‘జారుస్ డికేఫ్… ఫిలింనగర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో భిన్నమైన రుచుల కాఫీ లభించే రెస్టారెంట్… యువతులు.. విద్యార్థులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ప్రత్యేకంగా కాఫీ తాగేందుకు అక్కడికి వస్తున్నారు… కొందరు మాత్రం మరో ద్వారంలోంచి వెళ్తున్నారు. ఈ మార్గం వారికి మాత్రమే ప్రత్యేకం. లోపలికి వెళితే ఒక హాలు.. మంద్రమైన సంగీతం.. హుక్కా గొట్టాలు.. అక్కడికి వెళ్లినవారు సోఫాలో కూర్చుని సేద తీరుతూ హుక్కాలోని మత్తుమందును ఆస్వాదిస్తున్నారు.. స్థానికులు, యువకులు కొందరు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి హుక్కా కుండలను స్వాధీనం చేసుకున్నారు.’’
* హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయనేందుకు పై సంఘటన తాజా నిదర్శనం.
యువత.. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు నేరస్థులు హుక్కా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు వస్తున్న యువతీయువకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.. విద్యార్థుల పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. పోలీసులు పట్టుకుంటున్నా… హుక్కాకేంద్రాల యజమానులు వాటిని మరోచోట ప్రారంభిస్తుండడంతో కొందరు పోలీస్ అధికారులు గుట్టుగా మామూళ్లు తీసుకుంటూ అంతా సవ్యంగా ఉందంటూ ఉన్నతాధికారులకు చెబుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్ ఠాణాల పరిధుల్లో ఇవి కొనసాగుతున్నాయి.
భిన్నమైన కాఫీ రుచులు…
హనీ కెఫే.. చాక్లెట్ కేఫ్… స్మార్ట్ కాఫీ… పేర్లతో కొందరు వ్యాపారులు, నేరస్థులు హుక్కా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు కొన్ని కేంద్రాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పోలీసులు అప్పుడప్పుడు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో మళ్లీ అవి తెరుచుకుంటున్నాయి. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా హుక్కాకేంద్రాలు ఉన్నాయంటూ జీహెచ్‌ఎంసీకి పోలీసులు కొద్దినెలల క్రితం నివేదిక ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ స్పందించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో కొన్ని కేంద్రాల నిర్మాణాలను కూల్చేశారు. తర్వాత జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం మానేశారు. హుక్కా కేంద్రాల్లో నిబంధనలను పాటిస్తున్నారా?లేదా? అన్న అంశాలు వారికి తెలుసు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని హుక్కా కేంద్రాల తెరవెనుక కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నందునే ముందుకు వెళ్లేందుకు జంకుతున్నారు.
జనావాసాల్లోనే..
విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ, యువకులపై మత్తు వల విసిరే హుక్కా కేంద్రాలు ఎక్కువగా పశ్చిమ మండలంలో ఉన్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హుమాయూన్‌నగర్ పోలీస్ ఠాణాల పరిధుల్లోని జనావాస ప్రాంతాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఆపార్ట్‌మెంట్లు, రహదారిపై ఉన్న భవనాల్లోని ఫ్లాట్లలో వీటిని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఇళ్లమధ్య హుక్కాకేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారు వాహనాలన్నీ రహదారుల పక్కనే నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* బంజారాహిల్స్ పోలీస్ ఠాణా పరిధిలో రోడ్ నంబర్ 11, రోడ్ నంబర్ 12, ఆషా ఆసుపత్రి సమీపంలో, రోడ్ నంబర్ 3లో హుక్కా కేంద్రాలు రాత్రి వేళల్లో కొనసాగుతున్నాయి. ఇందులో రెండు కేంద్రాలు తెల్లవారుజాము వరకూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
* జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ప్రధాన కార్యాలయం సమీపంలో, ప్రముఖ నగల దుకాణం వెనుక హుక్కా కేంద్రాలు కొనసాగుతున్నాయి.
* పంజాగుట్ట పోలీస్ ఠాణా పరిధిలో సోమాజిగూడలో ఒక కేంద్రం తెల్లవారుజామున 3 గంటల వరకూ హుక్కాలో మత్తుమందును వినియోగదారులకు అందిస్తోంది.
ముందే సమాచారం…
హుక్కా కేంద్రాలు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు, నేరస్థులతో కింది స్థాయి పోలీస్ అధికారులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు హుక్కా కేంద్రాల యజమానుల నుంచి నెలానెలా మామూళ్లు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి కొన్నిచోట్ల ఆకస్మికంగా దాడులు చేయండి అంటూ ఆదేశిస్తున్నారు. హుక్కా కేంద్రాలపై దాడులు చేస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని మామూళ్లు తీసుకుంటున్న వారు ముందే సమాచారం ఇస్తున్నారు. దీంతో ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పోలీసులు పైకి రాకుండా లిఫ్ట్ నిలిపివేయడం, వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్‌లోని ఒక హుక్కా కేంద్రంలో మత్తుపదార్థాలను విక్రయిస్తూ ముంబయికి చెందిన ఇద్దరు గతంలో దొరికిపోయారు. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కొన్ని హుక్కా కేంద్రాలను భవనాల టెర్రస్‌లపై ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్లలో ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న రెండు హుక్కాకేంద్రాల నిర్వాహకులు మైనర్లను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించి వారిని రప్పించుకుంటున్నారు. ఈ మేరకు ఆయా కేంద్రాలపై గతంలో కేసులు నమోదయ్యాయి. చట్టంలో కొన్ని లోపాలు, హుక్కా మత్తుపదార్థం కిందికి రాదంటూ నిర్వాహకులు వాదిస్తుండడంతో వారిపై కేసులు నమోదైనా వెంటనే బెయిల్‌పై వస్తున్నారు.