అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా చర్చ జరుగుతూనే ఉందని, సభలో ప్రతి రోజూ జలవనరుల మంత్రి ఈ అంశంపై చర్చిస్తూనే ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంతా కుంభకోణాల మయమైందని ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇటీవలే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చానని, నాలుగు నెలలుగా పూర్తిగా పనులు ఆగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నవంబర్ నాటికి ప్రారంభించి 2021 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.
బిడ్డింగ్‌లో ఎవరు ఎంత తక్కువకు కోడ్ చేస్తారో వాళ్లకే అప్పగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిధులపై రీ బిడ్డింగ్ వేస్తే రూ.6,500 కోట్లు పనుల్లోనే 15 నుంచి 20 శాతం మధ్య మిగిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నట్లు జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. ‘‘ నామినేషన్ పద్ధతిలో ఇష్టమొచ్చిన గుత్తేదారును తీసుకొచ్చారు. యనమల వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశాం. పనులు ప్రారంభించకుండానే రూ.724 కోట్లు అడ్వాన్స్ కింద కట్టబెట్టారు. పోలవరంలో ఎంత దోచారో మరో 15 రోజుల్లో బయటికొస్తాయి. ఈ ప్రాజెక్టు విపరీతమైన కుంభకోణాలతో నిండిపోయింది’’ అని సీఎం జగన్ ఆరోపించారు.