నిదానమే ప్రధానం అంటున్న తెలుగు చిత్రసీమ 

0
62

నిదానమే ప్రధానం అంటున్న తెలుగు చిత్రసీమ
ముందస్తు, నిర్మాణానంతర కార్యక్రమాలకు పెరిగిన ప్రాధాన్యం.

వచ్చే వారంలో మా సినిమా విడుదల ఖరారైంది. ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయినట్టే’. ‘రాత్రిళ్లు నిద్రలేకుండా మా సంగీత దర్శకుడు నేపథ్య సంగీతం సమకూర్చారు.  విడుదలకి ముందు రోజు వరకూ ఆయన పనిచేశారు’.

ఇలాంటి మాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటాయి. సినిమా వచ్చే వారమే విడుదల తేదీ ఖరారు చేసుకొన్నా… మరో పక్క చిత్రీకరణ పనులు జరుగుతూనే ఉంటాయి. విడుదలకి ముందు రోజు కూడా సంగీతానికి సంబంధించిన పనులో లేదంటే ఎడిటింగ్‌ కార్యక్రమాలో.. ఇలా ఏవో ఒకటి నడుస్తూనే ఉంటాయి. ఒక పక్క ప్రచారం… మరోపక్క వ్యాపారం.. ఇంకోవైపు పంపిణీ. తెరపైన బొమ్మ పడేవరకూ చిత్రబృందాలు పడే హైరానా అంతా ఇంతా కాదు. తీరా విడుదల తర్వాత ఇంకో వారం సమయం ఉండుంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదంటుంటారు. నిర్మాణానంతర కార్యక్రమాలకి    చాలినంత సమయం లేకపోవడమే దీనంతటికీ కారణం. సినిమా చిత్రీకరణ ఎంత కీలకమో, నిర్మాణానంతర పనులు అంతకంటే కీలకం. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణానంతర పనులు ఎప్పుడూ హడావుడిగానే సాగుతుంటాయి. దానివల్ల చాలా సినిమాలు, చాలా రకాలుగా నష్టపోతుంటాయి. వాటి నుంచి పరిశ్రమ పాఠాలు నేర్చుకుందో, లేక చదువుకున్న సాంకేతిక నిపుణులు పరిశ్రమలోకి రావడమో  తెలియదు కానీ… ప్రతి విషయంలోనూ ప్రణాళిక కనిపిస్తోంది. విడుదల విషయంలో అయితే అస్సలు తొందర పడటం లేదు. చిత్రీకరణని ఎంత కీలకంగా పరిగణిస్తున్నారో, నిర్మాణానంతర కార్యక్రమాలకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పనులన్నీ పూర్తయ్యాకే విడుదల చేద్దామంటున్నారు. కథానాయకులు కూడా ఆ విషయంలో మరింత పక్కాగా వ్యవహరిస్తున్నారు.

ప్రీ ప్రొడక్షన్‌.. ప్రొడక్షన్‌… పోస్ట్‌ ప్రొడక్షన్‌…
సినిమా చిత్రీకరణ ఇలా మూడు దశల్లో సాగుతుంటుంది. కథ, స్క్రిప్టు, నటులు, సాంకేతిక వర్గం, లొకేషన్ల ఎంపిక… తదితర పనులన్నీ తొలి దశలో సాగుతాయి. రెండో దశలో చిత్రీకరణ జరుగుతుంది. మూడో దశలో డబ్బింగ్‌, ఎడిటింగ్‌, నేపథ్య సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ లాంటి పనులు జరుగుతుంటాయి. ప్రతి దశ ప్రణాళిక ప్రకారం నడిస్తేనే సినిమా అనుకొన్నట్టుగా తెరపైకొస్తుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఆ ప్రణాళిక అంతగా కనిపించేది కాదు. సెట్‌కి వెళ్లాక కథలో మార్పు చేయడం, దాంతో చిత్రీకరణ జాప్యం కావడం ఇంతలో విడుదల తేదీ దగ్గరపడటం… సినిమా విడుదల ఆలస్యమైతే బడ్జెట్‌ పెరిగిపోతుందని నిర్మాతల భయంతో పనులన్నీ హడావుడిగా సాగేవి. ఆఖరి నిమిషంలో జరిగే తప్పులు, ఒత్తిళ్ల మధ్య సినిమాలు విడుదలయ్యేవి. అలాంటి తప్పులకు భారీ మూల్యమే చెల్లించాయి చాలా సినిమాలు. అందుకే ఇప్పుడు అలాంటి హడావుడికి దూరంగా, ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో సినిమా నిర్మాణం జరుగుతోంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెజారిటీ సినిమాలు పక్కా స్క్రిప్టుతోనే సెట్స్‌పైకి వెళుతున్నాయి. నిర్మాణానంతర పనుల విషయంలో అయితే మరింత పక్కాగా వ్యవహరిస్తున్నారు. సినిమాకి సంబంధించిన ప్రతి దశలోనూ కావల్సినంత సమయం తీసుకొని నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణానంతర పనులు పూర్తికాకపోతే మరికాస్త సమయం తీసుకుని చిత్రానికి మెరుగులు దిద్దుతున్నారు. అవసరమైతే సినిమాని వాయిదా వేయడానికి కూడా ఎక్కడా వెనుకాడటం లేదు.

