ఇక పోరాడలేనంటూ కాఫీడే ఉద్యోగులు, డైరెక్టర్లకు లేఖ

0
59

బెంగళూరు: కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది అంతు చిక్కకుండా పోయింది. మరోవైపు సిద్ధార్థ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వంతెనపై నుంచి నదిలోకి దూకి ఉంటారనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. కన్పించకుండాపోవడానికి ముందు సిద్ధార్థ తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు రాసిన లేఖే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

సిద్ధార్థ తన కుటుంబసభ్యులకు రాసిన లేఖను కొన్ని జాతీయ మీడియాలు ప్రచురించాయి. ‘37ఏళ్ల నా కృషితో 30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. అయితే ఇప్పుడు ఎన్నో మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమవుతున్నా. సుదీర్ఘకాలం నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇక పోరాడే ఓపిక నాకు లేదు. అందుకే అన్ని వదిలేస్తున్నా. ఓ ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయమని నన్ను బలవంతపెడుతున్నారు. ఇక ఆ ఒత్తిడిని నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఆదాయపు పన్ను గత డీజీ నుంచి ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నా. నాపై మీరంతా ఎంతో నమ్మకం ఉంచారు. దాన్ని వమ్ము చేస్తున్నందుకు క్షమించండి. కొత్త యాజమాన్యంతో మీరంతా బలంగా ఉండి ఈ వ్యాపారాని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నా. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు. వాటికి నేనే జవాబుదారిని. నేను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు. నేను విఫల వ్యాపారవేత్తను. నన్ను క్షమించండి’ అని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు.

సిద్ధార్థ కోసం 200 మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. గత ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత ఎస్‌.ఎం. కృష్ణ అల్లుడే సిద్ధార్థ. ఆయన అదృశ్యం గురించి తెలియగానే ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఎస్‌. ఎం. కృష్ణ నివాసానికి చేరుకున్నారు.