ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణకు కమిషన్‌

0
31
ప్రస్తుత పరిస్థితిపై.. ఎల్‌కేజీకి రూ.లక్ష?

బడులు, కళాశాలలు లాభాల కోసం నడపకూడదని దేశంలోని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతికి రూ.63వేల నుంచి రూ.లక్ష ఫీజు తీసుకుంటున్నారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లను పేదలకు ఇవ్వాలి. వారికి అతి తక్కువ ఫీజులు ఖరారు చేయాలి. ఆ ఫీజును ప్రభుత్వమే చెల్లించాలి. గత ప్రభుత్వంలో ఒక్కచోటా ఇది అమలు కాలేదు.
ప్రభుత్వ బడులను ఓ పద్ధతి ప్రకారం హేతుబద్ధీకరణ పేరిట నిర్వీర్యం చేశారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ఆరేడు నెలలపాటు చెల్లించలేదు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలను అక్టోబరుదాకా ఇవ్వలేదు.
తప్పు చేస్తే… బడి మూసివేతే!

కొత్త చట్టం ప్రకారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఛైర్మన్‌గా ఉంటారు. ఈయనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఇందులో 11 మంది సభ్యులు ఉంటారు. వీళ్లు ఏ పాఠశాలకైనా వెళ్లి పర్యవేక్షణ చేయవచ్చు. ఫీజులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, బోధన ఇలా అన్నింటిని పర్యవేక్షిస్తారు. పాఠశాలలకు గ్రేడింగ్‌ కూడా ఇస్తారు.

తప్పుచేసిన విద్యా సంస్థలకు తొలుత హెచ్చరిక, తర్వాత అపరాధ రుసుం, చివరకు మూసివేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సోమవారం రెండు కీలకబిల్లులకు ఆమోదం తెలిపింది. విద్యాసంస్థల్లో పూర్తిస్థాయి ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఉద్దేశించిన ఈ బిల్లుల్లో పాఠశాల విద్యకు ఒకటికాగా,  మరొకటి ఉన్నత విద్యకు సంబంధించింది. ఈ రెండింటికి వేర్వేరుగా కమిషన్‌లను ఏర్పాటు చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఈ కమిషన్‌లకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు. సోమవారం  శాసనసభలో  ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ‘‘తల్లిదండ్రులుగానీ ప్రభుత్వంగానీ భావితరాలకు ఆస్తిగా ఇచ్చేది చదువు. అంతా చదువుకుంటే పేదరికం నుంచి బయటకు తీసుకురావచ్చు. గత అయిదేళ్లూ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేటు బడుల్లో ఫీజులు బాదుతుంటే ఇదేమని అడగలేదు. విద్యా సంస్థల యాజమాన్యాలే మంత్రులుగా ఉంటే, వాళ్లు బడులు, ఫీజులను ఎలా నియంత్రిస్తారు. మేం మాత్రం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తూ చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు.

కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆడిందే ఆట
ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలది ఆడిందే, పాడిందేపాటగా మారింది. ఒలంపియాడ్‌, ఐఐటీ, టెక్నో పేర్లతో ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. భాష్యం, శ్రీచైతన్య, నారాయణ, ఆదిత్య, రవీంద్రభారతి, అక్షర, నలంద.. తదితర సంస్థలు అనేక శాఖలు పెట్టాయి. నలందలో ఎల్‌కేజీ, యూకేజీ ఫీజు రూ.63 వేలు, ప్రైమరీకి రూ.లక్ష ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్లే పుస్తకాలు ముద్రించుకొని, అమ్మకాలు చేస్తున్నారు. భవన నిధి (బిల్డింగ్‌ ఫండ్‌), వసతుల నిధి (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌).. పేరిట దోపిడీ వ్యాపారం చేస్తున్నారు. హాస్టళ్లను జైళ్లలా నడిపిస్తున్నారు. ఇకపై ఇవన్నీ చెల్లవు’’ అని ఆయన చెప్పారు.

ఉన్నత విద్యలోనూ ప్రక్షాళన
గత ప్రభుత్వంలో ‘జ్ఞానభేరి’ పేరిట విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహించి నిధులు వృథాచేశారని, ఆర్జేయూకేటీకి చెందిన రూ.185 కోట్లను ఎన్నిలకు ముందు పసుపు కుంకుమకు మళ్లించారని మంత్రి సురేష్‌ ఆరోపించారు. శాసన సభలో ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడారు. ‘‘ఉన్నత విద్య కోర్సులో ఓ కళాశాలలో రూ.40 వేలు ఫీజు ఉంటే, మరో కళాశాలలో రూ.1.10 లక్షలు ఉంటుంది. ఒకే కోర్సుకు వేర్వేరు ఫీజులు ఏమిటి? ఈ విద్యా సంస్థలకు అపెక్స్‌ బాడీ అనుమతులు ఇస్తుంది. అయితే ఫీజులు మాత్రం వాళ్లే నిర్ణయించుకునేలా వదిలేశారు. ఇకపై అన్ని ఉన్నత విద్యా సంస్థలు కొత్తగా నియమిస్తున్న కమిషన్‌ పరిధిలోకి వస్తాయి’’ అంటూ వివరించారు. సభలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు రెండింటినీ ఆమోదించారు.

కమిషన్‌ పదవీ కాలం ఐదేళ్లు..
కమిషన్‌ల పదవీకాలం ఐదేళ్లు లేదా ఛైర్మన్‌, సభ్యుల వయస్సు 70 ఏళ్లు వరకు ఉంటుంది. ఏది ముందైతే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఛైర్మన్‌ను నియమిస్తారు. సభ్యులను సెర్చ్‌, ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. ఉన్నత విద్యా కమిషన్‌ పరిధిలోకి వైద్య, దంతవైద్య, వ్యవసాయ, ఉద్యానవన, పశువైద్య సంస్థలతోపాటు ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు రానున్నాయి.
* ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) స్థానంలో ఇది ఏర్పాటు కానుంది.
* కమిషన్‌ నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ఉన్నత విద్యా సంస్థల్లో కమిషన్‌ గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవడానికి కొంత సమయం ఇస్తుంది. నిర్ణీత గడువులోపు వాటిని పూర్తి చేయకపోతే జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉంది. నియమ, నిబంధనలను విద్యా సంస్థలు తరచూ ఉల్లంఘిస్తే అనుమతుల రద్దుకు అయా వర్సిటీలకు సూచిస్తుంది.

పునఃసమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే..
ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలోకి ప్రైవేటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, ఐజీసీఎస్‌ఈ, ఎయిడెడ్‌, ప్రైవేటు ఉపాధ్యాయ విద్యా సంస్థలు వస్తాయి. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ విద్య, ఉపాధ్యాయ విద్యా సంస్థలు, సెకండరీ విద్యాబోర్డు రానున్నాయి.
* కమిషన్‌ నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘాలతో సంప్రదింపులు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలకు జరిమానా విధిస్తుంది. అనుమతుల రద్దుకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేస్తుంది.
* రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ, రుసుముల విధానాన్ని నియంత్రించే అధికారం కమిషన్‌కు ఉంటుంది.
* విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25% సీట్లు బలహీనవర్గాలకు కేటాయించేందుకు కమిషన్‌ పర్యవేక్షిస్తుంది.