రీ షూట్లకు కూడా సిద్ధమే
ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ని ఆగస్టు 15న విడుదల చేయాలనుకొన్నారు. కానీ అనుకొన్నట్టుగా  విజువల్‌ ఎఫెక్ట్స్‌ రావడం కోసం మరో 15 రోజులు అదనంగా సమయం తీసుకొని కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’  విషయంలోనూ అంతే. ముందుగానే విడుదల తేదీని ఖరారు చేయకుండా, నిర్మాణానంతర పనులకి కావల్సినంత సమయం తీసుకొంటున్నారు. ఈ విషయంలో కథానాయకుడు నాగార్జున మరింత పక్కాగా వ్యవహరిస్తుంటారు. విడుదలకి ముందు పూర్తి స్థాయిలో సినిమా చూసుకోవాల్సిందే అంటారాయన. అవసరమైతే రీ షూట్లు కూడా చేయాల్సిందే అంటారు.‘‘సినిమా తీసేశామంటే చాలదు. అది అనుకొన్నట్టుగా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. రీ షూట్లు చేయడం తప్పన్నట్టుగా భావిస్తుంటారు చాలా మంది. సినిమా నాణ్యతని మరింత పెంచడంలో భాగమే అది. అందుకే సినిమా చూసుకుని తృప్తి చెందాకే నా  సినిమాల్ని విడుదల చేయాలనుకొంటా’’ అనేది నాగార్జున అభిప్రాయం. ‘మన్మథుడు 2’ కూడా అలాంటి ప్రణాళికల మధ్యే ముస్తాబైంది. ‘1.. నేనొక్కడినే’ పరాజయానికి నిర్మాణానంతర కార్యక్రమాలకి తగిన సమయం లేకపోవడమే కారణమని మహేష్‌బాబు తరచూ చెబుతుంటారు.

ఏళ్లతరబడి స్క్రిప్టుపైనే…
సినిమా పూర్తయ్యాకే కాదు… ముందస్తు నిర్మాణ పనుల విషయంలోనూ కథానాయకులు, దర్శకనిర్మాతలు ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. పక్కా స్క్రిప్టుతో పాటు ప్రీ విజువలైజేషన్‌ పనులు కూడా పూర్తి చేసుకొన్నాకే రంగంలోకి దిగుతున్నారు. అందుకోసం ఏళ్ల  తరబడి సమయం తీసుకోవడానికీ వెనకాడటం లేదు. రానా కథానాయకుడిగా నటించబోతున్న ‘హిరణ్య’ ముందస్తు నిర్మాణ పనులు రెండేళ్లుగా సాగుతున్నాయి. ‘‘అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతున్న ఆ సినిమా గురించి చేసిన ఈ రెండేళ్ల ప్రయాణంలో చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఇక సినిమా తీయడమే మిగిలుంది అన్నట్టుగా ముందస్తు నిర్మాణ పనులు సాగాలి. నిర్మాతల దగ్గర్నుంచి, సాంకేతిక బృందం వరకు ప్రతి ఒక్కరూ సినిమా నిర్మాణాన్ని నేర్చుకొని రంగంలోకి దిగినప్పుడే సినిమాని అనుకొన్నట్టుగా తీయగలుగుతాం’’ అంటారు నిర్మాత డి.సురేష్‌బాబు. ఇటీవల చిత్ర పరిశ్రమలోకి విద్యావంతులు వస్తున్నారు. ప్రతి విభాగంలోనూ వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హీరోలు కూడా బౌండెడ్‌ స్క్రిప్టుల్నే ఎంచుకొంటున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే తమ పనైపోయిందని కాకుండా, నిర్మాణానంతర పనుల్ని పర్యవేక్షిస్తూ చిత్రబృందాలకి  సూచనలు ఇస్తున్నారు.