వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్‌కు సాటి.. ఆదాయం మాటేంటి?

0
55

‘అరే.. డుబ్కీ ఇచ్చి పోనీకే నువ్వేమన్నా పర్దీప్‌ నర్వాల్‌వారా..’

‘కాదురా.. నేను రాహుల్‌ చౌదరిని..’

ఇదీ హైదరాబాద్‌ నగరంలో ఓ చల్లని సాయంకాలం వేళ పార్క్‌లో కబడ్డీ ఆడుతున్న చిన్నారుల ముచ్చట. వారి సంభాషణను బట్టి ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రజలకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. చిన్నా.. పెద్ద.. ఆడా.. మగా తేడా లేకుండా ఇంటిల్లిపాది కలిసి ఆటను ఆస్వాదిస్తున్నారు. పెద్దవారు తమ బాల్య స్మృతుల్ని స్మరించుకుంటున్నారు. తెలుగునాట పల్లె పల్లెకూ చేరువైన ఈ గ్రామీణ క్రీడ అసలెలా పుట్టిందో తెలుసా?

కురుక్షేత్ర మహా సమరంలో కురువంశ గురువు ద్రోణాచార్యులు చక్రవ్యూహాన్ని కనిపెట్టాడు. ప్రత్యర్థి సైనికుడు ఇవతలి వైపు వచ్చినప్పుడు ఏడుగురు సైనికులు అతడిని చుట్టుముడతారు. బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. చక్రవ్యూహంలో బంధిస్తారు. ఆ యుద్ధతంత్రం నుంచి పుట్టిందట కబడ్డీ! అప్పట్నుంచి భారతావనిలో ప్రతి ఇంటి ఆటగా మారిందట. ఓ వెలుగు వెలిగిన ఈ గ్రామీణ క్రీడ రానురాను తన ప్రభ కోల్పోయింది. 2014లో మళ్లీ కార్పొరేట్‌ హంగులు అద్దుకొని ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌కే పోటీ విసిరేంతగా ‘ప్రొ కబడ్డీ’గా తన రూపం మార్చుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్‌ ఆరంభమైంది. ఇంతకీ ఈ ‘కార్పొరేట్‌ కూత’ వెనక అసలేం ఏం జరిగిందో.. జరుగుతోందో తెలుసా!!

 

గొప్ప సంకల్పంతో..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర, టెవిజన్‌ సెలబ్రిటీ చారుశర్మ (2008లో ఆర్‌సీబీ సీఈవో) కలిసి దేశంలో కబడ్డీ క్రీడకు పూర్వవైభవం తెచ్చేందుకు ‘మాషల్‌ స్పోర్ట్స్‌’ గ్రూప్‌ స్థాపించారు. ఇది 2014లో ప్రొ కబడ్డీని తెరపైకి తెచ్చింది. స్టార్‌స్పోర్ట్స్‌ సహకారంతో ఆటగాళ్ల బిడ్డింగ్‌ జరిగి మ్యాచ్‌లు మొదలయ్యే వరకూ ఈ ప్రాజెక్ట్‌పై ఎవరికీ నమ్మకాల్లేవు. స్టార్‌ సైతం ఊరికే భాగస్వామి కాలేదు. భారీ పరిశోధనే చేసింది. చివరికి 2014, మే 20న ఆటగాళ్ల వేలం నిర్వహించింది.

2,50,000 డాలర్ల ఫీజుతో 8 ఫ్రాంచైజీలు రంగంలోకి దిగాయి. అభిషేక్‌ బచ్చన్‌, రోనీ స్ర్కూవాలా, పార్థ్‌ జిందాల్‌, కిషోర్‌ బియానీ వంటి సినీ, వ్యాపార ప్రముఖులు వీటిని సొంతం చేసుకున్నారు. ప్రొ కబడ్డీ మొదలైన తొలి సీజన్లోనే ఎవరూ ఊహించనంతగా ఆకట్టుకుంది. 2014 ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌కే తిరుగులేని సవాల్‌ విసిరింది. ఈ ప్రభంజనానికి షాకైన స్టార్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాషల్‌ స్పోర్ట్స్‌లో 74% వాటా కొనుగోలు చేసింది. అప్పుడు 8 జట్లతో మొదలైన ప్రొ కబడ్డీ ఇప్పుడు 12 జట్లకు చేరింది. 60 మ్యాచుల నుంచి 140 మ్యాచ్‌లకు పెరిగింది. పీకేఎల్‌ ఆదాయం 300% హెచ్చింది.

