నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ- ఎం3

0
106

చంద్రయాన్‌-2లో తొలి అంకం విజయవంతం
ఉత్కంఠభరితంగా సాగిన ప్రయోగం

సాఫీగా ముగిసిన క్రయోజెనిక్‌ దశ
ఇస్రోకు రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ సహా జాతి మొత్తం అభినందనలు
సెప్టెంబరు 7న జాబిల్లిపై దిగనున్న ల్యాండర్‌

చందమామ రావె.. జాబిల్లి రావే.. అంటూ తరతరాలుగా పిలుస్తున్నా రావడంలేదు కదా మామా.. ఇదిగో మేమే వస్తున్నాం నీ దగ్గరకు అంటూ బయలుదేరింది మిషన్‌ చంద్రయాన్‌ -2. యావత్‌ ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుండగా 136 కోట్లమంది భారతీయుల మనసుల్ని మోసుకుంటూ.. ఆశల్ని పేర్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది మన చంద్రయాన్‌.

నిశిరాత్రి వేళ నింగివైపు తొంగిచూసే నెలవంకను చూస్తుంటే ఏదో వింత అనుభూతి.. చిన్నతనం నుంచే ఆ జాబిలమ్మతో ఎన్నో ముచ్చట్లు.. భూమాత చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతుండే ఆ మామ గుట్టు రట్టు చేయాలని ఎన్నో ప్రయత్నాలు! చందమామ చెక్కిలి మీటాలని ఎంతో ఉబలాటం! తొలిసారిగా దిగంతాలకు దూసుకువెళ్లిన యూరి గగారిన్‌ చందమామ వైపు తొంగి చూసినా.. యాభయ్యేళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందం చందమామపై పాదం మోపి అక్కడి ఊసులెన్నో మోసుకొచ్చిన ఇన్నాళ్లకు.. నిఖిల జగతి నిబిడాశ్చర్యంతో చూస్తుండగా మరింత గట్టి ప్రయత్నంలో… గొప్ప లక్ష్యంతో దూసుకువెళ్తోంది భారత్‌.

 

చంద్రుడి కేసి.. రివ్వున ఎగిసి..
శ్రీహరికోట..  సమయం సోమవారం మధ్యాహ్నం  2:43 గంటలు..
10..9..8..7..6..5..4..3..2..1..0..  కౌంట్‌డౌన్‌ ముగిసింది.

ఒక్కసారిగా వందల టన్నుల ఘన ఇంధనం ప్రజ్వలించింది. పరిసరాలను కుదిపేస్తూ.. నిప్పులు చిమ్ముతూ.. భూమికి గుడ్‌ బై చెప్తూ.. చందమామవైపు చేతులు చాచుకుంటూ నారింజ రంగులోని ‘జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్‌(జీఎస్‌ఎల్‌వీ) మార్క్‌3-ఎం1’ వాహకనౌక షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగిరింది.  నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం 16.14 నిమిషాల్లోనే చంద్రయాన్‌-2ను నిర్ణీత 170 కిలోమీటర్లు × 39,059 కిలోమీటర్ల భూ కక్ష్యలోకి చేర్చింది.

 

భారత అంతరిక్ష రంగ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పరిశోధక పరికరాలతోపాటు 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ‘చంద్రయాన్‌-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. బాహుబలి వాహకనౌక ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1’ తనపై ఇస్రో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లింది. భూకక్ష్యలోకి దాన్ని చేర్చింది. దీంతో జాబిల్లిపైకి మనదేశం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రెండో యాత్రలో తొలి అంకం విజయవంతంగా పూర్తయింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఈ బృహత్తర ప్రయోగం జరిగింది.  రాకెట్‌ నుంచి ‘చంద్రయాన్‌-2’ విడిపోయినట్లు సంకేతాలు అందగానే ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ అపూర్వ ఘట్టంతో యావత్‌ భారతావని పులకించింది. ‘చంద్రయాన్‌-2’లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు పరికరాలు ఉన్నాయి. వీటిలో పరిశోధనల కోసం 13 పేలోడ్స్‌ను శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ ఏడాది సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండర్‌ దిగనుంది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి 14 రోజులపాటు(ఒక లూనార్‌ పగలు) పరిశోధనలు జరుపుతుంది.
ప్రయోగం సాగిందిలా..
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన చంద్రయాన్‌-2 ప్రయోగం ప్రారంభం నుంచి చివరి వరకు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు రాకెట్‌ పయనం ఆరంభమైంది. వెంటనే ఎస్‌-200 మోటార్ల జ్వలన (ఇగ్నిషన్‌)ప్రారంభమయింది.

