హిజ్ ఎక్సలెన్సీ అని నన్ను పిలుస్తున్నారు. ఇది నాకు, ప్రజలకు మధ్య అడ్డంకి(బారియర్) అవుతుంది. నా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి వివిధ స్థాయుల్లో ప్రజలకు సేవలందించా.. నేను ఈ రాష్ట్ర మొదటి వ్యక్తినే(ఫస్ట్ సిటిజన్) కాదు, ప్రజలకు మొదటి సేవకుడిని.. అందువల్ల నన్ను హిజ్ ఎక్సలెన్సీ అని సంబోధించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
* సుస్థిర అభివృద్ధి దిశగా ఏపీ ముందుకు సాగుతుందన్న ఆశ ఉంది
* వినూత్న పథకాలతో సామాజికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు
* పాదయాత్ర..నరవత్నాలతో మేనిఫెస్టోను తీసుకువెళ్లిన విధానమే ఆయనకు విజయాన్నందించింది
* తెలుగు సంస్కృతి నాకు కొత్త కాదు…
* శ్రీకాకుళానికి పక్కనే ఉన్న గంజాం నా స్వస్థలం
లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దన్న స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అవరోధాలను అధిగమించి సమగ్రాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాక్షించారు. ఒడిదొడుకులన్నీ పరిష్కారమై సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగుతుందన్న ఆశ, నమ్మకం తనకున్నాయని పేర్కొన్నారు. ఎందరో మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు చూపిన దూరదృష్టి, దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ అనేకాంశాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని వ్యాఖ్యానించారు. బుధవారం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి సందేశాన్నిచ్చారు. అందులో..‘‘తెలుగు భాష, తెలుగు సంస్కృతి నాకేమీ కొత్త కాదు. శ్రీకాకుళానికి పక్కనే ఉన్న గంజాం(ఒడిశా) జిల్లా నా స్వస్థలం. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా పొంది, సంస్కరణలకు ఆలవాలమై, పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన అమరావతి పురోగతిలో నేనూ భాగస్వామిని కావడం సంతోషంగా ఉంద’’ని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు భేష్..
‘‘అద్భుత విజయం సాధించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ముందుగా అభినందిస్తున్నా. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా వినూత్న పథకాలతో సామాజికాభివృద్ధికి ఆయన కృషిచేస్తున్నారు. ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి.. జనం తన దృష్టికి తెచ్చిన సమస్యల ఆధారంగా నవరత్నాలు అనే మేనిఫెస్టోను రూపొందించిన విధానమే ఆయనకు గొప్ప విజయాన్ని అందించింది. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో సంక్షేమ పథకాలతో జాతికి స్ఫూర్తినిచ్చారు. వాటికి మరింత మెరుగుదిద్ది జనం దరి చేర్చేందుకు కృషిచేస్తున్న జగన్ ముందు చూపును అభినందిస్తున్నా. పిల్లలను బడికి పంపుతున్న తల్లికి ప్రోత్సాహకం అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన విధానం సామాజిక మార్పు సాధనలో గొప్ప అడుగు. అమ్మకు సాయమందించడమే కాక..ఈ పథకం ఆర్థిక, సామాజిక మార్పు సాధనకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. సామాజిక రుగ్మతగా మారిన బాలకార్మిక వ్యవస్థనూ నిర్మూలించవచ్చు. మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల ప్రమాణాలను మెరుగుపరచేందుకూ ముఖ్యమంత్రి ప్రాధాన్యమిస్తున్నారు. విద్య కోసం వెచ్చించే సొమ్మును మూలధన వ్యయంగా పరిగణించడం ప్రశంసనీయం. చాలాకొద్ది మంది వ్యక్తులే ఇలాంటి గొప్ప ఆలోచన చేస్తారు. విద్యార్థి దశలో ఏ సందర్భంలో ఎంత తెలివిగా వారిపై సొమ్మును ఖర్చుచేస్తే సమాజానికి అంత గొప్ప ఫలితాలను అది అందిస్తుంది. రైతు సంక్షేమం ఈ ప్రభుత్వ అజెండా. నాణ్యమైన విత్తనాలకు మూలధనం అందించడంతోపాటు, ఎరువులు, పురుగు మందులు సమకూర్చడం, గిట్టుబాటు ధర కల్పించడం ఎంతో గొప్ప విషయం. పింఛన్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు వాలంటీర్ల నియామకం, వికేంద్రీకృత పాలనను అందించేందుకు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పాలి’’ అని గవర్నర్ అన్నారు.