మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొత్త ఇన్నింగ్స్‌

0
57

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొత్త ఇన్నింగ్స్‌ బుధవారం ఆరంభంకానుంది. క్రికెట్‌కు విరామం ప్రకటించిన అతడు సైనిక విధుల్లో చేరనున్నాడు. ఆర్మీలో పారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న ధోని.. సైనికుడిగా సేవలందించడం కోసం వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. అత్యంత సున్నిత ప్రాంతమైన కశ్మీర్‌ లోయలో ధోని విధుల్లో పాల్గొంటాడు. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే విక్టర్‌ ఫోర్స్‌ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తాడు. దీనిలో భాగంగా మహి.. పహారా కాయడం, సైన్యంతో కలిసి బందోబస్తుకు వెళ్లడం లాంటి పనులు చేస్తాడు. ‘‘పారా రెజిమెంట్‌లో పని చేయడం కోసం ధోని అన్ని విధాలా  సిద్ధమయ్యాడు. ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి పారాచ్యూట్‌తో దూకడం లాంటి విన్యాసాలు చేశాడు’’ అని ఓ సైనిక అధికారి చెప్పాడు.