 

వరుస పరిణామాలిలా..
ఎస్‌-200 మోటార్ల జ్వలన ప్రారంభమైన తర్వాత
1.50 నిమిషాలకు: ఎల్‌-110 మోటార్లు జ్వలించాయి
2.11 నిమిషాలకు: రాకెట్‌ నుంచి విడిపోయిన ఎస్‌-200 మోటార్లు
2.21 నిమిషాలకు: సీఎల్‌జీ ఇగ్నిషన్‌ ప్రారంభం
3.23 నిమిషాలకు: విడిపోయిన ఉష్ణ కవచం
5.11 నిమిషాలకు: సీ-25 జ్వలించింది
15.58 నిమిషాలకు: సీ-25 ఇంజిన్‌ షట్‌ ఆఫ్‌ అయింది
16.14 నిమిషాలకు: రాకెట్‌ నుంచి విడిపోయిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం

ఎప్పటికప్పుడు సంకేతాలు
రాకెట్‌ గమనానికి సంబంధించి ఎప్పటికప్పుడు షార్‌లోని రెండు గ్రౌండ్‌ స్టేషన్లు; బెంగళూరు, పోర్టుబ్లెయిర్‌, బ్రూనే, బియాక్‌ (ఇండోనేసియా) గ్రౌండ్‌ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలకు సంకేతాలు అందుతూ వచ్చాయి. మొత్తంగా చంద్రుడిపై రోవర్‌ను దించాలన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయత్నానికి తొలి విజయం దక్కింది. సంపూర్ణ విజయం కోసం సెప్టెంబర్‌ 7 వరకు వేచి  చూడాల్సిందే.

క్రయోజెనిక్‌ దశలో ఉత్కంఠ
క్రయోజెనిక్‌ ఇంధన జ్వలన దశలో గతంలో ఒకటి, రెండు సార్లు వైఫల్యాలు ఎదురవ్వడం, ఈ నెల 15న కూడా ఈ దశలో సాంకేతిక లోపం కారణంగానే ప్రయోగం వాయిదా పడటం వంటి అనుభవాలతో సోమవారం ఆ దశ(సీ-25 ఇంజిన్‌ జ్వలనం) ముగిసేంత వరకు ఇస్రో శాస్త్రవేత్తలు   తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. అది విజయవంతంగా  పూర్తవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. చంద్రయాన్‌-2 నిర్ణీత కక్ష్యలోకి చేరాక మిషన్‌ కంట్రోల్‌ గది మొత్తం చప్పట్లతో మార్మోగింది. శాస్త్రవేత్తలు ఒకరినొకరు  అభినందించుకున్నారు.

వారం వ్యవధిలోనే..
వాస్తవానికి ఈ నెల 15న చంద్రయాన్‌-2ను నింగిలోకి పంపాలని ఇస్రో తొలుత భావించింది. కౌంట్‌డౌన్‌ మరో 56 నిమిషాల్లో ముగుస్తుందనగా వాహకనౌక క్రయోజెనిక్‌ దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో అనూహ్యంగా ప్రయోగం వాయిదా పడింది. నాటి నుంచి అహర్నిశలు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని సరిదిద్ది కేవలం వారం రోజుల వ్యవధిలో విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తిచేయడం వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టింది. ‘చంద్రయాన్‌-2’ మిషన్‌ డైరెక్టర్‌గా రీతు కరిధాల్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.వనిత ఉన్నారు.

