అనవసర చర్చలతో సభాసమయాన్ని వృథా:జగన్‌

0
48

అమరావతి: ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష తెదేపా నాయకులు తమపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. అనవసర చర్చలతో సభాసమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ లేవనెత్తిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం చెప్పారని, కానీ స్పీకర్‌ పెద్దమనసుతో  మళ్లీ సత్యప్రసాద్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. మంత్రి సమాధానం చెప్పిన తర్వాత మళ్లీ అవకాశం అడగడమేంటని ప్రశ్నించారు. సభ ప్రారంభమై దాదాపు గంటసేపైనా ఇప్పటి వరకు కేవలం 3 ప్రశ్నలకే సమాధానం చెప్పగలిగామని, మిగతా వాటికి కూడా బదులిచ్చేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.

29 మంది మరణానికి కారణమెవరు: జోగి రమేష్‌

అంతకుముందు వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. గోదావరి పుష్కారాల్లో 29 మంది మరణానికి కారణమెవరని ప్రశ్నించారు. మరణానికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. పుష్కరాల సమయంలో అక్కడ సినిమా షూటింగ్‌ జరపడం వల్లే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు. మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదని పేర్కొన్నారు. పుష్కరాల్లో వేల కోట్ల దోపిడీ జరిగిందన్న జోగి రమేష్.. అది కుంభమేళా కాదని.. కుంభకోణమని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టారని విమర్శించారు. మరోవైపు కృష్ణ పుష్కరాల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని, వందల ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు.

సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

తెదేపా శాసనసభపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ సభప్రారంభానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. సభాహక్కులు కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.