ఏపీలో విద్యుత్‌ కొనుగోలు  సంస్థలకు హైకోర్టులో ఊరట

0
36

అమరావతి: ఏపీలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు హైకోర్టులో ఊరట లభించింది. పీపీఏలపై ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవో నంబర్‌ 63ను సవాల్‌ చేస్తూ విద్యుత్‌ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం..  పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పాటు విద్యుత్‌ సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ రాసిన లేఖలనూ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది.

కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నాం

ఇటీవల యూనిట్‌ ఛార్జీలు తగ్గించి బకాయి బిల్లు వివరాలు అందించాలని విద్యుత్‌ సంస్థలను ఏపీఎస్‌పీడీసీఎల్‌ కోరింది. టారిఫ్‌ ధరలు నచ్చకపోతే సంప్రదింపుల కమిటీ వద్ద తమ వైఖరి చెప్పాలని.. లేకపోతే పీపీఏలు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు విద్యుత్‌ సంస్థలు ఆరోపించాయి. ఈ అంశంలో ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవో నంబర్‌ 63పై ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నామని న్యాయస్థానానికి విన్నవించాయి. పీపీఏలకు ఏపీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్‌సీ) ఆమోదం తర్వాతే డిస్కంలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపాయి. చెల్లించిన బిల్లులు సైతం మళ్లీ సమీక్షించాలని జీవో జారీ చేయడం ఏకపక్ష నిర్ణయమని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమంటూ విద్యుత్‌ సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

బెదిరింపు ధోరణిలో లేఖలు పంపాల్సిన అవసరమేంటి?: హైకోర్టు

పీపీఏల వ్యవహారం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) పరిధిలోకి వస్తుందని.. బెదిరింపు ధోరణిలో లేఖలు పంపాల్సిన అవసరమేంటని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈఆర్‌సీ వద్దకు వెళ్లి ఇలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కదా అని వ్యాఖ్యానిస్తూ..  ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63కు చట్టబద్ధత ఎక్కడిదని ప్రశ్నించింది. అనంతరం ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరాం వాదనలు వినిపించారు. ఏ ప్రభుత్వమైనా ఒప్పందాలను పునఃసమీక్షిస్తుందని, అందులో భాగంగానే పీపీఏను సమీక్షిస్తున్నామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతిమంగా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ అంశంలో జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఏజీ బలంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63ను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేస్తూ దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.