బాదం శరీరానికి సంజీవనిలాంటిది. శిరోజాలు, ఎముకలు, మెదడు ఇలా శరీరంలోని వివిధ భాగాలను ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పులు తింటే మంచిదని డైట్ నిపుణులు తరచూ చెబుతుంటారు. అలా చేస్తే రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటామట. ఎంతో ఆరోగ్యదాయిని అయిన బాదం పప్పులను రకరకాలైన వంటకాలలో కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ పొందుతాము. భారతీయ వంటకాల్లో బాదంపప్పులను విరివిగానే వాడతారు. యురోపియన్, ఓరియంటల్ కుకింగ్‌లలో కూడా వీటిని బాగా వాడతారు. ఓరియంటల్ వంటకాల్లో బాదం, వెల్లుల్లి కలిపిన సాస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. యురోపియన్ కుకింగ్‌లో డెజర్ట్‌లలో వీటిని వాడుతుంటారు. క్రొక్వెట్లలో కూడా బాదం పప్పులను ఉపయోగిస్తారు. బాదం, టొమాటో కలిపి మ్యాష్ చేసి తింటే ఎంతో బాగుంటుంది. చికెన్ లేదా మటన్ వండేటప్పుడు అందులో వేయించిన బాదంపప్పుల పొడి కలిపితే ఎంతో రుచికరంగా ఉంటుంది.

శరీరానికి కావలసిన పోషకాలు కూడా బాదం నుంచి అందుతాయి. సలాడ్స్, డెజర్టుల్లోనే కాకుండా బాదంను ప్రధాన వంటకాల్లో కూడా కలుపుతారు. గ్రేవీ టైపులో చికెన్‌నువండేటప్పుడు అందులో మెత్తగా చేసిన బాదం, జీలకర్ర మిశ్రమాన్ని జోడిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. పెస్తో తయారీలో కూడా బాదం వాడతారు. ఎండిన టొమాటో, బాదంపప్పుల మిశ్రమానికి ఒరెగానో , ఇతర మసాలాలు కలిపి రెడ్ సాస్ తయారుచేయొచ్చు. దీన్ని పాస్తాలో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సాస్‌ని మీట్‌లో కూడా కలిపి రోస్ట్ చేయొచ్చు. చేపల కూరలో కూడా బాదంపప్పు పేస్టును వాడొచ్చు. ఇక బాదం పప్పులు లేని సలాడ్ అసంపూర్ణమనే చెప్పాలి. బాదం వాడక పోతే ఆ సలాడ్ రుచి ఆకట్టుకునేలా ఉండదు. సూప్స్ రుచి మరింత పెరిగేందుకు కూడా వాటిల్లో బాదంను వాడతారు. కూరల్లోని గ్రేవీ చిక్కగా ఉండేందుకు బాదం పేస్టు జోడిస్తారు. డెజర్టుల్లో బాదం కేక్ బెస్ట్. అంతేకాదు డెజర్టుల్లో ఆల్మండ్ కుకీస్‌ను సైతం వాడతారు. తీపిని ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బాదంపప్పులతో వంటకాల్లో ఎన్నైనా ప్రయోగాలు చేయొచ్చు. మరి మీరూ ప్రయత్నించి చూడండి.