భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీస్. బౌల్ట్ సంధించిన బంతి విరాట్ కోహ్లి మోకాలి పైభాగంలో ప్యాడ్‌ను తాకింది. అంపైర్ ఔటివ్వగా.. సమీక్షలో బంతి బెయిల్ పైభాగంలో తాకుతున్నట్లు తేలింది. కనీసం బంతి పరిమాణంలో 50 శాతం బంతి బెయిల్స్‌కు తాకట్లేదు. కానీ నిర్ణయం ‘అంపైర్ కాల్’ అని వచ్చింది. ఫీల్డ్ అంపైర్ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్. ఇన్నింగ్స్ తొలి ఓవర్. బౌల్ట్ విసిరిన మొదటి బంతే జేసన్ రాయ్ ప్యాడ్‌ను తాకింది. మిడిల్ స్టంప్ లైన్‌లో పిచ్ అయిన బంతి స్వింగ్ అవుతూ బ్యాట్‌కు దొరక్కుండా ప్యాడ్‌ను ముద్దాడింది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. సమీక్షలో బంతి 50 శాతం వరకు లెగ్ స్టంప్‌ను తాకుతుందని తేలింది. అయితే నిబంధనల ప్రకారమే టీవీ అంపైర్ దాన్ని ‘అంపైర్ కాల్’గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అంటూ అప్పీల్‌ను తిరస్కరించాడు.
పై రెండు సమీక్షల్లోనూ తుది నిర్ణయం ‘అంపైర్ కాల్’ అనే రాగా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చింది. స్టంప్స్‌ను 50 శాతం బంతి తగలకపోయినా కోహ్లి ఔటయ్యాడు. 50 శాతం బంతి వికెట్‌ను తగులుతున్నా రాయ్ నాటౌట్‌గా బతికిపోయాడు. ఈ వైరుధ్యమేంటో ఎంత ప్రయత్నించినా అర్థం కాదు! ప్రపంచకప్ ఫైనల్ వేదికకు సమీపంలోనే వింబుల్డన్ ఫైనల్ కూడా జరిగింది. అక్కడ కూడా డీఆర్‌ఎస్‌ను పోలిన సమీక్ష పద్ధతి ఉంది. అందులో లైన్ లోపలి వైపు, బయటి వైపు ఎక్కడైనా వెంట్రుక మందంలో బంతి తగిలినా ‘ఔట్’ ఇవ్వరు! టెన్నిస్‌లో నిబంధన అంత కచ్చితంగా ఉన్నపుడు.. క్రికెట్లో ఈ గందరగోళమేంటో?
ఫోర్త్ అంపైర్
ఐసీసీ ఈవెంట్.. అందునా ప్రపంచకప్‌లో అంపైరింగ్ నిర్ణయాల్లో తేడా వల్ల ఫలితాల్లోనే తేడా వచ్చేసింది. జట్ల రాతలు మారిపోయాయి. ప్రపంచకప్ జరుగుతున్నపుడు, అయిపోయాక కూడా అంపైరింగ్ నిర్ణయాలపై ఎడతెగని చర్చ జరగడం ఇప్పుడే చూస్తున్నాం. కోహ్లి, రాయ్‌ల ఉదంతాలే కాదు.. ఈ ప్రపంచకప్‌లో నోరెళ్లబెట్టేలా అంపైరింగ్ నిర్ణయాలు చాలానే ఉన్నాయి. ఆ నిర్ణయాలకు బలైన ఆటగాళ్లు ఎందరో! వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌శర్మ బ్యాట్‌కు బంతి ఎంతో దూరంలో ఉన్నా.. సమీక్షలో మూడో అంపైర్ ఔటిచ్చాడు. భారత్‌తో సెమీస్‌లో 74 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను ఫైనల్లో కీలక సమయంలో అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అప్పటికే గప్తిల్ డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవడంతో టేలర్‌కు సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. అయితే రీప్లేలో బంతి వికెట్ల పై నుంచి వెళ్తుందని స్పష్టంగా తేలింది. టేలర్ క్రీజులో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో! సెమీస్‌లో ధోని రనౌటైన బంతిపైనా విమర్శలు లేకపోలేదు. ధోని ఔటైన బంతికి 30 అడుగుల వృత్తం ఆవల ఆరుగురు ఫీల్డర్లు ఉన్నట్లు వెల్లడించిన వీడియో వైరల్ అయింది. నిబంధనల ప్రకారం మూడో పవర్‌ప్లేలో అయిదుగురు ఆటగాళ్లు మాత్రమే వృత్తం ఆవల ఫీల్డింగ్ చేయాలి. ఒకవేళ ఆ బంతి నోబాల్ అయినా సాంకేతికంగా ధోని రనౌట్ అయ్యేవాడే. కానీ బంతి వేయబోతుండగానే నోబాల్‌గా ప్రకటిస్తే ధోని షాట్ ఆడే తీరే వేరుగా ఉండి ఉండొచ్చు. ఊరికే ఒక పరుగొస్తోంది. తర్వాతి బంతికి ఫ్రీహిట్ కూడా ఉంటుంది. కాబట్టి సింగిలే తీసేవాడు కాదేమో. బౌల్డ్, క్యాచౌట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి గట్టిగా బ్యాట్ ఊపి బౌండరీ రాబట్టేవాడేమో! దీని వల్ల ఫలితమే మారిపోయేదేమో!
