ఆ నీటిని హోదాగా భావిస్తున్న సామాన్యులు

0
62

వీధి పక్కనే నగరపాలక సంస్థ.. ఊళ్లలో అయితే పంచాయతీ ఆధ్వర్యంలోని వాటర్‌ ట్యాంక్‌ ఉంటుంది.. ఇంటింటికీ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం కింద ఇటీవలే ఏర్పాటుచేసిన నల్లాలున్నాయి.. వాటి నుంచి మంచినీటిని సరఫరా చేస్తుంటారు. అయినా చాలాచోట్ల ఆర్వో ప్లాంట్ల ద్వారా నీటి వ్యాపారం జోరుగా సాగుతూనే ఉంది. స్థానిక సంస్థలు సరఫరా చేసే నీళ్లు కలుషితమవుతున్నాయనే అపవాదు ఉండడంతో సామాన్యులు కూడా డబ్బులు వెచ్చించి మరీ ఆర్వో నీళ్లు కొనుక్కుంటున్నారు. కాని వాటి వలన ఏమాత్రం ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

పాలు నీళ్లలా ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు కానీ నీళ్లు ఎలా ఉన్నాయో కనిపెట్టడం కష్టం. రుచి చూసినా సరే చప్పగా ఉన్నాయనో.. తియ్యగా ఉన్నాయనో.. ఉప్పగా ఉన్నాయనో చెప్పగలం తప్పించి శుద్ధ జలమేనా? సురక్షిత నీరేనా అని అడిగితే చెప్పలేం. సరిగ్గా ఈ అంశమే పట్టణాల్లో వాటర్‌ ప్లాంట్‌ల నిర్వాహకులకు వరంగా మారి.. పెద్ద వ్యాపారమైపోయింది. మున్సిపల్‌ నీరు మంచిది కాదు.. మేము సరఫరా చేసేదే మంచినీరు అంటూ వాటర్‌ప్లాంట్ల వారు ప్రచారం సాగిస్తుండడం విశేషం. ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి. చాలాగ్రామాల్లో ఉండే వాటర్‌ ట్యాంక్‌లపై ‘శుద్ధ జల భాండాగారం’ అని కనిపిస్తుంది. వాటి నుంచి గ్రామంలోని ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తుంటారు. అయితే ఆ చుట్టుపక్కలే బోలెడన్ని వాటర్‌ ప్లాంట్లు వెలుస్తున్నాయి. వాటిని గ్రామ పంచాయతీలో, స్వచ్ఛంద సంస్థలో నిర్వహిస్తుండడం గమనార్హం. మరి నిజంగా వీటివలన ప్రయోజనం ఏమైనా ఉందా అని తరచి చూస్తే వాటిలోని డొల్లతనం బయటపడుతుంది. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ, పీఆర్‌) చేసిన ఒక అధ్యయనం తాలూకూ వివరాలను తరచి చూస్తే కొన్ని పంచాయతీలు వాటర్‌ ప్లాంట్లను ఒక అవసరంగా కాకుండా.. తప్పనిసరి అవసరంగా భావిస్తున్న ధోరణి కనిపించింది.

తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన ఆర్వో (రివర్స్‌ ఆస్మోసిస్‌) ప్లాంట్లు రావడంతో ఆ నీరు ఎంతవరకు సురక్షితమో తెలుసుకోవాలని తలపోసిన ఎన్‌ఐఆర్‌డీ… తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్లాంట్లపై అధ్యయనం చేసింది. 16 ప్లాంట్లను పంచాయతీలు, అయిదింటిని ఎన్‌జీవోలు నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గంట్లవల్లి, ఖమ్మదనం, పాపిరెడ్డి గూడ ప్లాంట్లను సంస్థ పరిశీలించింది. మొత్తం 21లో 8 ప్లాంట్లు అసలు అవసరమేలేదని ఆయా ప్రాంతాల్లో బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) నిబంధనలకు అనుగుణంగానే శుద్ధ జలం లభిస్తోందని వివరించింది. స్వచ్ఛమైన తాగు నీటికి అక్కడ అవకాశం ఉన్నా ఆర్వో ప్లాంట్లను నెలకొల్పటం ఇక్కడ గమనాంశం.

పడిపోతున్న కాల్షియం, మెగ్నీషియం స్థాయులు
శుద్ధ జలాలు లభించే గ్రామాల్లోనూ.. ప్లాంట్లు నెలకొనటంతో లవణాలు అంతర్ధానమైన నీటికి ప్రజలు నెలకు రూ.50 నుంచి రూ.150 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆర్వో ప్లాంట్లలోని నీటిలో కాల్షియం, మెగ్నీషియం స్థాయులు బాగా పడిపోతున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతో ఇక్కడి నీటిని తాగేవారికి కాల్షియం కొరత ఏర్పడవచ్చు. ‘తాగునీటిలో నాణ్యత సమస్యలు ఉన్నచోట మాత్రమే ఆర్వో ప్లాంట్లను నిర్వహించాలి. మేము ఒక పంచాయతీ సర్పంచిని కలవగా.. తాము ఓటర్లకు ఆర్వో నీటిని ఇవ్వాల్సి ఉండడంతో ప్లాంటును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిజానికి అక్కడ శుద్ధ జలం అందుబాటులోనే ఉంది. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నదే కాకుండా.. నిర్వహణ వ్యయమూ అధికం. ఆర్వో ప్లాంట్లలోని నీళ్లు రుచిగా ఉండవని, పైపులైన్ల ద్వారా శుద్ధ జలాన్ని సరఫరా చేస్తే వాటినే తాము తాగుతామని ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు మాకు చెప్పారు’ అని ఎన్‌ఐఆర్‌డీ గ్రామీణ మౌలిక వసతుల కేంద్రం విభాగాధిపతి ప్రొ. పి.శివరాం వివరించారు.

భగీరథకు ఉపయోగపడనున్న అధ్యయనం
ఎన్‌ఐఆర్‌డీ తాజా అధ్యయనం.. తెలంగాణలోని భగీరథ నీటిని వాడే ప్రజానీకానికి బాగా ఉపయోగపడనుంది. భగీరథ నీళ్లు మంచివి కావంటూ ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు ప్రచారం చేస్తుండటంతో.. భగీరథ శాఖ కొద్ది నెలల క్రితం కరపత్రాల ద్వారా తమ నీటిని వాడడం వల్ల ఒనగూరే లాభాలను తెలియజేయాల్సి వచ్చింది. శుద్ధ జలం లభించే చోట ఆర్వో ప్లాంట్లు అక్కరలేదని ఎన్‌ఐఆర్‌డీ చెబుతున్నందున.. ఇప్పుడు భగీరథ శాఖ మరింతగా ప్రజలకు తెలియజేసేందుకు వీలవుతుంది.