ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని

0
52

డన్‌: ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని కివీస్‌ జట్టు ప్రధాన కోచ్‌ గ్యారీస్టెడ్‌ అభిప్రాయపడ్డారు. లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ఇరు జట్లూ తొలుత 241 పరుగులు చేయగా తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ 15 పరుగులే చేశాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీల బాదిన ఇంగ్లాండ్‌ జట్టునే విశ్వవిజేతగా ప్రకటించారు. మ్యాచ్‌ తర్వాత న్యూజిలాండ్‌ కోచ్‌ను ఓ క్రీడా ఛానెల్‌ ఈ విషయంపై ప్రశ్నించగా ఆయన పై విధంగా పేర్కొన్నారు. ‘రెండు జట్లనూ విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సింది’ అని చెప్పాడని ఓ క్రీడా ఛానెల్‌ పేర్కొంది.

ఇదే విషయంపై కివీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌ క్రేగ్‌ మెక్‌మిల్లన్‌ మాట్లాడుతూ రెండు జట్లనూ విజేతలుగా ప్రకటించడమే సరైందని అన్నాడు. ‘ఫలితాన్ని ఇప్పుడు మార్చలేం. ఏడు వారాల పాటు సాగిన ఇలాంటి పెద్ద ఈవెంట్‌లో.. ఫైనల్స్‌లో రెండు జట్లూ సమాన స్కోర్లు సాధించి తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ అలాగే నిలిచాయంటే ఒక్కరినే విజేతగా ప్రకటించడం సమర్థించలేము. ఇరు జట్లనూ విజేతగా ప్రకటించడమే సరైన నిర్ణయం. జరిగిపోయినదాన్ని మార్చలేం. ఈ ఫలితం పట్ల నిరాశ చెందినా అవి ఆటలోని నియమాలు’ అని చెప్పుకొచ్చాడు.