ఇక ఫైనల్లో స్టోక్స్ బంతిని తాకి బౌండరీకి వెళ్లినప్పుడు ఆరు పరుగులివ్వడంపైనా దుమారం రేగుతోంది. ఓవర్ త్రోకు ఐదు పరుగులే ఇవ్వాల్సిందంటూ ఐదు సార్లు ఐసీసీ ‘అంపైర్ అవార్డు ఆఫ్ ద ఇయర్’గా అవార్డు అందుకున్న సైమన్ టౌఫెల్ స్వయంగా తప్పుబట్టాడు. అదే జరిగితే మ్యాచ్ టై కాకపోయేదేమో! న్యూజిలాండే గెలిచేదేమో! నాకౌట్ దశ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో క్రిస్ గేల్‌ను ఒకే ఓవర్లో రెండుసార్లు ఎల్బీ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. రెండింట్లోనూ గేల్ సమీక్ష కోరగా.. అంపైర్ నిర్ణయాలు తప్పని తేలాయి. చివరికి మూడోసారి గేల్ ఔటయ్యాడు. ఒకసారి నిర్ణయం తప్పని తేలాక కూడా అంపైర్ జాగ్రత్త పడకుండా తప్పుడు నిర్ణయం ప్రకటించడాన్ని ఏమనాలి? బాగా ఆడుతున్న ఆటగాడి ఏకాగ్రత దెబ్బ తీయడానికి, ఒత్తిడి పెంచడానికి పదే పదే అప్పీల్ చేస్తుంటారు ప్రత్యర్థులు. అలాంటిది ఒకే ఓవర్లో అంపైర్ రెండు సార్లు ఔట్‌గా ప్రకటిస్తే ఇక ఆ ఆటగాడి ఏకాగ్రత దెబ్బ తినదా? ఆత్మవిశ్వాసం పడిపోదా? ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మానసికంగా ఆటగాడిపై ఎంతో ప్రభావం చూపుతాయన్నది స్పష్టం.
ఈ ప్రపంచకప్‌లో 10 జట్లు 102 సార్లు సమీక్షలు కోరాయి. అందులో 34 సార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పని (ఓవర్‌టర్న్‌డ్) తేలాయి. 19 మార్లు ‘అంపైర్ కాల్’ అని రాగా.. 49 సార్లు అంపైర్ల నిర్ణయాలే సరైనవి (స్ట్రక్ డౌన్) సమీక్షలో స్పష్టమైంది. అంటే మొత్తం రివ్యూల్లో 33.33 శాతం అంపైర్ల తీర్పు తప్పని స్పష్టంగా తేలడం గమనార్హం. ‘అంపైర్ కాల్’ అన్నా కూడా నిర్ణయం సందేహాస్పదం అన్నట్లే. ఒక తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిది ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో అత్యంత కీలకమైన సెమీస్, ఫైనల్లో తప్పుడు నిర్ణయాలు ఆటగాళ్ల నాలుగేళ్ల కలల్ని.. కష్టాన్ని చిదిమేశాయి. సెమీస్‌లో భారత్, ఫైనల్లో కివీస్‌లది అలాంటి పరిస్థితే. 19వ శతాబ్దంలో తయారు చేసిన నిబంధనల్లో కొన్ని ఇప్పటికీ కొనసాగుతుండటం.. డీఆర్‌ఎస్ సాధికారికంగా లేకపోవడం క్రికెట్‌కు నష్టం చేస్తున్నాయి. తటస్థ అంపైర్లు, మూడో అంపైర్, బాల్ ట్రాకింగ్, హాట్ స్పాట్, స్లో మోషన్ రీప్లేలతో సహా ఎన్నో సాంకేతిక ప్రయోగాలు చేస్తున్న ఐసీసీ.. అంపైరింగ్ వ్యవస్థను మరింత నిక్కచ్చిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం!
తప్పులే.. తప్పులు!
అత్యంత కీలకమైన ప్రపంచకప్ ఫైనల్లోనూ పేలవమైన అంపైరింగ్ చర్చనీయాంశమైంది. అంపైర్లు మూడు తప్పులు చేశారు. మొదట క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ (న్యూజిజిలాండ్)ను అంపైర్ ధర్మసేన ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. కానీ బ్యాట్స్‌మన్ ఆ నిర్ణయాన్ని సమీక్షించి విజయవంతమయ్యాడు. బంతి స్టంప్స్ మీది నుంచి వెళ్తున్నట్లు రీప్లేల్లో తేలింది. తర్వాత ధర్మసేనే మరో తప్పుతో అందరి దృష్టిలో పడ్డాడు. ప్లంకెట్ బౌలింగ్‌తో విలియమ్సన్ క్యాచ్ ఔటైనా అతడు గుర్తించలేదు. ఇంగ్లాండ్ అప్పీలును తిరస్కరించాడు. కానీ ఆ జట్టు సమీక్షలో గెలిచింది. బంతి.. విలియమ్సన్ బ్యాట్ అంచును తాకినట్లు రీప్లేల్లో తేలింది. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా మరో అంపైర్ ఎరాస్మస్ తప్పు చేశాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌ను ఎల్బీడబ్ల్యూ ఔటిచ్చాడు. బంతి వికెట్ల మీదుగా వెళ్తోందని రీప్లేల్లో తేలింది. అప్పటికే సమీక్షలు అయిపోవడంతో టేలర్ నిష్క్రమించక తప్పలేదు. |