మారిన తలరాత

రాహుల్‌ చౌదరీ, అనూప్‌ కుమార్‌, జస్వీర్‌సింగ్‌, మంజీత్‌ చిల్లర్‌, రోహిత్‌ కుమార్‌, సురేందర్‌ నాడా.. ఎవరు వీళ్లంతా?అంతర్జాతీయ కబడ్డీలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వీరులు. కానీ గుర్తింపునకు నోచుకోని అనామకులు. ఎంతసేపూ సచిన్‌, ధోనీ, కోహ్లీ మైకంలో ఊగిపోయే జనాలు మిగతా ఆటగాళ్లను కనీసం గుర్తిస్తే కదా! అలాంటిది ప్రొ కబడ్డీ వీరి తలరాతను మార్చేసింది. అందుకు ఇదో ఉదాహరణ.కేప్‌టౌన్‌ విమానాశ్రయంలో 2014లో తాను ఎక్కడాల్సిన విమానం రాకేశ్ కుమార్‌ మిస్సయ్యాడు. సాయం కోసం ఓ భారతీయ జంట దగ్గరికి వెళ్లాడు. అప్పుడు ఎనిమిదేళ్ల వారి కుమారుడు ‘నువ్వెవరో నాకు తెలుసు. రాకేశ్‌ కుమార్‌! పట్నా పైరేట్స్‌ కెప్టెన్‌వి’ అనడంతో ఒక రకమైన తన్మయత్వం చెందాడు. ఎందుకంటే సినిమా హీరోలు, క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి అనుభవం అతడికి ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇదీ ప్రొ కబడ్డీ వారికిచ్చిన గుర్తింపు.

దాదాపు కబడ్డీ ఆటగాళ్లంతా పేద, మధ్య తరగతి వారే. రాహుల్‌ చౌదరి వ్యవసాయం చేసేవాడు. మిగతా అందరికీ అదే పరిస్థితి. ప్రొ కబడ్డీతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. 2014లో రాకేశ్‌ కుమార్‌ను రూ.12.80 లక్షలకు పట్నా కొనుగోలు చేసేంది. అప్పట్లో అదే అత్యధిక బిడ్‌. అలాంటిది గతేడాది మోనూ గోయత్‌ ఏకంగా రూ.1.50 కోట్లు పలికాడు. భారత్‌లో అత్యధిక మొత్తం దక్కించుకున్న క్రికెటేతర ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈసారి సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్‌ అత్యధిక మొత్తం రూ.1.45 కోట్లకు కైవసం చేసుకుంది. దీపక్‌ నివాస్‌ హుడా (రూ. 1.26 కోట్లు), నితిన్‌ తోమర్‌ (రూ.1.20 కోట్లు), ఫజల్‌ అత్రాచలీ (రూ.1.10 కోట్లు), రోహిత్‌ కుమార్‌ (రూ.98 లక్షలు), రాహుల్‌ చౌదరి (రూ.94 లక్షలు) టాప్‌-5లో ఉన్నారు. ఇప్పుడు రాహుల్‌ చౌదరీ, పర్దీప్‌ నర్వాల్‌ పెద్ద సెలబ్రిటీలు. విదేశీ ఆటగాళ్లు ఫజల్‌ అత్రాచలీ, అబోజర్‌ మిఘాని, లీ జాన్‌ కున్‌కు భారత్‌లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఆదాయం-ఆదరణ పోటాపోటీ

పీకేఎల్‌ ఆదాయం, ఆదరణ ఇంతింతై వటుడింతై అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఆరంభ సీజన్‌లో ప్రొ కబడ్డీ వ్యూయర్‌షిప్‌తో ప్రకంపనలు సృష్టించింది. దాదాపు 43.5 కోట్ల మంది ఆటను వీక్షించారు. 55.2 కోట్ల వ్యూయర్‌షిప్‌ ఉన్న ఐపీఎల్‌ తర్వాతి స్థానం ఆక్రమించింది. యు ముంబా, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 8.64 కోట్లకు పైగా చూశారు. ఈ ప్రభంజనంతో షాకైన స్టార్‌ ఇండియా వెంటనే మాషల్‌ స్పోర్ట్స్‌లో 74% వాటా కొనుగోలు చేసింది. ఐదేళ్లకు రూ.300 కోట్లతో వివో టైటిల్‌ స్పాన్సర్‌గా ఒప్పందం చేసుకుంది. ప్రైజ్‌మనీ రూ.కోటి నుంచి రూ.8 కోట్లకు పెరిగింది.

