అతనికి బౌలింగ్‌ వచ్చా..? ఇంతకీ బౌలరేనా?

0
42

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరె.. ఏంటి ఈ బౌలర్‌.. గల్లీలో ఆడే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనుకున్నాడా ఏంటి అలా బౌలింగ్‌ వేస్తున్నాడు. అసలు అతనికి బౌలింగ్‌ వచ్చా..? ఇంతకీ బౌలరేనా? అనే అనుమానం తలెత్తేవిధంగా బౌలింగ్‌ వేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను, ఎవరి గురించి మాట్లాడుతోంది అనుకుంటున్నారా..! యూరప్‌లో నిర్వహించిన టీ10 లీగ్‌లో రొమేనియాకు చెందిన క్రీడాకారుడు వేసిన బౌలింగ్‌ విధానం క్రికెట్‌ అభిమానులనే కాదు నెటిజన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం అతని బౌలింగ్‌ యాక్షన్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. యూరప్‌లో జరుగుతున్న టీ10 లీగ్‌లో క్లజ్‌ క్రికెట్‌ క్లబ్‌, డ్రూక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా క్లజ్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టు తరపున పెవెల్‌ ఫ్లోరిన్‌ అనే ఆటగాడు బౌలింగ్‌ వేయడం ప్రారంభించాడు. మొదటి బంతిని వేస్తుండటంతోనే అతని బౌలింగ్‌ యాక్షన్‌ గమనించిన ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నెమ్మదిగా పరిగెత్తుతూ వచ్చి.. స్లోగా బంతులు విసరడంతో బ్యాట్స్‌మెన్‌లు కంగారు పడిపోయారు. అతను వేసిన బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సిన బ్యాట్స్‌మెన్‌లు ఆ బంతులను వారు కనీసం బౌండరీలు కూడా దాటించలేకపోయారు. ఈ అద్భుతమైన ప్రదర్శనను కొందరు ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు దీనిపై హాస్యాస్పదంగా స్పందించారు.
యూరోపియన్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌లో ఎనిమిది జట్లు, రెండు గ్రూపులుగా పాల్గొంటాయి. క్లజ్‌ క్రికెట్‌ క్లబ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా విజయం సాధించకుండా జట్టు గ్రూప్‌ ఏలో చివరి స్థానంలో ఉంది.