కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు మాట్లాడారు

0
51

అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదని.. గత కొన్నేళ్లుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారు పోరాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లపై తనను విమర్శిస్తే తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని.. దానికి స్పీకర్‌ అవకాశం ఇవ్వాలన్నారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు మాట్లాడారు.  పదిశాతం రిజర్వేషన్లు ఓసీలకు ఇస్తే.. అందులో కాపులకు 5 శాతం కేటాయిస్తూ తమ ప్రభుత్వ హయాంలో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కాపులకు 5శాతం బిల్లుపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం చేసేందుకే కాపులకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. దీనిపై వైకాపా ప్రభుత్వం తమ వైఖరిని సూటిగా తెలియజేయాలన్నారు.

కాపులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: అంబటి

కాపుల సమస్యలు పరిష్కరిస్తామని తెదేపా గతంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సమస్యలు పరిష్కరించనందున తెదేపా అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో అంబటి మాట్లాడుతూ.. తెదేపా ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచిందని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారని చెప్పారు. నిర్ణీత వ్యవధిలో కాపుల సమస్యను పరిష్కరిస్తారని చెప్పి.. వారికి ఎలాంటి న్యాయం చేయనందున చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.