సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా?

0
53

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం అసెంబ్లీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ‘స్పీకర్ ఏకపక్ష వైఖరి వీడాలి’ అంటూ నినాదాలు చేశారు. తెదేపా శ్రేణులపై దాడులు అరికట్టాలని ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అధినేత చంద్రబాబు, లోకేష్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన శాసనసభకు వెళ్లారు.

పోరాటాలను ముమ్మరం చేస్తాం
ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టామని విపక్షనేత చంద్రబాబు తెలిపారు. సభలో పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు వెల్లడించారు.

శాసనసభ ఓ లోటస్‌పాండ్‌లా తయారైందని టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తుంటే స్పీకర్ పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. దిగువ స్థాయి ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెస్తుంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. తమ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, తాము వాకౌట్ చేస్తామంటే సీఎం ఆదేశాల ప్రకారం సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడుకి మైక్ ఇవ్వని సభను ఇంత వరకు చూడలేదని మండిపడ్డారు.