విండీస్‌ పర్యటనకు జట్టును శుక్రవారం ఎంపిక చేయనున్నారు

0
29

ముంబయి: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పోరాటం ముగిసిన తర్వాత టీమిండియా పర్యటిస్తున్న తొలి దేశం వెస్టిండీస్‌. ఎంఎస్‌ ధోనీ, దినేశ్ కార్తీక్‌ వంటి సీనియర్లు వీడ్కోలు దశలో ఉన్నారు. శుభ్‌మన్ గిల్‌, పృథ్వీషా, నవదీప్‌ సైనీ, మయాంక్‌ అగర్వాల్‌ వంటి యువకులు పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, విజయ్‌ శంకర్‌ క్రమం తప్పకుండా జాతీయ జట్టుకు ఆడాలని పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో బీసీసీఐ సెలక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. విండీస్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేయనున్నారు. వారు ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎంఎస్‌ ధోనీపై ఫోకస్‌

జట్టులో 38 ఏళ్ల ఎంఎస్‌ ధోనీ పాత్ర ఏంటన్న అంశంపై సెలక్టర్ల సమావేశంలో ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. అతడిని కొనసాగిస్తారా? వీడ్కోలు తీసుకోవాలని చెప్తారా? లేదా తాత్కాలికంగా విశ్రాంతి ఇస్తారా? మార్గనిర్దేశకుడిగా కొనసాగిస్తారా? అన్న సందేహాలకు వారు జవాబు చెప్తారో లేదో చూడాలి. టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ రిషభ్‌పంత్‌ను ఇక రెగ్యులర్‌ కీపర్‌గా ఎంపిక చేస్తారా అన్నది శుక్రవారం తేలనుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. కాబట్టి ధోనీ వారసుడిగా పంత్‌ను ఎంపిక చేయడం లాంఛనమేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గత అక్టోబర్‌లో విండీస్‌, ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు మహీని ఎంపిక చేయని సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్‌ గాయపడడంతో ప్రపంచకప్‌లో పంత్‌ను ఆడించడాన్ని బట్టి అతడిపై సెలక్టర్లు విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. విండీస్‌తో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆగస్టు 3 నుంచి పర్యటన ఆరంభం కానుంది.

రోహిత్‌ సారథ్యం?

కరీబియన్‌ పర్యటనకు సారథి విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది సందేహమే! శుక్రవారం దీనిపై స్పష్టత రానుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం అవుతుండటంతో రెండు టెస్టుల్లో విరాట్‌ను భాగస్వామిని చేసే అవకాశం కనిపిస్తోంది. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా విషయంలోనూ ఇదే వైఖరి అవలంబించొచ్చు. టీమిండియా ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఎక్కువ క్రికెట్‌ ఆడనుంది కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించడాన్ని కొట్టిపారేయలేం.

పాండేకు పిలుపు!

భారత్‌ను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సమస్య అస్థిర మిడిలార్డర్‌. ప్రపంచకప్‌ ముందు 12 మందిని పరీక్షించి తేల్చిందేమీ లేదు. ఫలితంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ విభాగానికి కర్ణాటక ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండే, ముంబయి క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను సెలక్షన్‌ కమిటీ పరీశీలించనుంది. ఈ ముగ్గురూ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించారు. వెస్టిండీస్‌-ఏతో జరిగిన అనధికార మూడో వన్డేలో పాండే అద్భుత శతకం బాదాడు. రాయుడి నిష్ర్కమణ, విజయ్‌ శంకర్‌ వైఫల్యంతో ఈ త్రయానికి మళ్లీ టీమిండియా తలుపులు తెరుచుకున్నాయి. భారత్‌-ఏ తరఫున రాణిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా పైనా సెలక్టర్లు దృష్టి సారించనున్నారు.

జాదవ్‌ ఖేల్‌ ఖతం?

ప్రపంచకప్‌లో ఆకట్టుకోని దినేశ్‌ కార్తీక్‌, మహారాష్ట్ర ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌కు దాదాపుగా దారులు మూసుకుపోయినట్టే. ధావన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని తెలుస్తోంది. అలాగేతై రోహిత్‌తో కలిసి అతడే ఓపెనింగ్‌ చేస్తాడు. ఇక కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమ స్థానాలను కైవసం చేసుకుంటారు. తన స్పిన్‌ మాయాజలంతో వెస్టిండీస్‌-ఏపై ప్రస్తుతం అదరగొడుతున్న 19 ఏళ్ల రాహుల్‌ చాహర్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు. ముంబయి ఇండియన్స్‌ తరఫున అతడెలాంటి మాయ చేశాడో అందరకీ తెలిసిందే. భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమికి చోటు ఖాయమే. దిల్లీ యువ పేసర్‌, భారత్‌-ఏ పర్యటనలో తన పేస్‌తో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీపై సెలక్టర్లు ఓ కన్నేశారు. ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి టీమిండియా తలుపు తట్టొచ్చు. టెస్టుల్లో దేశంలో ఇప్పటికీ అగ్రశ్రేణి కీపర్‌గా భావిస్తున్న వృద్ధిమాన్‌ సాహా భవితవ్యం తేలనుంది.