ముంబయి: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ మధ్య ఉన్న విభేదాలను తొలగించేలా బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లను విండీస్‌తో భారత్.. యూఎస్‌లో తలపడనుంది. అయితే వచ్చే వారంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి కూడా యూఎస్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం. కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడి విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించి జట్టు మరింత సమష్టిగా రాణించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ‘విభేదాల విషయంలో సహాయక సిబ్బంది జోక్యం చేసుకుంటే పరిస్థితి గందరగోళంగా మారుతుంది. కోహ్లీ-రోహిత్ ఎంతో పరిణతి ఉన్న వ్యక్తులు. వారితో మాట్లాడితే పరిస్థితి మాములుగా మారుతుంది.’ అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో పేర్కొన్నారు.
మరోవైపు ఈ విషయంపై ఆటగాళ్లతో టీమిండియా కోచ్ రవిశాస్త్రిని మాట్లాడించే అవకాశం ఉందని సమాచారం. ధోనీ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు. ఆ సమయంలో రవిశాస్త్రి జట్టుతోనే ఉన్నాడు. జట్టులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అందర్నీ ఒక తాటిపైకి తీసుకవచ్చాడు. ఇప్పుడు కూడా ఆటగాళ్లతో రవిశాస్త్రి మాట్లాడితే జట్టులో ఏమైనా లుకలుకలు ఉంటే తొలగిపోతాయని బీసీసీఐ భావిస్తోంది. అగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.