క్రికెట్ ప్రపంచకప్ ముగిసినా.. వినోదానికి కొదువ లేదు. ఉత్కంఠభరిత సమరాలతో క్రీడాభిమానులను ఉర్రూతలూగించడానికి మరో క్రీడా సంబరం వచ్చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ నేటి నుంచే. ఆరంభం హైదరాబాద్లోనే. ఇంకేంటి.. సూపర్ రైడ్లు, ట్యాకిళ్లు, అంటూ దాదాపు మూడు నెలల పాటు కబడ్డీని ఆస్వాదించడమే అభిమానుల పని. ఇక సాయంత్రం అయిందంటే చాలు.. రాహుల్ చౌదరి పరుగెత్తి పాయింటు తెచ్చాడు చూడు.. పర్దీప్ నర్వాల్ డుబ్కీ చూడు.. అంటూ ప్రతి ఇంట్లో రచ్చ మొదలు కానుంది. పట్నం వాసులతో పాటు పల్లె ప్రజలకూ ఎంతో చేరువైన ఈ కబడ్డీ మాయలో మరోసారి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి..!