ప్రకటనల ఆదాయం 320% పెరిగింది. నాలుగో సీజన్‌లో రూ.70 కోట్లుగా ఉన్న ఇది ప్రస్తుతం రూ.150 కోట్లు దాటింది. టైటిల్‌ స్పాన్సర్‌ను పక్కనపెడితే అసోసియేట్‌ స్పాన్సర్ల సంఖ్య 10 దాటింది. వీరు ఏడాదికి రూ.5-7 కోట్లు చెల్లిస్తున్నారు. 2016లో భారత్‌లో నిర్వహించిన కబడ్డీ ప్రపంచకప్‌ పీకేఎల్‌ ఆదాయ వృద్ధికీ దోహదం చేసింది. స్పాన్సరింగ్‌ దాదాపు 154% పెరిగింది. ప్రస్తుతం వ్యూయర్‌షిప్‌ కాస్త తగ్గుముఖం పట్టింది. 2014లోని 43.5 కోట్ల నుంచి 2017లో 31.2 కోట్లకు తగ్గింది. అయితే ఐపీఎల్‌ పరిస్థితీ అదే. 2018లో ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌ 41.1 కోట్లుగా ఉంది. అదే ఏడాది బార్క్‌ ప్రకారం పీకేఎల్‌ ఇంప్రెషన్స్‌ 1,601 మిలియన్ల నుంచి 1,188 మిలియన్లకు తగ్గాయి. అంటే దాదాపు 25% తగ్గుదల అన్నమాట. ఈ సారి సుదీర్ఘ సీజన్‌, డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ విధానం, ఫ్రాంచైజీలు పెరగడంతో వ్యూయర్‌షిప్‌ మెరుగవుతుందని నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు.

ఫ్రాంచైజీల్లో అసంతృప్తి!

ప్రొ కబడ్డీ తొలి సీజన్‌ ఆరంభంలో ఫ్రాంచైజీలన్నీ ఆందోళన పడ్డాయి. కోట్ల రూపాయల పెట్టుబడులకు ఫలితం ఉంటుందా అని బెంగపడ్డాయి. వారి అంచనాల్ని తలకిందులు చేసి ప్రభంజనం సృష్టించడంతో యజమానులు ఆనందపడ్డారు. ఐతే పీకేఎల్‌ నిర్వహించే మాషల్‌ స్పోర్ట్స్‌లో స్టార్‌ వాటా కొనుగోలు చేయడం వల్ల కొందరు ఆందోళన చెందారట. పీకేఎల్‌ స్థాయి, వ్యూయర్‌షిప్‌నకు తగినట్టు డబ్బులు చెల్లిస్తుందా అని మదన పడుతున్నారని సమాచారం. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌, ఇతర ప్రకటనల ద్వారా స్టార్‌తో సమానంగా తమకు ఆదాయం రావడం లేదని విచారపడుతున్నట్టు వినికిడి. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)తో పోలిస్తే పీకేఎల్‌కు వ్యూయర్‌షిప్‌ చాలా ఎక్కువ. స్పాన్సర్‌షిప్‌ ఆదాయం మాత్రం తక్కువ.

ప్రస్తుతం పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 5-10 స్పాన్సర్లు ఉంటున్నారు. కాగా లీగ్‌ సామర్థ్యం, వ్యూయర్‌షిప్‌కు తగ్గట్టు వీరు చెల్లించడం లేదు. ఉదాహరణకు ప్రధాన స్పాన్సర్‌ జెర్సీలపై తన బ్రాండ్‌ వేయిస్తున్నందుకు సీజన్‌కు రూ.1-3 కోట్ల వరకు ఇస్తున్నారు. సీజన్‌ కాలపరిమితిని బట్టి మ్యాచ్‌కు రూ.15 లక్షలని అంచనా. ఇదే ఐఎస్‌ఎల్‌లో రూ.5-10 కోట్లు, ఐపీఎల్‌లో రూ.10-20 కోట్లుగా ఉంది. ఐఎస్‌ఎల్‌తో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లు టీవీలో కనిపించే సమయం ఎక్కువే కావడం గమనార్హం. కబడ్డీ ఆటగాళ్లకు కోహ్లీ, ధోనీ స్థాయి లేకపోవడం ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఐఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ యజమానులైన రణ్‌బీర్‌ కపూర్‌, జాన్‌ అబ్రహం, గంగూలీ, సచిన్‌, నీతా అంబానీ స్థాయి చాలా చాలా ఎక్కువ. ఆటగాళ్లతో పాటు వారూ జెర్సీలు వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇక బ్రాడ్‌కాస్టర్‌ తమ ఉత్పత్తులకు సంబంధించి ఎంత ఫ్రీ కమర్షియల్‌ టైమ్‌ ఇస్తారన్నది స్పాన్సర్లు చూస్తారు. ఇలాంటి కారణాలతో ఫ్రాంచైజీలకు ఆశించిన ఆదాయం సమకూరడం లేదు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