పరిశోధనను వ్యాపారంగా మార్చిన కొందరు ఆచార్యులు

0
51

రూ.50 వేల నుంచి రూ.8 లక్షల వరకు వసూళ్లు
వర్సిటీల్లో విస్తుగొలుపుతున్న వ్యవహారం

 

ఆచార్యుడంటే బోధన ప్రక్రియలో అత్యున్నతుడు. వర్సిటీ పరిధిలోని వేలాది మంది విద్యార్థులను తీరిదిద్దే గురువు. భావి ఆచార్యులను దేశానికి అందించే శిల్పి. ఆదర్శాలకు..విలువలకు నిలువెత్తు రూపంగా ఉండాల్సిన అలాంటి వాళ్లే ‘గురు’వింద చందాన దారితప్పుతున్నారు. చదువుల తల్లి సరస్వతీ కటాక్షంతో నేర్చుకున్న అక్షరాలను అమ్ముకునేంత నీచానికి దిగజారుతున్నారు. సిద్ధాంత పత్రాలను(థీసిస్‌) సమర్పించే సమయంలో పీహెచ్‌డీ విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ పరిశోధనల ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నారు. చర్చలకు ఒక ధర..సూచనలిస్తే ఇంకో రేటు..రాసిస్తే ఇంకోలా..పట్టా ఇస్తే మరోలా.. ఇలా రకరకాల ప్రలోభాలతో విద్యను అంగట్లో సరకులా మార్చేస్తున్నారు.

అక్షరాలను అమ్ముకోవడమంటే తమను తాము అమ్మకానికి పెట్టుకోవడమే అనే వాస్తవాన్ని మరిచి కాసుల వేట సాగిస్తున్నారు. అడిగినంత ఇచ్చుకుంటే సిద్ధాంత పత్రాలు రాయించి ఇచ్చే గైడ్లు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరూ కాకున్నా 5-10 శాతం మందిది ఇదే పరిస్థితి. దీంతో పీహెచ్‌డీ దక్కాలంటే పరిశోధన అవసరం లేదు. పైసలతో పనవుతుందన్న అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది. పీహెచ్‌డీ సీటు తెచ్చుకుంటే చాలు…ఇంట్లో కూర్చున్నా పట్టా చేతికొస్తుందనే ధీమా వారిలో వేళ్లూనుకుంది.

అధికంగా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులే
పీహెచ్‌డీ విద్యార్థులుగా చేరే వాళ్లలో అధిక శాతం మంది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులే ఉంటున్నారు. ఏదో ఒక పరిశ్రమలోనో, కళాశాలలోనో ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ చేస్తుంటారు. పట్టా చేతికొస్తే పదోన్నతులు లభించే, వేతనాలు పెరిగే అవకాశం ఉండటంతో రూ.లక్షలు ఇచ్చేందుకు వారూ సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు ఇందులో ముందు వరుసలో ఉన్నారని సమాచారం.

వసూళ్లలో ఎన్నో రూపాలు
వసూళ్ల పర్వంలో ఒక్కో ఆచార్యుడిది ఒక్కో రీతి. కొందరు ఒకేసారి ఇంత మొత్తం అని మాట్లాడుకుని తీసుకుంటుండగా..కొందరు విద్యార్థులకు ప్రతినెలా అందే ఫెలోషిప్‌లో కోత విధించి జేబులో వేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఓయూలోని ఓ సైన్స్‌ విభాగంలో ఒకరు విద్యార్థుల ఫెలోషిప్‌లు కాజేస్తూ ఏసీబీకి దొరికిపోయారు. సిద్ధాంత పత్రాలను మూల్యాంకనం చేసే ఆచార్యుల పేర్లు చెప్పడంతోపాటు, త్వరగా మూల్యాంకనం జరిగేలా చూస్తానని నమ్మించిన జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం మాజీ అధికారి ఒకరు కొన్నేళ్ల క్రితం వసూళ్లకు పాల్పడ్డారు. ఆ కారణంతోనే అప్పటి ఇన్‌ఛార్జి వీసీ శైలజా రామయ్యర్‌ ఆ అధికారిని బదిలీ చేసినట్లు చెబుతుంటారు.

ఇవిగో ఉదంతాలు

రూ.8 లక్షలిస్తే పట్టా చేతికి
జేఎన్‌టీయూహెచ్‌లోని సీనియర్‌ ఆచార్యుడు ఆయన. ప్రస్తుతం వర్సిటీ పరిధిలోని ఓ కళాశాలలో పరిపాలన సంబంధ పదవిలో ఉన్నారు. ఆయన వద్ద పీహెచ్‌డీ విద్యార్థిగా నమోదైతే చాలు..ప్రారంభం నుంచి పట్టా చేతికొచ్చేవరకు మొత్తం వ్యవహారం ఆయనే చూసుకుంటారు. అందుకు రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సంతకం ఖరీదు రూ.1.50 లక్షలు
జేఎన్‌టీయూహెచ్‌లో అసోసియేట్‌ ఆచార్యుడుగా ఉన్న ఒకరు సిద్ధాంత పత్రంపై సంతకం చేయాలంటే రూ.లక్షన్నర ముట్టచెప్పాల్సిందే. ఓ ఇంజినీరింగ్‌ విభాగం ఆచార్యురాలు సంతకానికి రూ.1.80 లక్షలు డిమాండ్‌ చేయగా..ఓ విద్యార్థి బతిమాలుకుని రూ.1.20 లక్షలు చెల్లించి బయటపడినట్లు తెలిసింది.

కంకణాలు తొడిగితే పట్టా వచ్చినట్టే
ఓయూలో విదేశీ విద్యార్థుల వద్ద కొందరు ఆచార్యులు భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. సైన్స్‌ విభాగంలో ఓ పేరు మోసిన ఆచార్యుడితో పరిశోధన పత్రంపై సంతకం చేయించుకోవాలంటే, ఆయన రెండు చేతులకు కంకణాలు(బ్రాస్‌లెట్లు) తొడగాల్సిందే. ఆయన ఇటీవల పదవీ విరమణ చేశారు.

గంటకో రేటు
ఓయూలోని ఓ విభాగంలో సీనియర్‌ ఆచార్యుడు పరిశోధన విద్యార్థితో చర్చించేందుకు ఇచ్చే సమాయాన్ని బట్టి రుసుము వసూలు చేస్తారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఓయూలోని ఓ విభాగంలో పలువురు ఆచార్యులపై ఇదే తరహా విమర్శలున్నాయి. ఓ ఆచార్యుడైతే పీహెచ్‌డీ విద్యార్థి నుంచి రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు చేయించుకున్నారు. ఆయన కొద్దికాలం క్రితం పదవీ విరమణ పొందారు.

సొమ్ములే ‘సిద్ధాంతం’
కాకతీయ విశ్వవిద్యాలయంలో పలువురు విద్యార్థులు ఓయూకు వచ్చి సిద్ధాంత పత్రాలు రాయించుకుని వెళ్తున్నారు. ఆర్ట్స్‌కు అయితే రూ.50 వేలు, సైన్స్‌ అయితే రూ.లక్ష ఇస్తున్నారు. కేయూలో రెండేళ్ల క్రితం ఒక ఆచార్యుడు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం గమనార్హం.