తెలుగు టైటాన్స్… ఈ మాట వినగానే ముందుకు గుర్తొచ్చే పేరు రాహుల్ చౌదరి. అతడు లేని టైటాన్స్ జట్టును ఊహించుకోవడం కష్టం. గత ఆరు సీజన్లలో జట్టుతో కలిసి ప్రయాణించిన అతను ఈ సారి తమిళ్ తలైవాస్ తరపున బరిలో దిగనున్నాడు. పీకేఎల్ ఆరంభ సీజన్ నుంచి టైటాన్స్‌కు ఆడి లీగ్‌కే వన్నె తెచ్చిన రాహుల్ దూరమవడం జట్టుకు లోటే. కానీ ఆ లోటును పూడ్చడానికి.. టైటాన్స్ టైటిల్ కరవునుతీర్చడానికి.. వస్తున్నాడు సిద్ధార్థ్ దేశాయ్. అరంగేట్ర సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబరచిన అతనిపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. శనివారం ఏడో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో యు ముంబాతో టైటాన్స్ సొంతగడ్డపై తలపడనున్న నేపథ్యంలో దేశాయ్ ఏ మేరకు అంచనాలను అందకుంటాడన్నది ఆసక్తికరం.
సీజన్ ఆరంభంలో వరుస విజయాలలో ఆశలు చిగురింపజేయడం, మధ్యలో తడబడి కంగారు పెట్టడం, చివర్లో పేలవ ప్రదర్శనతో ఓటమి పాలై తీవ్ర నిరాశకు గురిచేయడం..! ఇదీ పీకేఎల్ చరిత్రలో తెలుగు టైటాన్స్ ప్రయాణం. ప్రతి సీజన్‌లోనూ మొదట బలంగా కనిపించే టైటాన్స్.. ఆఖరుకు తుస్సుమనిపించడం అలవాటుగా మార్చుకుంది. గత ఆరు సీజన్లలో జట్టుకు వెన్నెముకలా ఉన్న రాహుల్ చౌదరి ఇప్పుడు లేడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ పీకేఎల్‌లో ఆడింది కేవలం ఒకే ఒక్క సీజన్. మరోవైపు కొత్త కోచ్, కెప్టెన్.. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏడో సీజన్‌కు టైటాన్స్ సిద్ధమైంది. డిఫెన్స్‌లో బలంగా కనిపిస్తున్న జట్టు.. రైడింగ్‌లో మాత్రం సిద్ధార్థ్‌నే నమ్ముకుంది.
సిద్ధార్థ్.. సిద్ధార్థ్: వేలంలో రూ.1.45 కోట్ల భారీ మొత్తం చెల్లించి మరీ సిద్ధార్థ్‌ను సొంతం చేసుకుంది టైటాన్స్. అతడిపై తెలుగు అభిమానులకు భారీ ఆశలు, భారీ అంచనాలు ఉన్నాయి. గత సీజన్‌లోనే పీకేఎల్‌లో అడుగుపెట్టిన అతను అరంగేట్రంలోనే యు ముంబా తరపున 21 మ్యాచ్‌ల్లో 218 రైడ్ పాయింట్లు సాధించాడు. రైడింగ్‌లో సిద్ధార్థే జట్టుకు కీలకం అవుతాడనడంలో సందేహం లేదు. ఐతే రైడింగ్‌లో టైటాన్స్ జట్టు పాత పొరపాట్లనే మళ్లీ చేస్తోంది. ఒకే ఆటగాడిపై ఎక్కువగా ఆధారపడుతోంది. గతంలో రాహుల్.. ఇప్పుడేమో సిద్ధార్థ్. రైడింగ్ విభాగంలో సిద్ధార్థ్‌కు గొప్ప సహకారం అందించే చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. సిద్ధార్థ్ అన్న సూరజ్ దేశాయ్‌తో పాటు యువ ఆటగాడు రాకేశ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.
డిఫెన్స్‌లో తిరుగులేదు: టైటాన్స్ జట్టు మరోసారి డిఫెన్స్‌లో బలంగా కనిపిస్తోంది. డిఫెండర్లు అబోజర్, విశాల్ భరద్వాజ్‌లతో పాటు అరుణ్‌లతో కూడిన జట్టు పటిష్ఠంగా ఉంది. ఎంతటి బలమైన రైడింగ్ విభాగానికైనా మన డిఫెన్స్ బృందం సవాళ్లు విసరగలదు. మరోవైపు అబోజర్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టాడు. అతడు గత సీజన్ ప్రదర్శన (21 మ్యాచ్‌ల్లో 56 ట్యాకిల్ పాయింట్లు)ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. విశాల్ తన జోరు కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. ఆరో సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లోనే 60 ట్యాకిల్ పాయింట్లు సాధించిన అతడు మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కుడి చివర అబోజర్, ఎడమ చివర విశాల్ నిలబడ్డారంటే ఎంతటి ఆటగాడైనా చూసుకొని ఆడాల్సిందే. ఈ ద్వయం మరోసారి మాయ చేసి జట్టుకు విజయాలు అందించాలి. ఇరాన్ ఆల్‌రౌండర్ ఫర్హాద్ కూడా కీలక ఆటగాడే. మరోవైపు యు ముంబా జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇరాన్ డిఫెండర్ ఫజల్ అత్రచలి నాయకత్వంలో ఆ జట్టు బలంగానే ఉంది. సందీప్ నర్వాల్, సురేందర్ సింగ్, యంగ్ చాంగ్, రోహిత్ బలియాన్, డాంగ్ గియాన్ లీ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు.
పీకేఎల్ చరిత్రలో వెయ్యి పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచేందుకు రాహుల్ చౌదరి (876)కి మరో 124 పాయింట్లు, పర్దీప్ నర్వాల్ (865)కు 135 పాయింట్లు కావాలి. |
అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పర్దీప్ నర్వాల్ (858), రాహుల్ చౌదరి (825) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అజయ్ ఠాకూర్ (732) మూడో స్థానంలో ఉన్నాడు. |
302అత్యధిక ట్యాకిల్ పాయింట్ల రికార్డు. మంజీత్ చిల్లర్ పేరిట ఉంది. |
టైటాన్స్ జట్టు:
రైడర్లు: అమిత్, అంకిత్, కమల్ సింగ్, శివగణేశ్ రెడ్డి, మల్లిఖార్జున్, రజ్నీశ్, రాకేశ్, సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్
డిఫెండర్లు: ఆకాశ్ దత్, ఆకాశ్, మనీశ్, అరుణ్, అబోజర్, కృష్ణ, విశాల్
ఆల్‌రౌండర్లు: అర్మాన్, ఫర్హాద్