2024లో అధికారమే లక్ష్యం
ఐదేళ్ల తెదేపా పాలనలో భారీగా అవినీతి
కొత్త ప్రభుత్వం అలాగే చేస్తే ఊరుకోం
ప్రత్యామ్నాయం మనమే: రాంమాధవ్
కుటుంబ పాలనవల్లే
బాబు ఓటమి: చౌహాన్
పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం
తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎదుగుదాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం. ఆ దిశగా పార్టీ కార్యాచరణ ఉండాలి. రాష్ట్రంలో పార్టీ బలపడటానికి మంచి అవకాశముంది. సద్వినియోగం చేసుకోవాలి’ అని భాజపా రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ దిశానిర్దేశం చేశారు. 2024లో రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా భాజపా దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు ఆదివారం గుంటూరులో పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెదేపాపై భ్రమలు తొలగిపోయాయని, ఐదేళ్ల పాలనలో ఆ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇక ఆ పార్టీ తానా సభలు నిర్వహించుకోవడానికే పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. భవిష్యత్తుపై ప్రజలకు భరోసా కల్పించాలి. మోదీ పాలనపట్ల ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరడానికి వస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా ఆకర్షితులవుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘గత తెదేపా పాలనలో మాదిరిగా ప్రస్తుతం ప్రభుత్వంలో అవినీతి పునరావృతమైతే భాజపా చూస్తూ ఊరుకోదు’ అని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతరం సాయం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదును పార్టీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 2015లో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని, 2019లో అది 15 కోట్ల నుంచి 16 కోట్లు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనవల్లే చంద్రబాబు ఓటమి పాలయ్యారని, ఇది జగన్‌కు గుణపాఠం కావాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సభ్యత్వ నమోదు కమిటీ ఛైర్మన్ శివరాజ్‌సింగ్ చౌహాన్ హెచ్చరించారు. బాబు మాదిరిగా జగన్ కుటుంబ, కుల రాజకీయాలను చేస్తే ప్రజలు సహించరని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపాల చిరునామా గల్లంతేనని, రానున్న రోజుల్లో వైకాపా, భాజపాల మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 నెలలపాటు వేచి చూస్తామని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా ఉద్యమిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సుజనా చౌదరి, హరిబాబు, పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ దాసరి శ్రీనివాసులు, సునీల్ ధియోదర్, సతీష్ జీ, సత్యకుమార్ ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా తెదేపాకు చెందిన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, చందు సాంబశివరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు తదితరులు భాజపాలో చేరారు.
25 లక్షల సభ్యత్వాలు లక్ష్యం
రాష్ట్రంలో 25 లక్షల మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో ఆదివారం ఆయన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య నిధుల అంతరం రూ.15వేల కోట్లు కాగా.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.17వేల కోట్లిచ్చిందని చెప్పారు. ఈ నిధులను నేరుగా ఇవ్వకుండా ప్రాజెక్టుల అవసరాలనుబట్టి విడుదల చేశామని తెలిపారు. డబ్బు నేరుగా జేబులో వేసుకోవడానికి వీలు కానందున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీపై బురద జల్లారని చౌహాన్ విమర్శించారు. ఓడ మునిగిపోతుంటే దాని సారథి చివరి వరకూ ఉండి బయటపడేసేందుకు ప్రయత్నిస్తారని, రాహుల్ గాంధీ మాత్రం అందుకు భిన్నంగా పార్టీ మునిగిపోతుంటే ముందు తానే బయటపడ్డారని వ్యాఖ్యానించారు.
సభ్యత్వ నమోదు ప్రారంభం
గన్నవరం టౌన్: కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం భాజపా సభ్యత్వ నమోదును శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఓ మహిళకు సభ్యత్వ నమోదు కార్డును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో భాజపా విజయం సాధించలేదో అక్కడ పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, నాయకులు సునీల్ ధియోదర్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ నాయకుడికి పాదపూజ
విద్యాధరపురం: పెద్దలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని శివరాజ్‌సింగ్ చౌహన్ పేర్కొన్నారు. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విజయవాడకు వచ్చిన ఆయన పాతబస్తీ బ్రాహ్మణవీధిలో నివాసముంటున్న భాజపా సీనియరు నాయకుడు డోగిపర్తి శ్రీనివాసరావు దంపతులకు పాదపూజ చేశారు.