గోరా శాస్త్రి శ‌త‌జ‌యంతి సంద‌ర్బంగా..

0
72

గురువుః ప్ర‌తిప‌క్ష‌మ‌న‌గానేమీ?
శిష్యుడుః ఏంటో ఈ గురువు.. అన్నీ శిష్యుడ్ని అడిగి తెలుసుకుంటాడు.. అదే గురూ మ‌గాడు
గురువుః మ‌ధ్య‌లో ఈ మ‌గ ఆడ తేడాలేంట్రా నాయ‌నా.. అస‌లే.. దేశంలో ఈ గొడ‌వ ఎక్కువై పోతుంటేనీ..
శిష్యుడుః ఇప్పుడు ఇంట్లో పెత్త‌నం అదే అధికారం ఎవ‌రికి ఉంటుంది గురూ?
గురువుః ప్ర‌శ్న‌కు ప్ర‌శ్న స‌మాధానం కాద‌ని వీడికెప్పుడు తెలుస్తుందో.. స‌రే నువ్వ‌న్న‌ట్టు ఆడ‌వాళ్ల‌కే
శిష్యుడుః ఎప్పుడైతే.. ఆడవాళ్ల‌కు అధికార‌ముంటుందో.. అక్క‌డ ప్ర‌తిప‌క్షం ఏది అధ్య‌క్షా?
గురువుః మ‌ళ్లీ ప్ర‌శ్న‌కు ప్ర‌శ్న‌.. స‌రే నువ్వ‌న్న‌ట్టు మ‌గాళ్లే..
శిష్యుడుః మ‌రి ప్ర‌తిప‌క్ష‌మంటే మ‌గాడ‌న్న నా స‌మాధానం క‌రెక్టా కాదా?
గురువుః ఛా ఊర్కో.. ఏ ప‌క్షంలో ఉన్నా.. ఆడ‌దాని ముందు మ‌గాడేపాటి.
శిష్యుడుః మీరు మ‌ళ్లీ పాయింటు క‌ట్టుద‌ప్పుతున్నారు.. ఇంత‌కీ ఈ ప్ర‌తిప‌క్షం గోలేంటి మ‌ధ్య‌లో?
గురువుః అదేగా నా బాధ‌.. ఈ జ‌న‌మేంటి?
దేశంలో ప్ర‌తిప‌క్ష‌మ‌న్న‌దే లేకుండా పోతోంద‌ని ఏడుస్తున్నారు?
శిష్యుడుః దేశంలో మ‌గ‌జాతి అంత‌రించి పోతోంద‌న్న బాధ కొద్దీ అలా అనుంటారేమో గురూ..
గురువుః ఓరి నాయ‌న‌.. క‌ట్టి పెట్టు నీ ఇంటింటి రామాయ‌ణం.. ఇది అసెంబ్లీ పార్ల‌మెంటుకు సంబంధించిన రాజ‌కీయం..
శిష్యుడుః ఓహో అదా మీ ఆవేద‌నా.. ఇప్పుడ‌ర్ధ‌మైంది.. మీరంటుంటే గుర్తుకొస్తోంది నిజ‌మేనండోయ్.. ఇక్క‌డ తెలంగాణ‌లో చూస్తే ప్ర‌తిప‌క్ష‌మే లేదా? ఉన్న చేతుల్లోని ఎక్కువ శాతం చేతులు కారు స్టీరింగ్ ప‌ట్ట‌డం వ‌ల్ల‌.. అపోజిష‌న్ మొత్తం ఖాళీ అయిపోయిందా? ఇటు చూస్తే సైకిలూ, క‌మ‌లం చేరో సీటు త‌ప్ప మ‌రేం మిగ‌ల్లేదా? దీంతో చెప్పేదేముందీ.. గాలిప‌ట‌మే వీళ్ల‌క‌న్నా అంద‌నంత ఎత్తులో ఉంది..
గురువుః ఇన్నాళ్ల‌కు నా పాయింటు క‌రెక్టుగా క్యాచ్ చేశావ్.. ఇక ఏపీలోనూ సీన్ అంతంత మాత్రంగా ఉందా?
పైన కేంద్రం సంగ‌తి స‌రే స‌రి.. అక్క‌డంతా పుష్ప వికాసం.. హ‌స్త విలాప‌మే.. ఉన్న చిన్నా చిత‌కాపార్టీలు కూడా రూపు షేపూ లేకుండా పోయే.. క‌త్తి కొడ‌వ‌లయితే సోదిలేకుండా పోయాయి..
శిష్యుడుః మీకో సంగ‌తి తెలుసా?
వామ‌ప‌క్ష పార్టీల‌కు జాతీయ హోదా మిస్స‌య్యే దుశ్శ‌కునం క‌నిపిస్తోంది గురూ..
గురువుః నువ్వ‌న్న‌ట్టు ప్ర‌తిప‌క్షం లేకుంటే.. మ‌గ పురుగే లేని ప్ర‌మీలారాజ్యం గుర్తొస్తుంది రా శిష్యా నాకు..
శిష్యుడుః ఇంత‌కీ అస‌లు ప్ర‌తిప‌క్ష‌మంటే ఏంటి గురూ?
గురువుః నేన‌డిగిన ప్ర‌శ్నే న‌న్నే అడుగుతాడు వీడొక‌డు..
శిష్యుడుః అబ్బ చెప్పండి గురూజీ..
గురువుః అస‌లు మ‌న పార్ల‌మెంటునీతి ఏమిటంటే..
శిష్యుడుః ఆ ఏమిటంటే..
గురువుః పార్ల‌మెంటు మొత్తం కూర్చుని అధికార ప్ర‌తిప‌క్ష‌మ‌న్న తేడా లేకుండా చ‌ర్చించి.. నిర్ణ‌యాలు తీసుకునేది.
శిష్యుడుః మ‌రిప్పుడో..
గురువుః ఒంటెత్తు పోక‌డ‌లు పోయేది..
శిష్యుడుః ఇప్ప‌టికీ అడుగుతున్నా.. ప్ర‌తిప‌క్షం లేకుంటే ఏంటంటా.. ఇప్పుడు చూడండి.. ఏపీలో.. సైకిల్ ఫ్యాన్ గుర్తులు అసెంబ్లీ సాక్షిగా సొంత పోరాటాలు ఎలా చేసుకుంటున్నాయో.. అదేదో ప్ర‌తిప‌క్ష‌మే లేకుంటే.. హాయిగా అధికార‌ప‌క్ష‌మే నిర్ణ‌యాలు తీసుకుని స‌భాస‌మ‌యం ప్ర‌జా ధ‌నం వృధాకాకుండా హాయిగా సాగిపోతుందిగా?
గురువుః నీకు ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెప్పాల‌నుకుంటా.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష‌మే లేద‌నుకో..
శిష్యుడుః అనుకున్నా..
గురువుః అధికార‌నాయ‌కుడు.. అంటే ముఖ్య‌మంత్రి ప్ర‌ధాని త‌దిత‌రులు ఏ నిర్ణ‌యం తీసుకుంటే.. అందుకు ఆ ప‌క్ష స‌బ్యులంతా క‌ల‌సి తాన తందాన అనాల్సిందే.. ఫ‌ర్ స‌పోజ్..
శిష్యుడుః ఫ‌ర్ స‌పోజ్..
గురువుః ఓ ప్రాజెక్ట్ క‌ట్టారే అనుకో..
శిష్యుడుః అనుకున్నానే అనుకో..
గురువుః అది ఖ‌ర్చెక్కువా లాభం త‌క్కువే అనుకో..
శిష్యుడుః మీరు దేని గురించి అంటున్నారో నాకు బాగా తెలుసండోయ్..
గురువుః నువ్వు ముందు అనుకోమ‌న్నానా?
శిష్యుడుః స‌రే అనుకున్నానే అనుకో..
గురువుః అది న‌ష్ట‌దాయ‌క‌మ‌న్న నిజం ప్ర‌తిప‌క్షం మాత్ర‌మే కుండ బ‌ద్ధ‌లు కొడుతుంది..
శిష్యుడుః అలా బ‌ద్ద‌లు కొట్ట‌డం వ‌ల్ల కుండ బొక్క ఇందులో ప్ర‌యోజ‌న‌మేముందీ?
గురువుః వీడొక‌డు.. అక్క‌డ కొండ‌లు క‌రిగిపోతున్నాయ్ రా నాయ‌నా అంటే కుండ‌ల గురించి ఆలోచిస్తాడు.. అరె బాబూ.. నిజం అన్న‌ది జ‌నానికి తెలియాలిగా.. ఆ పాత్ర పోషించేది ప్ర‌తిప‌క్ష‌మ‌న్న‌మాట‌..
శిష్యుడుః నాక‌ర్ధం కాక అడుగుతా.. అస‌లు ప్ర‌తిప‌క్ష‌మే లేకుంటే ఏమ‌వుతుంద‌ని.. పైపెచ్చు మా ముక్కాయ‌న అన్న‌ట్టు.. వాళ్ల కాపాడుకోలేక నింద మాపైకా?
గురువుః అస‌లీ ఎన్నిక‌లే ర‌ద్దు చేసి పారేయాలి.. ఎవ‌రు గెలిచినా.. కారెక్క‌డానికి ఈ ఎన్నిక‌లే వ‌ద్దంటాడు మ‌రో చేతి గురుతు నాయ‌కుడు.. ఇదీ యాద్ చేసుకో..
శిష్యుడుః మీరింత‌కీ నా ప్ర‌శ్న‌కు స‌మాదానం చెప్ప‌నే లేదు.. ప్ర‌తిప‌క్షం లేకుంటే ఏమ‌వుతుందీ అంట‌?
ఏపీలో జ‌రిగిన‌ట్టు లేని పోని గొడ‌వ పెంట పాడు త‌ప్ప‌..
గురువుః ఒరే నాయ‌నా.. అది ప్ర‌మీలా రాజ్య‌మై పోతుంది.. మ‌గ‌పురుగ‌న్న‌వాడే లేకుంటే.. ఇక సంతానోత్ప‌త్తి ఎక్క‌డుంటుందీ? అంట‌..
శిష్యుడుః ఏవుందీ టెస్ట్ ట్యూబ్ బేబీల‌ను పుట్టించేసుకుంటాం..
గురువుః అందుకూ మ‌గ‌త‌నం సాయం అవ‌స‌ర‌మేడ్చిందిగా..
శిష్యుడుః ఏంటండీ మీ బాధ‌.. మ‌గాడే లేకుంటే.. ఇక జాతే అంత‌రించి పోతుంద‌న్న‌ట్టు ఓ బిల్డ‌ప్ కొడుతున్నారు..
గురువుః టాపిక్ మ‌ళ్లీ షేప‌వుట్ అవుతోంది.. ఇలాగొచ్చేయ్.. మ‌న‌మిప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర‌.. ద‌గ్గ‌ర ఉన్నాం..
శిష్యుడుః ఏంట‌దీ ప్రేక్ష‌క పాత్రా?
గురువుః ఆఆ దాదాపు అర్ధ‌మ‌దేన‌నుకో.. అక్క‌డున్నాం.. అక్క‌డికొచ్చేయ్,,
శిష్యుడుః నాకేదో డౌటనుమానం కొడుతోంది గురూ.. మీరుగానీ.. ఇండైరెక్ట్ గా ఎవ‌ర్నో అడ‌గాల్సిన ప్ర‌శ్న‌ల‌న్నిటినీ న‌న్ను గానీ అడ‌గ‌టం లేదు క‌దానిపిస్తోంది..
గురువుః లేదురా ఈ ప‌రిస్థితుల్లో ఏదో జ‌ర‌గాల‌నిపిస్తోంది.. అసెంబ్లీ న‌ట్టింట్లో ప్ర‌తిప‌క్ష‌మ‌న్న‌ది లేక‌.. బ‌య‌టా లేక పోతే.. అడిగే నాథుడే లేక‌.. వాడి శిలా ఫ‌ల‌కాలు వాడి పాటికి వాడు రాయించేసుకుని.. ఎంచ‌క్కా చ‌రిత్ర త‌న ఇష్టానికి తీర్చి దిద్దేసుకుంటే ప‌రిస్థితి ఏమిటా అని చింతిస్తున్నా..
శిష్యుడుః నువ్వేంది గురూ మ‌ధ్య‌లో.. దానంత‌ట‌దే త‌ట‌స్తంగా రాయ‌ద‌గ్గ గోరా శాస్త్రి మార్కు చ‌రిత్ర ఎక్క‌డేడ్చింద‌ని.. ఉన్న చ‌రిత్రంతా రాయించుకుంటున్న‌దేగా..
గురువుః మ‌ధ్య‌లో ఈ గోరా శాస్త్రి ఎవ‌రు నాయ‌నా నా ప్రాణానికి..?
శిష్యుడుః ఉండేవాడు లెండి.. వందేళ్ల‌య్యింది ఆయ‌న పుట్టి.. ఆయ‌నే త‌న‌కు తాను ఓ ప్ర‌తిప‌క్షంగా నిలిచి.. వార్త‌ల‌ను రాసేవాడ‌ట అప్ప‌ట్లో..
గురువుః ఈ విష‌యం నీకెవ‌రు చెప్పారు?
శిష్యుడుః వ‌యోధిక పాత్రికేయ సంఘం వాళ్లంటుంటేనూ..
గురువుః ముస‌లీ ముత‌కా జ‌నాల‌న్న మాట కూడా ప‌ట్టుకుని ఊగులాడితే.. ఇక స‌రిపోయింది..
శిష్యుడుః అలాంటి పాత్ర పాత్రికేయులే పోషించాలి గురు.. అప్పుడుగానీ.. స‌మ‌తుల్య‌త ఏర్ప‌డ‌దు..
గురువుః అట్టే పేల‌కు.. గోరాశాస్త్రిని ఏదో మొహ‌మాటానికి పొగిడారు క‌దాని.. నువ్వా ఇన్ స్పిరేష‌న్ తీసేసుకున్నావే అనుకో.. ఉన్న గోసీ కాస్తా ఊడుతుంది..
శిష్యుడుః అదేంటి? మ‌ంచి అన్న‌ది పెంచు మ‌న్నా పంచుమ‌న్నా అంటారే..
గురువుః ఇవాళ్రేపు తుంచుమ‌న్నా అంటున్నార్రా నాయ‌నా,,
శిష్యుడుః అస్స‌లు అర్ధం కావ‌ట్లా..
గురువుః చూడు.. కాలం చెల్లిన విష‌యాల‌ను మ్యూజియాల్లో పెట్టుకుని చూసిన‌ట్టు.. పార్టీల‌క‌తీతంగా రాసే జ‌ర్న‌లిస్టులు కూడా అంతే. వాళ్ల త‌రం ఎప్పుడో అయిపోయింది.. వాళ్ల‌పేరిట ఇదిగో.. ఇలా శ‌త‌జ‌యంతులు చేసుకుని చ‌ప్ప‌ట్లు చ‌రుచుకుని బ‌య‌ట ప‌డిపోతుంటాం.. అంతే కానీ.. ఇలా అయిన‌దానికీ కానిదానికీ స్ఫూర్తి పొందాల‌ని ఎవ్వ‌రూ కోరుకోరు.. గుర్తుంచుకో..
శిష్యుడుః అంటే అక్కడా ప్ర‌తిప‌క్షం లేక‌.. ఇక్క‌డా ప్ర‌తిప‌క్షం లేక‌.. మ‌రి మ‌గాడ్ని బ‌త‌క‌నివ్వ‌రా మీరు?
గురువుః ఇప్ప‌టికి లేదంతే.. మ‌గైనా ఆడైనా.. ఆయ‌నే.. అర్ధ‌నారీశ్వ‌ర త‌త్వం.. క‌నిపిస్తుందిగా.. దండం పెట్టుకో..
శిష్యుడుః అంటే అధికార‌ప‌క్ష‌మైనా ప్ర‌తిక్ష‌మైనా ఆయ‌నే అంటారు?
గురువుః ఆయ‌నే ఆయ‌నే ఆయ‌నే.. ముమ్మాటికీ ఆయ‌నే.. మ‌గ‌త‌నం కాపాడ‌కోవ‌డం చేత‌గాక‌.. నిందంతా ఆడాళ్ల మీద వేసిన‌ట్టు.. ఏంటా.. నిష్టూరాలు..
శిష్యుడుః మీరెన్న‌న్నా.. చెప్పండీ నేను గోరా శాస్త్రి అవుతా.. ఆయ‌న పేరిటే ఒక ప‌త్రిక పెట్టి.. ప్ర‌తిప‌క్షంగా నిలుస్తా..
గురువుః నీ ఖ‌ర్మ‌.. నిన్నెవ‌డూ కాపాడ‌లేడు.. ముందు ఇంటా బ‌య‌టా.. నీ గురించి ఘోరంగా వార్త రాకుండా చూసుకో ముందు.

 

                                                                                                          Writer name:
                                                                                                          స‌ర్వేప‌ల్లి.మ‌శ్చీంద్ర