అమరావతికి రుణ ప్రతిపాదన రద్దు చేసుకున్నట్టు వెల్లడి: ఏఐఐబీ

0
54

రాజధాని అమరావతి నిర్మాణానికి రుణ ప్రతిపాదనపై ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) సైతం వెనక్కు తగ్గింది. ‘‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను రద్దుచేసుకున్నాం. అది ఇక మా పరిశీలనలో లేనట్టే’’ అని ఏఐఐబీ అధికార ప్రతినిధి లారెల్‌ ఆస్ట్‌ఫీల్ట్‌ తమకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసినట్టు రాయిటర్స్‌ వార్తాసంస్థ మంగళవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని రాయిటర్స్‌ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ కలసి 500 మిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వాలన్నది ప్రతిపాదన. అమరావతికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు ఇటీవల స్పష్టంచేసిన నేపథ్యంలో… ఏఐఐబీ రుణం ప్రతిపాదన విరమించుకుంది. అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు. దీనిలో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వాలన్నది ప్రతిపాదన. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రకారం చూస్తే ఇది రూ.3,450 కోట్లవుతుంది. మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది ప్రతిపాదన. అమరావతికి రుణం విజ్ఞప్తిని వెనక్కు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం తమకు చెప్పిన నేపథ్యంలోనే..ఆ ప్రతిపాదన విరమించుకున్నామని ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది.