అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదల ఉద్ధృతి కొనసాగుతోంది

0
29

గువహటి: అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ధాటికి బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు తీవ్ర రూపం దాల్చాయి. పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్‌, పుతీమరి, బేకి, బరాక్‌, బాదర్‌పూర్‌ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గువహటి సహా దాదాపు 33 జిల్లాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4620 గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అసోం ప్రభుత్వం 226 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. లక్షా రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం సైన్యం సహా మరిన్ని సహాయ బృందాలను పంపుతామని తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరకుల అందజేత కోసం రాష్ట్రవ్యాప్తంగా 562 సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సాయంగా అసోం విపత్తు నిర్వహణ సంస్థకు కేంద్రం రూ.251 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సాయం అందుతోందని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సోనోవాల్‌తో రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. వరదల కారణంగా రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన శాసనసభ సమావేశాలను జులై 26కు వాయిదా వేశారు. అటు త్రిపుర, మేఘాలయలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. అనేక గ్రామాలు నీట మునిగాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

బిహార్‌నూ ముంచెత్తుతున్న వరదలు…
బిహార్‌లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తుతున్నాయి. పరీవాహక ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 33 మంది మృతి చెందారు. ఒక్క సీతామర్హ జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడడం గమనార్హం. వరదల కారణంగా 12 జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హాజీపూర్‌ పరిధిలో కామ్‌తౌల్‌, జోగియర మధ్య రైల్వే బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. రాష్ట్రంలోని కోసి, బాగమతి, మహానంద నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్త్తున్నాయి. దీంతో వరద ముంపునకు అవకాశం ఉండే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు లక్షా 11 వేల మంది పునరావాస శబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.  వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు సమాచారం. విపత్తు నిర్వహణ బృందం నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది.