నిపుణుల నివేదిక తప్పుల తడక అజేయకల్లం అన్నీ అసత్యాలు చెప్పారు కావాలని బురద చల్లుతున్నారు కర్ణాటకలో మీ ప్రాజెక్టులకు అధిక ధరలు? శాసనసభలో ప్రతిపక్షనేత చంద్రబాబు |
విద్యుత్తు కొనుగోళ్లలో దోపిడీ స్పష్టం ఏటా రూ.2,766 కోట్ల భారం డిస్కంలకు రూ.66,361 కోట్ల ఆర్థిక లోటు అవసరం లేకున్నా విద్యుత్తు కొనుగోళ్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు |
రాష్ట్ర విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది మా తెదేపా ప్రభుత్వమే. 1999లో రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం. 2004 నాటికి మిగులు విద్యుత్ చూపాం. 2014లో రాష్ట్ర విభజన నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే, కేవలం 2 నెలల్లో దానిని అధిగమించాం. కొత్త ప్రభుత్వం వచ్చాక అప్పుడే రాష్ట్రంలో కోతలు మొదలయ్యాయి. – విపక్షనేత చంద్రబాబు
|
పునరుత్పాదక విద్యుత్తు కొనుగోలు వల్ల వచ్చే నష్టాలను మనం భరించాలా? సాంకేతికత వల్ల ధరలు తగ్గుతాయి. అలాంటప్పుడు 25 సంవత్సరాలకు ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న తక్కువ ధరలతో పోల్చి చూడటం లేదు. 25 సంవత్సరాలు ఇదే తీరులో జరిగితే ఏటా రూ.2,766 కోట్లు నష్టపోవాల్సిందే. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధరలతో పోలిస్తే నష్టం రూ.4 వేల కోట్లకు చేరుతుంది. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయటం కాదా? – ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి
|
అమరావతి
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో తీవ్రస్థాయి చర్చసాగింది. పీపీఏలపై నిపుణుల కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘‘బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సలహాదారు అజేయకల్లం విలేకరుల సమావేశంలో అసత్యాలు చెప్పారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. వీటి వల్ల ఏడాదికి రూ.3 వేల కోట్ల నష్టం అని చెప్పారు. కావాలని మాపై బురద జల్లాలని చూస్తే, అది మీపైనే పడి చివరకు మీరే మునిగిపోతార’’ంటూ వ్యాఖ్యానించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బదులిస్తూ నిపుణుల కమిటీ నివేదిక గురించి చంద్రబాబు తప్పుగా మాట్లాడారని, కమిటీ తన నివేదిక ఇంకా ఇవ్వలేదని అన్నారు. విద్యుత్తు కొనుగోళ్ల రూపేణా అదనంగా చెల్లించి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంటే పీపీఏలపై ఎందుకు సంతకాలు పెట్టారని నిలదీశారు.
ప్రతిపక్షనేతకు ముందు అవకాశం
శాసనసభలో శుక్రవారం పీపీఏలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ చర్చ ఆరంభించారు.‘‘విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం చోటుచేసుకున్న నేపథ్యంలో అది ఎలా జరిగిందనేది ప్రజలకు తెలియాల్సి ఉంది. పీపీఏలపై చర్చ వస్తుందని తెలిసి, ప్రతిపక్ష నేత ముందే విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. బయట మాట్లాడతారు. కానీ సభలో చర్చ చేపట్టినప్పుడు ఉండరు’’ అని సీఎం పేర్కొన్నారు. సరిగ్గా అప్పుడే సభలోకి చంద్రబాబు వచ్చి కూర్చున్నారు. దీంతో స్పందించిన సీఎం జగన్ ..‘‘ఆయన వచ్చారు, సంతోషం. తొలుత ఆయనకే మైక్ ఇచ్చి మాట్లాడే అవకాశం ఇవ్వాల’’ని స్పీకర్‌ను కోరారు.
దేశంలోనే మాది అతితక్కువ ధర: చంద్రబాబు
తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు వివరించారు. ‘‘పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో.. ఒకప్పుడు సౌర, పవన విద్యుత్ ధర యూనిట్‌కు రూ.16-18 వరకు ఉండేది. సాంకేతికత పెరగడంతో ఇపుడు రూ.2.70 పైసలకు తగ్గింది. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 పైసలు, స్థిరఛార్జి కింద రూ.1.10 పైసలు కలిపి రూ.5.94 పైసలు అవుతుంది. అయితే థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే లభిస్తుంది. అయినా రూ.1.74పైసలు అదనంగా ఇచ్చారని లెక్కలు వేశారు. ఎప్పటికప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందన్న విషయం పట్టించుకోకుండా సగటును లెక్కించి మొత్తం రూ.3 వేల కోట్ల నష్టమని నివేదిక ఇచ్చారు. నిపుణుల కమిటీ అనేది దూరదృష్టితో ఆలోచించకుండా ఏదో బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఇదంతా చూపినట్లుంది. ఆర్పీవో ఉన్నచోట వాళ్లు చెప్పిన దానికంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తే యూనిట్‌కు రూ.1.50 పైసలు ప్రోత్సాహకం కింద ఇస్తారు. మన వద్ద 21 శాతం చేస్తున్నాం. అంటే ప్రస్తుత ధర రూ.2.73 పైసలు అనుకుంటే, అందులో రూ.1.50 పైసలు కేంద్రం ప్రోత్సాహకం ఇస్తే, కేవలం రూ.1.23 పైసలకే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు అవుతుంది. దేశంలో ఇది అతి తక్కువ ధర.
కర్ణాటకలో రేటు పెంచుకున్నారు
జగన్ కేవలం రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు. ఆయన డెవలపర్ కూడా. ఆయనకు కర్ణాటకలో పవర్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆయన విండ్ ప్రాజెక్ట్‌లో యూనిట్‌కు రూ.4.50పైసలు, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకం 50 పైసలు కలిపి రూ.5గా కర్ణాటక రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తూ 2016 అక్టోబరులో ఆదేశాలిచ్చింది. ఆయన హైడల్‌ప్రాజెక్ట్‌లో యూనిట్ ధర రూ.2.92 పైసల నుంచి రూ.3.42 పైసలకి పెంచుతూ 2016 సెప్టెంబరులో ఆదేశాలిచ్చింది. డెవలపర్‌గా మీకు అక్కడ డబ్బులు కావాలి. ఇక్కడ సీఎంగా మాత్రం ఏదో జరిగిపోయింది, అందరిపై చర్యలు తీసుకోవాలి అంటున్నారు.
అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు
జులై 11న రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు చేశారు. యూనిట్‌కు రూ.4.90 పైసల వంతున కొనుగోలు చేశారు. అదే కర్ణాటక రూ.2.70 పైసలు, కేరళ రూ.2.99 పైసలు, తెలంగాణ రూ.3.19 పైసలు, తమిళనాడు రూ.3.49 పైసలు వంతున కొనుగోలు చేశారు. సగటున రూ.3.76 పైసలు అయితే మన రాష్ట్రం మాత్రం రూ.4.90 పైసలు వంతున కొనుగోలు చేసింది. 10, 12 తేదీల్లో కూడా ఇంతే. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే విద్యుత్‌నే ఎక్కువ ధరకు తీసుకున్నారు. మీ తీరు వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోంది. ప్రపంచ బ్యాంక్ సైతం రుణం ఇవ్వకుండా తిరస్కరించింది.
సెల్‌ఫోన్లపై భవిష్యత్ ఆలోచన నాది
కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవాలని నేను ఆలోచిస్తాను. వాజ్‌పేయి హయాంలో నా ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తే టెలికంలో సంస్కరణలు తీసుకొచ్చాం. ఫలితంగా ఇప్పుడు ఫోన్ల వినియోగం భారీగా పెరిగినా, ధరలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి’ అని చంద్రబాబు వివరించారు.