శివన్‌ ఉద్వేగం
ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-2 ప్రయోగం జరిగే సమయంలో ఇస్రో అధినేత కె.శివన్‌ ఉద్వేగంగా కనిపించారు. ఒక్కో కీలక దశ ముగిసేకొద్దీ చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. వ్యోమనౌక కక్ష్యలోకి చేరాక చాలా ప్రశాంతంగా కనిపించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘‘జాబిల్లి దిశగా భారత్‌ చరిత్రాత్మక ప్రయాణానికి ఇది ఆరంభం. ఇంతకుముందు తలెత్తిన సాంకేతిక లోపాన్ని దీటుగా అధిగమించి విజయవంతంగా ప్రయోగం పూర్తిచేశాం. తదుపరి 45 రోజుల్లో అత్యంత కీలకమైన 15 విన్యాసాలను విజయవంతంగా చేపట్టాల్సి ఉంది. చివరి దశలో ‘భీతావహ 15 నిమిషాల’ దశను అధిగమించి దక్షిణ ధ్రువంలో సురక్షితంగా ల్యాండర్‌ను దించాలి’’ అని శివన్‌ పేర్కొన్నారు.

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 బోనస్‌
తాజా ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 అద్భుతంగా పనిచేసిందని శివన్‌ తెలిపారు. అనుకున్నదానికంటే 6 వేల కిలోమీటర్ల మేర ఎక్కువ కక్ష్యలో వ్యోమనౌకను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీనివల్ల చంద్రయాన్‌-2కు అదనపు జీవితకాలం, మిగులు ఇంధనం వంటి లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఎక్కువ విన్యాసాలు చేపట్టడానికీ ఆస్కారం ఉంటుందన్నారు. ‘‘చంద్రయాన్‌-2కు రేపు చేయాల్సిన కక్ష్య పెంపు విన్యాసాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ నేడే చేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2013లో అంగారకుడిపైకి ప్రయోగించిన మంగళయాన్‌లోనూ ఇలాగే ఇంధనం ఆదా అయ్యింది. ఫలితంగా ఆ వ్యోమనౌక ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. మునుపటి ప్రయోగంతో పోలిస్తే తాజాగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3.. దాదాపు 15 శాతం మేర మెరుగ్గా పనిచేసిందని శివన్‌ వివరించారు.

ఇస్రో నియంత్రణలో వ్యోమనౌక
రాకెట్‌ నుంచి విడిపోయిన వెంటనే చంద్రయాన్‌-2 వ్యోమనౌకలోని సోలార్‌ అర్రే పనిచేయడం ప్రారంభించింది. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ దాన్ని పూర్తి నియంత్రణలోకి  తీసు
కున్నాయి.
చంద్రయాన్‌-2లో పరికరాలు
ఆర్బిటర్‌
* బరువు: 2,379 కిలోలు
* విద్యుదుత్పత్తి సామర్థ్యం: 1,000 వాట్లు
* కమ్యూనికేషన్‌: భూమి మీదున్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌తో, ల్యాండర్‌తో
* జీవితకాలం: ఏడాది
* ఏం చేస్తుంది: చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఉపరితలాన్ని స్కాన్‌ చేస్తుంది. సంబంధిత ఫొటోలు, డేటాను సేకరించి భూమికి చేరవేస్తుంది.

ల్యాండర్‌ (విక్రమ్‌)
* బరువు: 1,471 కిలోలు
* విద్యుదుత్పత్తి సామర్థ్యం: 650 వాట్లు
* కమ్యూనికేషన్‌: ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌తో, ఆర్బిటర్‌తో, రోవర్‌తో
* జీవితకాలం: 14 రోజులు (ఒక లూనార్‌ పగలు)
* ఏం చేస్తుంది: ఆర్బిటర్‌ నుంచి విడిపోయి చంద్రుడిపై మృదువుగా దిగుతుంది. ఉపరితలాన్ని స్కాన్‌ చేసి, ల్యాండింగ్‌ కోసం అనువైన ప్రదేశాన్ని సొంతంగా గుర్తిస్తుంది.

