సినిమాల్లోనే కాదు… బయటా అల్లరి పిల్లలానే ఉంటుంది రష్మిక. అదే హుషారు… అంతే ధైర్యం. సినిమా అంటే ఎంత ప్రేమంటే – తెలుగునాట అడుగుపెట్టి ఏడాది కాకుండానే మన భాష నేర్చుకుంది. డబ్బింగ్ చెప్పడం మొదలెట్టింది. గ్లిజరిన్ వాడకుండా కన్నీటి జలపాతాల్ని సృష్టించడం రష్మికకు బాగా తెలుసు. ఇవన్నీ ఆమెను స్టార్ కథానాయికను చేశాయి. రష్మిక ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కథానాయిక. మహేష్‌బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తోంది. తన కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మికతో మాటా మంతీ.
చేతి నిండా సినిమాలున్నాయి. ఈ తీరిక లేని షెడ్యూళ్ల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్నారా?
నిజంగా చాలా ఒత్తిడి ఉంటుంది. తిండి లేదు, నిద్ర లేదు. ఒక్కోసారి ఉదయాన్నే సెట్‌కి వెళ్తే… పడుకునేసరికి తెల్లారిపోతోంది. మరుసటి రోజు మళ్లీ సెట్‌కి వెళ్లాల్సిందే. ఒక్కోసారి తిండి తినాలన్న విషయం కూడా మర్చిపోతుంటాను. ఓ రకంగా నేను కోరుకున్నదీ అదే కదా? తీరిక లేకుండా పని చేయగలగడం నిజంగా ఓ వరం.
సినిమా విడుదలప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుందా?
అవును. నేను చేసిన పని ప్రేక్షకులకు నచ్చుతుందా? నా కష్టానికి ప్రతిఫలం వస్తుందా? వాళ్లు ఈ సినిమాని, నా నటనని ఏ కోణంలో చూస్తారు? ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటప్పుడు నిద్ర కూడా పట్టదు కదా?
చాలా తక్కువ సమయంలోనే మహేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ కథానాయకులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఇదంతా అదృష్టమేనా? లేదంటే మీ ప్రతిభనా?
కచ్చితంగా నా ప్రతిభే అనుకుంటాను. నటించడం చాలా సులువు అని చాలామంది నమ్మకం. కానీ మనది కాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎంత కష్టమో అనుభవిస్తేగానీ తెలీదు. ఫ్రేమ్‌లో కాస్త నవ్వాల్సి వచ్చినా, ఆ నవ్వు వెనుక ఉన్న భావాల్ని ప్రేక్షకులకు చూపించగలగాలి. గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చే అలవాటు నాకు లేదు. ఆ సందర్భాన్ని మనసులోకి తీసుకుంటే తప్ప భావాన్ని పలికించలేం. ఇవన్నీ కష్టపడి చేసినవే.
‘రష్మికకు నటన రాదు.. ఎదగాలి’ అన్నవాళ్లూ ఉన్నారా?
చాలామందే ఉన్నారు. అలాంటి మాటలు విని నేనేం కుంగిపోను. ‘నీకు రాదు… చేతకాదు’ అని ఎవరైనా అన్నారంటే.. వాళ్లకు నేనేంటో చేసి చూపిస్తాను.
‘డియర్ కామ్రేడ్’ కోసం క్రికెట్ నేర్చుకున్నారట కదా?
ఈ సినిమాలో నేను రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కనిపిస్తాను. తెరపై నేను క్రికెట్ ఆడేది కాసేపే. కానీ ఆ సన్నివేశాల కోసం చాలా సాధన చేశాను. ఈ సినిమా కోసమే తొలిసారి బ్యాట్ పట్టుకున్నా. ఫ్రంట్‌ఫుట్, డిఫెన్స్, కవర్ డ్రైవ్.. ఇలా క్రికెట్‌కి సంబంధించిన పదజాలం తెలుసుకున్నా. ఈమధ్య వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూశాను. సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్ అవ్వడం బాధ కలిగించింది. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే, మైదానంలో వేలాది మంది సమక్షంలో ఆడేవాళ్లకు ఎలా ఉంటుందో ఊహించండి.
డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నారు కదా?
నా పాత్రకు మరొకరు డబ్బింగ్ చెబితే న్యాయం చేయలేరనిపించింది. అందుకే ‘నాకు తెలుగు రాదు.. కానీ డబ్బింగ్ చెప్పుకుంటా’ అని దర్శకుణ్ని అడిగా. నా డబ్బింగ్ పూర్తి చేయడానికి 60 రోజులు పట్టింది. బహుశా ఇంత సుదీర్ఘంగా డబ్బింగ్ చెప్పిన కథానాయికని నేనేనేమో.
ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా ముద్దులు పెట్టుకుంటారా? కెమెరా ట్రిక్కా?
అవన్నీ చెప్పేయకూడదు.. టాప్ సీక్రెట్. అయినా హీరో హీరోయిన్ల ముద్దు అనగానే పొదలు, పూవులు ఊపడం చూపిస్తే ఈ తరం ప్రేక్షకులు ఒప్పుకోరు కదా? (నవ్వుతూ)
విజయ్ దేవరకొండ సినిమా అనగానే కథ వినకుండానే ఒప్పేసుకున్నారా?
అంత సీన్ లేదు (నవ్వుతూ). నాకు ఈ కథ బాగా నచ్చింది. కథ, అందులో నా పాత్ర నచ్చిన తరవాత నేను ఇక దేని గురించీ ఆలోచించను. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.
నితిన్‌తో ‘భీష్మ’లో నటిస్తున్నారు. మహేష్, బన్నీ సినిమాలూ ఒప్పుకున్నారు. ఆ సినిమాల సంగతేంటి?
నితిన్ నాకంటే అల్లరి. సెట్లో హుషారుగా ఉంటారు. మహేష్‌ని కలుసుకోవాలని, ఆయన సెట్లో ఏం చేస్తారో చూడాలని చాలాసార్లు అనుకున్నా. అది ఇప్పుడు నిజం అవుతుంది. అల్లు అర్జున్‌తో సినిమా త్వరలోనే మొదలవుతుంది.
మీరింకా ఒంటరిగానే ఉన్నారా?
అవును. మరొకరి కోసం కేటాయించడానికి నా దగ్గర సమయం లేదు. రోజంతా షూటింగులతో బిజీ. ఉరుకుల పరుగుల జీవితంలో మరొకరి గురించి ఆలోచించలేను.