బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు వైకాపా ప్రయత్నం

0
36

అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు వైకాపా ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. బందరు పోర్టును ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తుంటే.. మచిలీపట్నం డీప్‌ వాటర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం నడుం కట్టిందని గుర్తుచేశారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను 2017 మార్చిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది జూన్‌ 28న RT -62 జీవోను రహస్య జీవోగా జారీ చేసి, రెండు రోజుల్లోనే జారీ చేయలేదని మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బందరుపోర్టును తెలంగాణకు ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే.. లేదని బుకాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు. పోర్టుల పై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు. వైకాపా స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెదేపా సహించదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

పాలన కూడా అప్పగించేస్తారా?
అసమర్థులు ఒక్క ఛాన్స్ అంటూ ఎందుకు అడిగారు.. దోచుకోవడానికా లేక ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా అంటూ  తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడతారా’’ అని ధ్వజమెత్తారు.