రోవర్‌ (ప్రజ్ఞాన్‌)
* బరువు: 27 కిలోలు
* విద్యుదుత్పత్తి సామర్థ్యం: 50 వాట్లు
* కమ్యూనికేషన్‌: ల్యాండర్‌తో
* జీవితకాలం: 14 రోజులు (ఒక లూనార్‌ పగలు)
* ఏం చేస్తుంది: చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనలు సాగిస్తుంది. గరిష్ఠంగా 500 మీటర్లు ప్రయాణిస్తుంది. జాబిల్లి ఉపరితలాన్ని పరిశీలించి సంబంధిత డేటాను ల్యాండర్‌కు చేరవేస్తుంది.
వాహకనౌక : జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3
* ఎత్తు: 43.43 మీటర్లు – బరువు: 640 టన్నులు
* ప్రాజెక్టు వ్యయం: రూ.978 కోట్లు (చంద్రయాన్‌-2 రూపకల్పనకు రూ.603 కోట్లు, ప్రయోగానికి రూ.375 కోట్లు)

ప్రాజెక్టు లక్ష్యాలు
* చందమామ వాతావరణంపై అవగాహన పెంచుకోవడం
* దాని ఉపరితల నిర్మాణాన్ని విస్తృతంగా విశ్లేషించడం
* అక్కడ నీటి జాడ కోసం అన్వేషించడం
* ‘చంద్రయాన్‌-2’ బరువు- 3.8 టన్నులు
* దానిలోని మొత్తం పరికరాలు- 14 (మనవి 13, నాసాది 1)
* చంద్రుడిపై ల్యాండర్‌, రోవర్‌ దిగే రోజు: సెప్టెంబర్‌ 7
4 అమెరికా, రష్యా, చైనాల తర్వాత   చంద్రుడిపై వ్యోమనౌకను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా భారత్‌      అవతరించనుంది.
1 జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను    దింపిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది.

దేశం గర్వించేలా చేశారు
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
‘దేశ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. మున్ముందు ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేపట్టాలి

 

భారతీయులందరికీ గర్వకారణం
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు

చంద్రయాన్‌-2 వ్యోమనౌక కక్ష్యలోకి చేరడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ‘‘సాంకేతిక కారణాలతో గతవారం ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మీరు అప్రమత్తతతో సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిదిద్దారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ప్రత్యేక అభినందనలకు మీరు అర్హులు’’ అంటూ ఇస్రో ఛైర్మన్‌ శివన్‌, శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ట్విటర్‌లో మోదీ ఆడియో సందేశం ఉంచారు. ‘‘చంద్రయాన్‌-2 ప్రాజెక్టు విశిష్టమైనది. గతంలో ఏ మిషన్‌ కూడా అన్వేషణ చేపట్టని, పరిశోధనలు నిర్వహించని చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇది పరిశోధనలు జరుపుతుంది. ‘చంద్రయాన్‌-2’ పూర్తిగా స్వదేశీ మిషన్‌ కావడం భారతీయులందర్నీ గర్వపడేలా చేస్తోంది’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రయాన్‌-2ను విజయవంతంగా భూకక్ష్యలోకి చేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్‌ పార్టీ అభినందనలు తెలియజేసింది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రుమఖులు సహా పలువురు ఇస్రోను అభినందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ షార్‌కు విచ్చేసి తాజా ప్రయోగాన్ని వీక్షించారు.

కొనియాడిన పార్లమెంటు
దిల్లీ: చంద్రయాన్‌-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంతో ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంటు అభినందించింది. దేశచరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని ప్రశంసించింది. ఈ మిషన్‌తో అంతరిక్షరంగంలో మన సత్తాను మరోసారి చాటినట్లయిందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. భారత శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఘనత సాధించినందుకు శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించాలని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. వాహకనౌకతో పాటు చంద్రయాన్‌-2ను కూడా పూర్తిగా భారత్‌లోనే రూపొందించారని, అందువల్ల వారు ప్రత్యేక ప్రశంసలకు అర్హులని ఆయన చెప్పారు. దేశ అంతరిక్ష కార్యక్రమ ఆద్యుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి కూడా ఆగస్టు 12న వస్తోందని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.

అభినందించిన నాసా
‘చంద్రయాన్‌-2’ను విజయవంతంగా భూ కక్ష్యలోకి చేర్చిన ఇస్రోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ – నాసా ట్విటర్‌లో అభినందించింది. డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ప్రయోగానికి సహాయం చేస్తున్నందుకు తమకు గర్వంగా ఉందని పేర్కొంది. జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి భారత్‌ ఏం తెలుసుకుంటుందోనని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. పలు దేశాలు, అంతర్జాతీయ వార్తాసంస్థలు కూడా ఇస్రో తాజా ప్రయోగంపై ప్రశంసల వర్షం కురిపించాయి.