అమరావతి : ఇసుక అక్రమ రవాణాలో వైకాపా నేతలు జుట్లు పట్టుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో రాజధానిలో పనులు నిలిచిపోయాయన్న చంద్రబాబు.. భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళల ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయితే సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైకాపా శ్రద్ధ పెట్టిందని ఆయన మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కంపెనీలకు నష్టం రాకూడదు.. ఇతరుల కంపెనీలు మాత్రం నష్టాల్లో మునిగిపోవాలి అనేదే ఆయన దురాలోచన అని దుయ్యబట్టారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల్లో భరోసా నింపేలా వైకాపా ప్రభుత్వ చర్యలు లేవని విమర్శించారు. కౌలు రైతులకు రెండేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చిన ఘనత తెదేపాదేనన్నారు. కంపెనీలన్నీ మూతపడే దుస్థితి తెస్తున్నారని దుయ్యబట్టారు. యువత ఉపాధి పోగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అన్నివర్గాల సమస్యలు సభలో వినిపించాలని, పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీనేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత-నిర్మాణ రంగం కుదేలుపై తెలుగుదేశం సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.