ఇప్ప పువ్వంటే భద్రాచలంలో ప్రసాదం కదూ… ఠక్కున చెప్పేస్తాం… అంతేనా గిరిపుత్రులను అడిగితే ఇంకా ఎన్నో ఇప్ప రుచుల గురించి కథలు కథలుగా చెబుతారు… అయితే ఇప్పపువ్వు మార్చిన జీవితాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి…
ఆదివాసీలకు ఇప్పపువ్వు అందాలను, ఆనందాలనే కాదు ఆర్థిక స్వావలంబన కూడా ఇస్తోంది. దేవతగా భావించే గిరిజనం పాలిట అక్షరాలా అమ్మలా ఆదుకుంటోందా చెట్టు. అదే చెట్టును ఆదాయమార్గంగా మార్చితే… ఈ ఆలోచనతో ఆ జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ చేపట్టిన కార్యక్రమాలు ఆదివాసీల జీవితానికో కొత్తదారి చూపాయనే చెప్పాలి. ఇప్పపువ్వు, ఇప్ప పరక నుంచి ప్రతి భాగాన్నీ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పపువ్వును పౌష్ఠికాహారంగా మార్చుతూ మంచి మార్కెట్ కల్పిస్తున్నారు. దీనికోసం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్‌లోని 20 మంది మహిళలకు ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. దీంతో తినుబండరాల తయారీకి ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టారు. లడ్డూలు, కరమురలు, పట్టీలు ఇతర తిను బండరాలను తయారు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో ఒకప్పుడు పెద్దగా ఉపయోగ పడని ఈ పువ్వుకు ఇప్పుడు తిరుగులేని డిమాండ్ ఏర్పడింది. గ్రామాల్లో ఆదివాసీల ఇళ్లకు వెళ్లి కిలో రూ.20 చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు దీంతో తయారు చేసే పదార్థాలకు డిమాండ్ పెరగడంతో వచ్చే లాభాలూ పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో ఉట్నూర్ లో ఇప్పపువ్వు వంటకాల పండగ కూడా నిర్వహించారు. అదే రోజు నుంచి పువ్వు తయారు చేసిన వంటకాలను విపణిలో అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడా వంటకాలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.