వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసేందుకు జరగాల్సిన సెలక్షన్ కమిటీ సమావేశం అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. అయితే ధోని భవిష్యత్తేంటి! రిటైరవుతాడా.. కొనసాగుతాడా? అన్న ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
వచ్చే నెలలో వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్లను ఎంపిక చేసేందుకు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం ఆదివారానికి వాయిదాపడింది. బీసీసీఐ కార్యదర్శి స్థానంలో ఇక ప్రధాన సెలక్టరే సెలక్షన్ కమిటీ సమావేశాలకు కన్వీనర్‌గా ఉండాలన్న పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆదేశాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ‘‘నిబంధనలో మార్పు నేపథ్యంలో కొన్ని న్యాయపరమైన విధానాలను అనురించాల్సివుంది. అంతే కాకుండా.. సమావేశానికి కెప్టెన్ అందుబాటులో ఉన్నాడా లేదా అన్న అంశం గురించి క్రికెట్ ఆపరేషన్స్ బృందం సీఓఏ ఛైర్మన్‌కు వివరించాల్సివుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ నివేదికలు శనివారం సాయంత్రానికి అందుతాయి’’ అని వాయిదాకు గల కారణాలు చెప్పాడు ఓ బీసీసీఐ అధికారి. కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ నుంచి గురువారం ముంబయి చేరుకున్నాడు. ఆదివారం సమావేశంలో అతడు పాల్గొంటాడు! మొదట వన్డే, టీ20 సిరీస్‌లకు కోహ్లి దూరమవుతాడని తెలిసింది. అయితే అతడు పూర్తి పర్యటనకు అందుబాటులో ఉండాడన్నది తాజా సమాచారం. సమావేశం ఎప్పుడు జరిగినా అందరి దృష్టీ ధోని పైనే ఉందనడంలో సందేహం లేదు. బ్యాటింగ్‌లో ఒకప్పటి పదును లోపించిన 38 ఏళ్ల ధోనీపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆగస్టు 3న ఆరంభమయ్యే విండీస్ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.
కార్యదర్శి ఔట్: భారత జట్టు ఎంపిక ప్రక్రియలో కీలక మార్పు చోటు చేసుకుంది. బీసీసీఐ కార్యదర్శి స్థానంలో ఇక ప్రధాన సెలక్టరే సెలక్షన్ కమిటీ సమావేశాలకు కన్వీనర్‌గా ఉంటాడని పరిపాలకుల కమిటీ (సీఓఏ) చెప్పింది. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల్లో భాగంగా నిబంధనను మార్చింది. ఇకపై సెలక్షన్ సమావేశాలకు బోర్డు కార్యదర్శి హాజరు కారాదని స్పష్టం చేసింది. పాత రాజ్యాంగంలో సెలక్షన్ కమిటీ, కార్యదర్శి పరిధిలోకి వచ్చేది. అతడే సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు. సమావేశంలో కూడా పాల్గొనేవాడు.