ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రస్థానం సెమీస్ దగ్గరే ఆగిపోయింది. అయితే ఆ మ్యాచ్ ముగిసిన వారానికి కానీ.. జట్టు సభ్యులు స్వదేశానికి రాలేదు. కానీ వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ ముగిసిన రెండు రోజులకే ముంబయిలో వాలిపోయాడు. అంత అత్యవసరంగా రోహిత్ సొంత ఖర్చులతో ఒక్కడే స్వదేశానికి వచ్చేయడానికి కారణమేంటో అర్థం కాలేదు! కెప్టెన్ విరాట్ కోహ్లితో రోహిత్‌కు విభేదాలన్న చర్చ మొదలైంది అప్పుడే. రోజు రోజుకూ ఈ చర్చ విస్తృతమై.. ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి, అనుష్కలను ఉన్నట్లుండి రోహిత్ అన్‌ఫాలో కావడం కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల మధ్య సంబంధాలపై సందేహాల్ని మరింత పెంచుతోంది? ఇంతకీ వీళ్లిద్దరి మధ్య వివాదానికి కారణమేంటి? భారత జట్టులో అసలేం జరుగు?తోంది?
ప్రపంచకప్ సందర్భంగానే కోహ్లిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యాడు రోహిత్. ఆ సంగతి అప్పుడెవరూ గుర్తించలేదు. సెమీస్‌లో భారత్ దిగ్భ్రాంతికర ఓటమి అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కోహ్లి సతీమణి అనుష్కను కూడా రోహిత్ అనుసరించడం మానేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయన్న సందేహాలు పెరుగుతున్నాయి. ప్రపంచకప్ సందర్భంగా జట్టు ఎంపిక, కూర్పు విషయంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, వైస్‌కెప్టెన్ అయిన తనను అసలు పరిగణనలోకే తీసుకోకపోవడం.. వారి నిర్ణయాలు జట్టుకు చేటు చేయడంపై రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రపంచకప్‌లో ఏకంగా అయిదు శతకాలు బాది టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు రోహిత్. తాను అంత కష్టపడి జట్టును ముందుకు తీసుకెళ్తుంటే.. కోహ్లి, శాస్త్రి నిర్ణయాలు జట్టును దెబ్బ తీశాయని, వారి వల్లే టీమ్‌ఇండియా సెమీస్‌లో నిష్క్రమించిందనే అభిప్రాయం రోహిత్‌లో బలంగా ఉందని, సగం జట్టు సభ్యుల మద్దతు కూడా అతడికి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాయుడిని పక్కన పెట్టడం, అతడి బదులు విజయ్ శంకర్‌ను జట్టులోకి ఎంపిక చేయడం పట్ల రోహిత్ ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్నాడట. కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కోసమే.. ఒకట్రెండు మ్యాచ్‌ల వైఫల్యాన్ని కారణంగా చూపి రాయుడిని పక్కన పెట్టారని.. మామూలుగానే జట్టులో ఉండటానికి అర్హుడు కాని శంకర్‌ను ప్రపంచకప్ లాంటి టోర్నీకి ఎంపిక చేసి వరుసగా మ్యాచ్‌లు ఆడించడం కూడా రోహిత్‌కు రుచించలేదని సమాచారం. షమి, జడేజా లాంటి వాళ్లకు పెద్దగా అవకాశాలివ్వకుండా భువనేశ్వర్, చాహల్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.. తుది జట్టు ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రోహిత్‌కు ఆగ్రహం తెప్పించిందట!
ధోని ఏడులోనా?: అన్నింటికీ మించి సెమీఫైనల్లో వరుసగా వికెట్లు పడుతున్నపుడు ధోనీని ముందు పంపకుండా ఏడో స్థానంలో దించడంపై రోహిత్ బహిరంగంగానే తన అసంతృప్తిని ప్రకటించినట్లుగా జట్టు వర్గాలు చెబుతున్నాయి. ధోనీని కింది వరుసలో పంపడంపై రోహిత్ ముందు నుంచి వ్యతిరేకతతోనే ఉన్నాడు. తాను అయితే మహి నాలుగో స్థానంలో ఆడాలని కోరుకుంటానని గతంలో రోహిత్ ఒకసారి స్పష్టంగా చెప్పాడు. మిగతా పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ సెమీఫైనల్లో మాత్రం ధోనీని ఏడులో పంపడాన్ని గంగూలీ సహా చాలామంది తప్పుబట్టారు. కోహ్లి దీన్ని జట్టు నిర్ణయంగా చెప్పాడు కానీ.. రోహిత్, మరికొందరు ఈ విషయంలో సానుకూలంగా లేరన్నది స్పష్టంగా తెలుస్తోంది. సెలక్షన్, కూర్పుపై జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందని.. తన అభిప్రాయంతో కొందరు ఆటగాళ్లు పూర్తిగా ఏకీభవించడంతో రోహిత్ విరాట్ పట్ల వ్యతిరేకతను దాచుకోవట్లేదని ప్రచారం జరుగుతోంది. మామూలుగా విజయాల్లో ఉంటే ఇలాంటి వ్యవహారాలు బయటికి రావు. ఏవైనా విభేదాలున్నా సద్దుమణిగిపోతాయి. ప్రపంచకప్ గెలిచేందుకు మంచి అవకాశం లభించినా.. కేవలం సెలక్షన్, కూర్పులో తప్పిదాల వల్లే జట్టు నిష్క్రమించిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కోహ్లి-రోహిత్ వివాదం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఇంత చర్చ జరుగుతున్నా ఆటగాళ్లు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అంటున్నాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉంటే ఫర్వాలేదు. అవి ముదిరితే జట్టుకు నష్టమే. మరి ఈ సమస్యకు ఎలాంటి ముగింపు లభిస్తోందో..!