ఆనందం ఎక్కడుందో! అందరికీ సాధ్యపడకపోవచ్చు.

0
89

కనుక్కుందాం…. ఆనందం ఎక్కడుందో! అందరికీ సాధ్యపడకపోవచ్చు. మహారాష్ట్రలోని మాల్‌శెజ్‌ ఘాట్‌కి వెళ్లిన వాళ్లకు మాత్రం పక్కాగా దొరుకుతుంది. మాల్‌శెజ్‌ అంటేనే కనుక్కోవడం అనే అర్థముంది. థానె నుంచి అహ్మద్‌నగర్‌ వెళ్లే దారిలో ఉంటుందీ వంకలు తిరిగిన గజిబిజి మార్గం. ఎటుచూసినా అందమైన పర్వతాలు. వాటి శిఖరాగ్రాలకు కారుమబ్బులు గొడుగు పడతాయి. కొండగాలి తగలడంతో హర్షించి వర్షిస్తాయి. కొండపైన వాన. కొండ కింద వాన. కొంటె వాన ఒళ్లంతా మీటడంతో గిరులన్నీ తడిసి ముద్దయిపోతాయి. ప్రకృతి కాంత చుట్టుకున్న పచ్చ పట్టుచీరపై.. వెండి తీగలతో నేసిన జరీ అంచులా.. ఎటు చూసినా జలధారలు మెరిసిపోతుంటాయి! పదుల సంఖ్యలో జలపాతాలు. వడివడిగా ఒకటి. జోరుగా ఇంకోటి. చడీచప్పుడు లేకుండా మరోటి. ఒక్కో జలపాతానిదీ ఒక్కో శైలి. మేఘసందేశాలు, జలపాతాల రాగాలు వింటూ మాల్‌శెజ్‌ ఘాట్‌ అంచున సాగే ప్రయాణం మనోహరంగా ఉంటుంది. ఘాట్‌ రోడ్డు ఈ కొన నుంచి ఆ కొనకు వెళ్లే సరికి మనసంతా ఆనందంతో నిండిపోతుంది. జలపాతాల పన్నీటి జల్లులతో తనువంతా తడిసిపోతుంది. ఈ ఆనందం కోసమే మాల్‌శెజ్‌ ఘాట్‌కు వస్తుంటారు పర్యాటకులు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. విదేశాల నుంచీ వస్తుంటారు. సహ్యాద్రి పర్వత సానువుల్లో ఉన్న అద్భుతాన్ని చూసి, అరపూట అక్కడే తిరిగి, రహదారికి ఇరువైపులా ఉన్న జలపాతాల్లో కేరింతలు కొట్టి, దారి వెంట అమ్ముతున్న మొక్కజొన్న పొత్తులు కొనుక్కొని, వ్యూపాయింట్ల దగ్గర గంటల తరబడి నిల్చుని, నచ్చినన్ని సెల్ఫీలు దిగి.. వెనుదిరుగుతారు. వర్షరుతువులో మొదలయ్యే పర్యాటకుల సందడి.. హేమంతం పూర్తయ్యే వరకూ ఉంటుంది. జులై నుంచి ఫిబ్రవరి వరకు ఈ దారిలో వెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలు  సిద్ధం చేసుకుంటారు. ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. మాల్‌శెజ్‌ మీదుగానే ప్రయాణం కొనసాగిస్తారు