రోహిత్‌తో గొడవలు లేవు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లి.

0
73

రోహిత్‌ శర్మతో విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖండించాడు. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసిన అతడు.. జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటారని చెప్పాడు. కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రే కావాలన్న విరాట్‌.. మిడిల్‌ ఆర్డర్‌లో ఓ మంచి బ్యాట్స్‌మన్‌కోసం చూస్తున్నామని తెలిపాడు. భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు బయలు దేరడానికి ముందు విలేకర్ల సమావేశంలో అతడు చాలా విషయాలపై సవివరంగా మాట్లాడాడు. ఏమన్నాడంటే..

రోహిత్‌తో విభేదాలపై
రోహిత్‌కు నాకు మధ్య విభేదాలు పూర్తిగా నిరాధారం. అర్థరహితం. నేనెవరైనా ఇష్టపడకపోతే అది అది నా ముఖంలో కనిపిస్తుంది కదా! అవకాశం వచ్చిన ప్రతిసారీ నేను రోహిత్‌ను పొడుగుతూనే ఉంటా. ఎందుకంటే అతడు అంత మంచి ఆటగాడు. మేం ఎంత బాగా ఆడామన్నదాని గురించి జనం మాట్లాడుకుంటుంటే.. మీడియా మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తోంది. ప్రతికూల విషయాల గురించి మాట్లాడుతోంది. ఇది చాలా రోజులుగా నడుస్తోంది. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగుతున్నారు. నేను 11 ఏళ్లుగా ఆడుతున్నా. రోహిత్‌ పదేళ్లుగా ఆడుతున్నాడు. బయట ఉన్నవాళ్లు లేనివి పుట్టిస్తుంటే అసహ్యమేస్తోంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎంత సుహృధ్భావ వాతావరణం ఉందో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. కుల్‌దీప్‌ యాదవ్‌తో ఎలా మాట్లాడాతామో, జట్టులో అందరికన్నా సీనియర్‌ అయిన ధోనీపై ఎలా జోకులు వేస్తామో తెలుస్తుంది. ఇవన్నీ షూట్‌ చేసి చూపించలేం. కొందరు నమ్మకం కలిగేలా అబద్ధాలను సృష్టిస్తున్నారు. టీమ్‌ఇండియాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లేందుకు మేం అహర్నిశలు శ్రమిస్తున్నాం. కానీ కొందరు మాత్రం మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే మా జట్టు అంత మంచి ప్రదర్శనలు చేసేది కాదు. స్నేహం, పరస్పర విశ్వాసం వల్లే నిలకడగా రాణించగలిగాం. మేం నంబర్‌ 7 నుంచి నంబర్‌ 1కు చేరుకున్నాం. ఆటగాళ్ల మధ సత్సంబంధాలు లేకపోతే అది సాధ్యమయ్యేదా!

మిడిల్‌ ఆర్డర్‌పై..

మిడిల్‌ ఆర్డర్‌ సమస్యను పరిష్కరించాల్సివుంది. మా టాప్‌ ఆర్డర్‌ చాలా బాగుంది. అందుకే మిడిల్‌ ఆర్డర్‌కు ఎక్కువ అవకాశాలు రావట్లేదు. వచ్చిన కొన్ని అవకాశాలను వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో ప్రతి ఒక్కరూ వారిపై వేలెత్తి చూపెట్టడం మొదలెట్టారు. జట్టులో 11 మందీ రాణించాలని మేం కోరుకుంటాం. అది జరగనప్పుడు ఏదో ఒక విభాగాన్ని వేలెత్తి చూపిస్తారు. ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ విఫలమైతే.. ఆ ప్రదర్శన ఆధారంగా అతడిపై ఓ నిర్ణయానికి రావడం అన్యాయం. మిడిల్‌ ఆర్డర్‌లో నిలకడగా రాణించే బ్యాట్స్‌మెన్‌ కోసం చూస్తున్నాం. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. జట్టంతా రాణించడం వల్లే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌దాకా వెళ్లాం. గత కొన్నేళ్లలో కూడా మెరుగైన ప్రదర్శన చేశాం. మిడిల్‌ ఆర్డర్‌ గురించి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

విశ్రాంతి తీసుకోకపోవడంపై..

వన్డే ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. ఫిజియో లేదా ట్రెయినర్‌ నాకు విశ్రాంతి అవసరమని చెప్పలేదు. సెలక్టర్లకు ఎలాంటి సమాచారం వెళ్లిందో నాకు తెలియదు. ఇప్పుడు జట్టంతా ఒక్క దగ్గర ఉండడం ముఖ్యం. ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరలేకపోయినందుకు జట్టులో అంతా నిరాశపడ్డారని తెలుసు. కానీ ఇక దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి.

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లపై.. రహానెపై..

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రహానెను కాదని రోహిత్‌ శర్మను ఎంచుకున్నాం. రోహిత్‌ ఆడుతున్న తీరే అందుకు కారణం. కానీ రహానె కూడా చాలా మంచి ఆటగాడు. స్లిప్‌లో మంచి ఫీల్డర్‌ కూడా. అప్పుడే అతడిపై ఓ నిర్ణయానికి రావొద్దు. ముందు ముందు అతడు కూడా వన్డే జట్టులోకి రాగలడు.

టీ20 ప్రపంచకప్‌పై

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌పై మేం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో టెస్టులపైనా దృష్టిసారించాలి.

టెస్టు ఛాంపియన్‌షిప్‌పై..

టెస్టు ఛాంపియన్‌షిప్‌ వల్ల టెస్టు  క్రికెట్‌కు మరింత ప్రచారం వస్తుంది. ఇది ఆటగాళ్లకు ఉత్తేజాన్నిస్తుంది. సవాళ్లనూ విసురుతుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన అనుభవంతో వాళ్లు చాలా నేర్చుకుంటారు. వన్డే జట్టు దాదాపు సమతూకంగా ఉంది. కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. టెస్టు జట్టు గురించి వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నాకు చాలా ఉత్తేజం కలిగిస్తోంది. ఎందుకంటే చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. సత్తా చాటుకోవడానికి కొత్త కుర్రాళ్లకు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఓ చక్కని అవకాశం. ఐపీఎల్‌, దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అక్కడ వాళ్లు ఒత్తిడిలో చాలా సంయమనాన్ని ప్రదర్శించారు. వెసిండీస్‌లో క్రికెట్‌ ఆడితే బాగుంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ క్రికెట్‌ ఆడడాన్ని చాలా ఆస్వాదించాం.

కోచ్‌ ఎంపికపై..

రవి భాయ్‌తో మా అందరికీ మంచి బంధం ఉంది. అతణ్నే కోచ్‌గా కొనసాగిస్తే చాలా సంతోషిస్తాం. కానీ కోచ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)నే. ఈ విషయంపై సీఏసీ ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు. నా అభిప్రాయం అడిగితే చెబుతా.

ప్రపంచకప్‌ గెలిస్తే చాలా బాగుండేది. కానీ గెలవనంత మాత్రాన మా ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేయలేం.


– రవిశాస్త్రి, భారత జట్టు కోచ్‌