ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో ఓ సౌలభ్యం ఉంటుంది

0
42

‘‘ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో ఓ సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ ప్రతిభావంతుల్ని గౌరవించే లక్షణం ఉంది. అందరూ ఇట్టే కలిసిపోతారు. అందుకే తెలుగు చిత్రసీమ అంటే నాకు ఇష్టం.. గౌరవం’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రమేష్‌ వర్మ దర్శకుడు. ఆగస్టు 2న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో అనుపమ విలేకరులతో మాట్లాడింది.

ఈ మధ్య తెలుగులో కాస్త విరామం వచ్చినట్టుంది. కారణమేంటి?
‘హలో గురు ప్రేమకోసమే’ తరవాత నేను తెలుగులో చేసిన సినిమా ఇదే. ఈమధ్యలో కొన్ని కథలు వింటున్నా. కానీ నాకు సంతృప్తి ఇవ్వలేదు. మలయాళంలో ఓ సినిమా పూర్తి చేశా. తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. అందుకే తెలుగులో ఎక్కువగా కనిపించలేదు.

తమిళంలో విడుదలైన ‘రాచ్చసన్‌’కి ఇది రీమేక్‌. ఆ సినిమా చూశారా?
దర్శకుడు రమేష్‌గారు వచ్చి ఈ కథ చెప్పే సమయానికి నేను నిజంగా ‘రాచ్చసన్‌’ చూడలేదు. కానీ నాన్న చూశారు. ‘చాలా మంచి సినిమా. నువ్వు తప్పకుండా చూడాలి’ అనేవారు. అయితే నాకు సమయం దొరకలేదు. రీమేక్‌ చేస్తున్నా కాబట్టి ఆ సినిమా చూడాల్సి వచ్చింది. నాకు బాగా నచ్చింది. గొప్ప కథ. మంచి పాత్రలు. ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. నేను కనిపించేది తక్కువ సేపే. కానీ కథలో మలుపులకు నా పాత్ర కారణం అవుతుంది. ఇంత మంచి సినిమాని వదులుకోవాలనిపించలేదు. అందుకే రీమేక్‌ అయినా సరే నటించాను. ‘ప్రేమమ్‌’ తరవాత నేను చేసిన రెండో రీమేక్‌ ఇది. ‘ప్రేమమ్‌’ రీమేక్‌లో నా పాత్రని నేనే చేశా. ఈసారి అమలా పాల్‌ చేసిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశా.

సినిమాలో చీరలోనే కనిపిస్తున్నారు. చీరకట్టు ఎలా అనిపిస్తోంది?
నాకు చీరకట్టు అలవాటే. ఐదో తరగతి చదువుతున్నప్పుడే చీర కట్టాను. అప్పట్లో స్కూల్లో వేడుకలు జరుగుతుంటే తప్పకుండా చీర కట్టుకునే వెళ్లేదాన్ని. అందుకే చీరలో కనిపించడం కొత్తగానూ, కష్టంగానూ అనిపించలేదు. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇదేం డీగ్లామర్‌ పాత్ర కాదు.

భవిష్యత్తులో మెగాఫోన్‌ పడతారా?
తప్పకుండా. అయితే ఇప్పుడే కాదు. ఇంకొంత   అనుభవం గడించాలి. ఓ నటిగా మీకొస్తున్న పాత్రల పట్ల మీరు సంతృప్తిగానే ఉంటున్నారా? నటిగా నాకు సవాల్‌ విసిరే పాత్ర ఇంకా రాలేదనే అనుకుంటున్నా. ఇది వరకు అల్లరి పిల్ల పాత్రలు చేశాను. ఇప్పుడు కాస్త పరిణితితో కూడిన పాత్రలు వస్తున్నాయి. వచ్చిన పాత్రకు న్యాయం చేయడం పైనే నా దృష్టంతా.

తెలుగులో చేస్తున్న కొత్త సినిమాలేంటి?
ప్రస్తుతం రెండు కథలు ఒప్పుకున్నా. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో చెబుతా.

‘రాచ్చసన్‌’లో అమలా పాల్‌ని అనుకరించారా?
ఆమె పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో నేను నటించాను. అమలా పాల్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. కళ్లతోనే హావభావాలు పలికించగల నటి ఆమె. అనుభవజ్ఞురాలు కూడా. ఆమెతో నన్ను పోల్చడం సరికాదు.

క్రికెటర్‌ బుమ్రాతో మీరు సన్నిహితంగా ఉంటున్నారన్న వార్తలొచ్చాయి. వాటిపై మీ స్పందన?
నో కామెంట్‌. తన గురించి ఇప్పుడేం మాట్లాడలేను.

ఈ మధ్య ఓ సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేశారట. ఆ అనుభవాలేంటి?
సినిమా అంటే నాకు ప్రాణం. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకోవాలన్న  తపనతోనే సహాయ దర్శకురాలిగా పనిచేశా. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కార్‌వ్యాన్‌ దాటి బయటకు వచ్చేదాన్ని కాదు. కానీ సహాయ దర్శకురాలిగా అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకునేదాన్ని. అప్పుడే కథానాయికగా పనిచేయడం ఎంత సులభమో నాకు అర్థమైంది.