విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయ భవనంపై ప్రభుత్వం మొగ్గు

0
42

అమరావతి: కొత్త గవర్నర్‌ను నియమించినందున రాజ్‌భవన్‌గా ఏ భవనాన్ని ఎంపిక చేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. విజయవాడలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని తాత్కాలికంగా రాజ్‌భవన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ భవనం విశాలంగానే ఉన్నప్పటికీ కార్యాలయంగా పనికొస్తుందే తప్ప నివాస యోగ్యం కాదు. అదే భవనాన్ని గవర్నర్‌ కార్యాలయంగా ఎంపిక చేస్తే.. ఆయన నివాసానికి మరో భవనాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహాన్ని కూడా తాత్కాలికంగా రాజ్‌భవన్‌గా ఎంపిక చేసే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రెండూ కాదనుకుంటే.. ఏదైనా విశాలమైన ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలికంగా రాజ్‌భవన్‌గా వినియోగించే అవకాశమున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు ప్రత్యామ్నాయాల్లో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఎంపిక చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం. కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సంప్రదించిన మీదట ఆయన ఆదేశాల మేరకు తాత్కాలిక రాజ్‌భవన్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

భద్రత దృష్ట్యా అదే అనుకూలం?
నగరం మధ్యలో ఉండటంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా కూడా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయ భవనమే రాజ్‌భవన్‌కు అనుకూలమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతిలోని పరిపాలన నగరంలో రాజ్‌భవన్‌ నిర్మించేందుకు సీఆర్‌డీఏ ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. నిర్మాణం దిశగా సన్నాహాలు లేవు. ఎంత వేగంగా పనులు చేసినా రాజ్‌భవన్‌ నిర్మాణానికి కనీసం ఏడాది పడుతుంది. అప్పటివరకు ప్రత్యామ్నాయం చూడాల్సిందే..! చంద్రబాబు సచివాలయానికి మారాక విజయవాడ కార్యాలయం కొన్నాళ్లు ఖాళీగానే ఉంది. హైకోర్టు విభజన తర్వాత అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక హైకోర్టుగా ఆ భవనాన్ని వినియోగించారు. హైకోర్టును అమరావతికి మార్చాక అది మళ్లీ ఖాళీగానే ఉంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం వద్దే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని తాత్కాలికంగా రాజ్‌భవన్‌గా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ఆ భవనాన్ని పరిశీలించి రాజ్‌భవన్‌గా ఎంపిక చేస్తే ఎలాంటి మార్పులు చేయాలన్న విషయంలో అవగాహనకు వచ్చారు. మరోపక్క అక్కడికి దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ అతిథిగృహంలో కూడా అవసరమైన మరమ్మతులకు సీఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం క్యాంపు కార్యాలయాన్ని కాదనుకుంటే.. ఈ భవనాన్నీ రాజ్‌భవన్‌గా పరిశీలించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.