సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రితేశ్(పేరు మార్చాం) అదే సంస్థలో ఓ యువతిని ప్రేమించాడు. అమె అతడిని నమ్మింది. ఇద్దరూ హద్దులు దాటేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత రితేశ్ ప్రవర్తన నచ్చక ఆమె దూరం జరిగి వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. అహం దెబ్బతిన్న రితేశ్ గతంలో తాము తీసుకున్న చిత్రాల సీడీని ఆమె భర్తకు పంపించాడు. అయినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో వాటిని అసభ్య చిత్రాల సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఓ స్నేహితురాలు వాటిని చూసి బాధితురాలి చెవిన వేసింది. యువతి సైబరాబాద్ షీ బృందాలకు మొర పెట్టుకోగా సైబర్‌క్రైమ్ పోలీసుల సహకారంతో రితేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియోలను సైట్ నుంచి తొలగించగలిగారు కానీ జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.
జంటనగరాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. సహజీవనాల పేరిట హద్దులు దాటేస్తుండటం చేటు చేస్తోంది. సంబంధాలు బాగున్న సమయాల్లో తీసుకున్న వీడియోలు, చిత్రాలే అమ్మాయిల పాలిట నరకప్రాయమవుతున్నాయి. దురదృష్టం తలుపు తట్టి ఇద్దరి మధ్య సంబంధం చెడిపోతే యువతులకు కష్టాలు మొదలవుతున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న యువకుడి లోపలి మనిషి బయటకొస్తున్నాడు. మాజీ ప్రేమికురాలిని అభాసుపాలు చేయడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. బాధితురాలు ధైర్యం చేసి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే కటకటాల పాలవుతున్నాడు.
అదుపు చేసే వారు లేక..
చదువుకునే రోజుల్లోనే యువత నగరాల్లో ఉండాల్సి రావడంతో పాశ్చాత్య సంస్కృతి త్వరగా వంటబట్టేస్తోంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరి అయిదంకెల వేతనాలు సంపాదించే క్రమంలో కొత్తదనం కోరుకోవడం సహజంగా మారింది. పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు వారిని వసతిగృహాలు, అద్దె ఇళ్లలో ఉండేందుకు అంగీకరిస్తుంటారు. పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసే ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతవిద్య చదివే క్రమంలో పాశ్చాత్య ధోరణుల వాసన తగిలినా చాలామంది యువతీయువకులు హద్దుల్లోనే ఉంటున్నారు. కొందరు మాత్రం ఆ మోజులో పడిపోతున్నారు. అలాంటివారు భవిష్యత్తులో చిక్కులు కొని తెచ్చుకుంటున్నామని ఆ సమయంలో గ్రహించలేక పోతున్నారు.
యువతులకే ఎక్కువ అనర్థాలు
ప్రేమ తీయటి అనుభూతిని కలిగించేది కావడంతో యువత ఆకర్షితులు కావడం సహజమే. ఒకరిని ఒకరు లోతుగా అర్థం చేసుకునే క్రమంలో కొందరు సహజీవనానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడంతా సెల్ఫీల కాలం కావడంతో ఏకాంత సమయాలను సరదాగానో, మధురజ్ఞాపకాల కోసమో వీడియోలు, చిత్రాలు తీసేస్తున్నారు. వాటిని చరవాణిలో భద్రపరుచుకోవడం అబ్బాయిలకు అలవాటుగా మారుతోంది. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలొచ్చినా, కుదరదని తేలినా విడిపోక తప్పని పరిస్థితి. ఈ పరిణామం అమ్మాయిలకు శాపంగా మారుతోంది. అమ్మాయిలు తమను దూరంగా పెట్టినా, నిర్లక్ష్యం చేసినా అబ్బాయిల అహం దెబ్బతిని బెదిరింపుల పర్వానికి తెర లేపుతున్నారు. లొంగకపోతే అప్పటివరకు మధురజ్ఞాపకాలుగా దాచుకున్న చిత్రాలే బెదిరింపులకు గురిచేసే ఆయుధాలవుతున్నాయి. బాధితురాలికి అతడి వికృతరూపం పూర్తిగా అవగతమవుతోంది. అప్పుడు ఇంకా దూరం జరిగేందుకు ప్రయత్నిస్తుండటంతో యువకులు రెచ్చిపోయి వీడియోలు, చిత్రాల్ని అంతర్జాలంలో అప్‌లోడ్ చేస్తున్నారు. అలా ఓ అమ్మాయి జీవితం కష్టాల కడలిలో నట్టేట మునుగుతోంది. |
శిక్షలు తప్పవు
* అమ్మాయిల అభీష్టానికి విరుద్ధంగా అంతర్జాలంలో ప్రచారం చేస్తే ఆ యువకులు చట్టానికి చిక్కక తప్పదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైబర్‌క్రైమ్ పోలీసుల అమ్ములపొదిలో చేరడంతో ఎంత తెలివిగా నేరం చేసినా వీరిని పట్టుకుంటున్నారు.
* ఒకరి హక్కులకు భంగం కలిగించేలా అంతర్జాలంలో ప్రచారం చేస్తే బాధ్యులపై ఐటీ చట్టం 66సీ, 66డీ, 67 కింద కేసులు నమోదు చేస్తారు.
* మహిళలపై వేధింపులకు దిగితే ఐపీసీ 509(గౌరవానికి భంగం కలిగించడం), 354డీ(నిర్భయ) చట్టాల కింద కటాకటాల్లోకి పంపుతారు. ఐపీసీ 292, 294 చట్టాల కింద కేసులు తప్పవు.
* నేరం రుజువైతే మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది. రెండోసారి ఇదే తరహా కేసులో చిక్కితే అయిదేళ్ల వరకు ఊచలు లెక్కించాలి.
* జైలుకెళ్లినవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చిక్కులు తప్పవు. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ కొలువుల్లోనూ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి అక్కడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.