దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం మినహా ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి జరగలేదు. అంతేగాక నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా ఉంది. నాటి ప్రధాని హామీ ఇచ్చిన ప్రకారం ప్రత్యేక హోదా ఇంకా రాలేదు’ అని అవినాశ్ రెడ్డి లోక్‌సభలో గుర్తుచేశారు. కనీసం ఏపీకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పింస్తుందా అని ప్రశ్నించారు. దీనికి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అంతేగానీ ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు’ అని అన్నారు. విశాఖలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు.