామంది శివార్లలోని సంస్థల్లో పనిచేస్తుంటారు. నిత్యం 40-80 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువ మంది సొంత వాహనాలు లేదంటే బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో కుదుపులు వెన్నుపై ప్రభావం చూపుతున్నాయి. ఇవేకాక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, అధిక బరువు అన్నీ కలిసి వెన్ను ఆరోగ్యానికి నష్టం చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
తరచూ వేధిస్తుంటే నిర్లక్ష్యం వద్దు
-డాక్టర్‌ సుకుమార్‌ సూర, సీనియర్‌ స్పైస్‌ సర్జన్‌, యశోద
వెన్ను నుంచి కాళ్ల వరకు నొప్పి తరచూ వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. ఒక్కోసారి అధిక శ్రమ, ఒత్తిడి వల్ల నడుం నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవడం…మందులు తీసుకోవడం ద్వారా పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిసారి అదే నొప్పి వస్తుంటే వెంటనే డిస్క్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించాలి. నిపుణులను సంప్రదించాలి. వెన్ను నొప్పిని నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల డిస్క్‌ బయటకు వచ్చి నరాలపై ఆ ప్రభావం పడుతుంది. చివరికి యూరిన్‌ ఆగిపోయి ప్రాణాల మీదకు తెస్తుంది.