ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్
మ్యాచ్ టై, సూపర్ ఓవరూ టై
హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్‌ను గెలిపించిన స్టోక్స్
లండన్
ఎన్ని దశాబ్దాల కల.. ఎంత సుదీర్ఘ నిరీక్షణ.. ఎన్ని సంవత్సరాల తపస్సు!
ఎంత పోరాటం.. ఎంత శ్రమ!
… ఎట్టకేలకు పుట్టిల్లు పులకరించింది. ఇన్నేళ్ల వేదన తీరేలా, మనసు నిండేలా ఇంగ్లాండ్ అనుకున్నది సాధించింది. జగజ్జేతగా నిలిచి.. తనివితీరా, సగర్వంగా తొలిసారి ప్రపంచకప్పును ముద్దాడింది. తొలి కప్పే కాదు.. నరాలు తెగే ఉత్కంఠలో అది గెలిచి తీరు ఇంగ్లాండ్ విజయాన్ని చిరస్మరణీయం చేస్తోంది. ఆ జట్టును గెలిపించిన స్టోక్స్ ఓ సూపర్ హీరోగా నిలిచిపోతాడు ఎప్పటికీ! మామూలు ఫైనలా అది..
లబ్ డబ్.. లబ్ డబ్! కిక్కిరిసిన మైదానంలో గుండె చప్పుళ్లూ వినిపించేంత ఉత్కంఠ. అటు ఇంగ్లాండ్‌తో ఇటు న్యూజిలాండ్‌తో విజయలక్ష్మి దోబూచులాడుతుంటే ప్రేక్షకులంతా మునివేళ్లపైనే. మన జట్టే లేనప్పుడు ఫైనల్‌తో మనకేం పని అనుకున్న భారతీయులూ టీవీలకు అతుక్కుపోయారు. నభుతో నభవిష్యత్ అన్న రీతిలో సాగిన తుదిపోరుతో ఉత్కంఠ, ఉద్వేగంతో ఊగిపోయారు.
బాధ్యతనంతా భుజాలపై వేసుకుంటూ స్టోక్స్ అద్భుతంగా పోరాడిన వేళ ఆశలు సన్నగిల్లిన స్థితి నుంచి ఇంగ్లాండ్ స్కోరును సమం చేయడమే ఉత్కంఠను తార స్థాయికి తీసుకెళ్లగా… ఆపై సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడం మ్యాచ్‌ను ప్రపంచకప్ ఫైనల్స్‌కే తలమానికంగా మార్చింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ఒక్క‘టై’నా మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుగా ఇంగ్లాండే విజేతగా నిలిచింది. ఆఖరి బంతి పూర్తయిన క్షణాణ ఆతిథ్య జట్టు సంబరాల్లో మునిగిపోగా.. కివీస్ నిరాశలో మునిగిపోయింది. అయినా సర్వశక్తులు ఒడ్డిన న్యూజిలాండూ విజేతే! ఎవరైనా కాదంటారా?
అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠమధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నికోల్స్ (55; 77 బంతుల్లో 4×4), లేథమ్ (47; 56 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ మ్యాచ్‌ను టై చేసింది. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియగా.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆహా స్టోక్స్..: ఫైనల్ మ్యాచ్‌ను చూసినవారెవ్వరూ స్టోక్స్ ఆటను ఎప్పటికీ మరిచిపోలేరు. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు అతడు. రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అతడే! దాదాపు విజయాన్ని అందుకున్నట్లే కనిపించిన న్యూజిలాండ్‌కు ఏకైక అడ్డంకిగా నిలిచాడు స్టోక్స్. జేసన్ రాయ్ (17), జో రూట్ (7), బెయిర్‌స్టో (36), మోర్గాన్ (9) నిష్క్రమించగా.. 86/4తో ప్రమాదంలో ఉన్న స్థితిలో మ్యాచ్ ఇంగ్లాండ్ చేజారినట్లే అనిపించింది. కానీ స్టోక్స్ అద్భుతపోరాటం, అసాధారణ సంకల్పం, అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆతిథ్యను ఆదుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న న్యూజిలాండ్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ, సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండగా తీవ్రమవుతున్న ఒత్తిడిని తట్టుకుంటూ అతడు పోరాడాడు. బట్లర్ (59; 60 బంతుల్లో 6×4) అద్భుత సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సింగిల్స్ తీసుకుంటూ వీలైనప్పుడు బౌండరీలు కొడుతూ సాగిన ఈ జంట ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ కోలుకుంది. 44.4 ఓవర్లలో 196/4తో గెలుపుపై కన్నేసింది. సాధించాల్సిన రన్‌రేట్ కాస్త ఎక్కువగానే ఉన్నా… నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్ ధీమాతోనే ఉంది. కానీ వేగాన్ని పెంచే క్రమంలో బట్లర్, కాసేపటికే వోక్స్ (2) కూడా నిష్క్రమించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. స్టోక్స్‌కు కాసేపు సహకరించిన ప్లంకెట్ (10) 49వ ఓవర్లో జట్టు స్కోరు 220 వద్ద ఔటయ్యాడు. టెయిలెండర్లు చకచకా వెనుదిరుగుతుండగా స్టోక్స్ ఉత్కంఠను తట్టుకుంటూ అతికష్టంపై మ్యాచ్‌ను టైగా ముగించాడు.
న్యూజిలాండ్ కట్టడి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. నికోల్స్ రాణించినా ఓ దశలో 141/4తో ఉన్న కివీస్‌ను లేథమ్ ఆదుకున్నాడు. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42) న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు.
ఆఖరి ఓవర్లో..: ఆఖరి ఓవర్లో (బౌల్ట్) ఇంగ్లాండ్ విజయానికి 15 పరుగులు అవసరంకాగా.. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. తొలి రెండు బంతులకు ఒక్క పరుగూ రాకపోవడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. మూడో బంతికి స్టోక్స్ సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి ఇంగ్లాండ్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. స్టోక్స్ రెండు తీశాడు. శక్తినంత కూడదీసుకుని పరుగెత్తిన అతడు.. రెండో పరుగు ముగించడానికి ముందుకు డైవ్ చేయగా.. త్రో బ్యాటును తాకి బౌండరీకి దాటింది. అంటే నాలుగో బంతికి మొత్తం ఆరు పరుగులొచ్చాయన్నమాట. ఐదో బంతికి సింగిల్ వచ్చింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో రషీద్ ఔటైనా స్టోక్స్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. చివరి బంతికి ఇంగ్లాండ్ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. రెండో పరుగు తీసే క్రమంలో వుడ్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ ఎల్బీ (బి) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ ఎల్బీ (బి) వుడ్ 15; లేథమ్ (సి) విన్స్ (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) విన్స్ (బి) వోక్స్ 16; శాంట్నర్ నాటౌట్ 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 30 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241; వికెట్ల పతనం: 1-29, 2-103, 3-118, 4-141, 5-173, 6-219, 7-232, 8-240; బౌలింగ్: వోక్స్ 9-0-37-3; ఆర్చర్ 10-0-42-1; ప్లంకెట్ 10-0-42-3; వుడ్ 10-1-49-1; రషీద్ 8-0-39-0; స్టోక్స్ 3-0-20-0
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) లేథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లేథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9; స్టోక్ నాటౌట్ 84; బట్లర్ (సి) సౌథీ (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లేథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ రనౌట్ 0; వుడ్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 241; వికెట్ల పతనం: 1-28, 2-59, 3-71, 4-86, 5-196, 6-203, 7-220, 8-227, 9-240; బౌలింగ్: బౌల్ట్ 10-0-67-0; హెన్రీ 10-2-40-1; గ్రాండ్‌హోమ్ 10-2-25-1; ఫెర్గూసన్ 10-0-50-3; నీషమ్ 7-0-43-3; శాంట్నర్ 3-0-11-0