లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్‌త్రో ఆ జట్టు ఆశలను సమాధి చేసింది. ఈ విషయంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. అత్యంత కీలక సమయంలో బంతి అలా స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడం నమ్మశక్యంగా లేదు. ఇది అస్సలు బాగోలేదు. ఇలాంటి ఘటన భవిష్యత్‌లో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే.. మ్యాచ్ ఆఖరిఓవర్ చివరి మూడు బంతులకు ఇంగ్లాండ్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్ చేయగా బెన్‌స్టోక్స్ ఆడిన బంతి డీప్ మిడ్‌వికెట్ మీదుగా వెళ్లింది. బ్యాట్స్‌మెన్ రెండో పరుగుకు ప్రయత్నిస్తుండగా ఫీల్డర్ విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరింది. దీంతో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరగులు(రెండు పరుగులు + ఒక బౌండరీ) లభించాయి. కాగా తన బ్యాట్ వల్ల ఓవర్‌త్రో రావడంపై బెన్‌స్టోక్స్ తన తప్పేమీ లేదని, అది అనుకోకుండా జరిగిపోయిందని విలియమ్సన్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు.
తర్వాత రెండు బంతులకు మూడు పరుగులు అవసరమైన స్థితిలో స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించాడు. ఒక పరుగు పూర్తిచేసి రెండో పరుగుకు వెళ్తుండగా అదిల్‌రషీద్ రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించగా ఈసారి మార్క్‌వుడ్ రెండో పరుగుకు రనౌటయ్యాడు. ఈ నేపథ్యంలో 50 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇరు జట్లూ 241 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్‌కి వెళ్లారు. ఇక్కడ కూడా రెండు జట్లు 15 పరుగులు చేసి సమానంగా నిలిచినా మ్యాచ్ మొత్తంలో అత్యధిక బౌండరీలు బాదిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.