జగన్ అక్రమాస్తుల కేసులో.. జైలుకు నిమ్మగడ్డ ప్రసాద్

0
66

ప్రముఖ పారిశ్రామికవేత్త, జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన ఆయనను సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి రస్‌ అల్‌ ఖైమా (రాక్‌) దేశంలో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. ఆ మేరకు ఆయనను నిర్బంధించినట్లు తెలుస్తోంది.

చివరి వరకూ రహస్యంగానే
వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్‌కు, రాకియా(రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ)కు మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా భారతదేశం అనుమతి తీసుకోవాలి. అయితే జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ప్రసాద్‌పై సీబీఐ, ఈడీలలో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయనను విదేశానికి అప్పగించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకోదు. ఒకవేళ ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయిస్తే నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్రమత్తమై విదేశీ పర్యటనలు మానుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాలాకాలంగా ప్రసాద్‌ విదేశీ పర్యటనలపై కన్నేసి ఉంచారని, ఐరోపాలో ఉన్న సంగతి తెలుసుకొని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించారని తెలుస్తోంది. దాంతో బెల్‌గ్రేడ్‌ విమానాశ్రయంలో దిగీదిగగానే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పెట్టుబడి సొమ్ము కోసం రాకియా ఒత్తిళ్లు
దాదాపు రూ.16,000 కోట్ల విలువైన వాన్‌పిక్‌ ప్రాజెక్టు వివాదాల్లో చిక్కుకోవటం, ప్రాజెక్టు అమల్లో జాప్యం చోటుచేసుకోవటంపై మొదటి నుంచీ రాకియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాన్‌పిక్‌ పోర్టు ప్రాజెక్టు కోసం అవసరమైన పెట్టుబడుల సమీకరణలో భాగంగా వాన్‌పిక్‌ పోర్టు కంపెనీలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌ రాకియాను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టులో 74 శాతం నిమ్మగడ్డకు, 26 శాతం రాకియాకు ఉండేది. అది 2008లో రూ.845 కోట్ల పెట్టుబడి అందించింది. ఆ తర్వాత సీబీఐ కేసులు నమోదు కావటం, అనుకున్నట్లుగా పోర్టు ప్రాజెక్టు అమలు కాకపోవటంతో రాకియా ప్రతినిధులు తమ పెట్టుబడుల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చినట్లు సమాచారం. ఇదే విషయంలో రస్‌ అల్‌ ఖైమా ప్రతినిధి కర్మ్‌ అల్‌ సాదెక్‌ 2012లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు. స్వయానా రస్‌ అల్‌ ఖైమా పాలకుడు అప్పటి ప్రధానమంత్రికి కూడా లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని రాకియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాన్‌పిక్‌ పోర్టు ప్రాజెక్టులో వాటా విక్రయించి, వచ్చిన సొమ్మును ఆ సంస్థకు చెల్లించాలని ఒక దశలో నిమ్మగడ్డ ప్రసాద్‌ భావించినా అది సవ్యంగా సాగలేదు. ఇదే ప్రస్తుతం నిమ్మగడ్డ అరెస్టుకు తావిచ్చినట్లు చెబుతున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడిదారుడికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలి, ఎంతకాలానికి తిరిగి చెల్లించాలి, తిరిగి చెల్లించలేని పక్షంలో న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది ఒప్పందంలో ఉంటుంది. ఇరువురి మధ్య వివాదం తలెత్తినప్పుడు పోలీసులను, న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రస్‌ అల్‌ ఖైమా అదే చేసినట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డ అరెస్టు వాస్తవమే
సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్ట్‌ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ ధ్రువీకరించింది. అరెస్ట్‌ గురించి అక్కడి భారతీయ రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు ఆధారంగా అక్కడ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. నిమ్మగడ్డ కుమారుడు, లాయర్‌తో భారతీయ దౌత్య అధికారులు మాట్లాడినట్లు చెప్పాయి. సెర్బియన్‌ చట్టాలను పరిశీలించి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించినట్లు వివరించాయి.

భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: వైకాపా

నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించడానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ వైకాపా ఎంపీలు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన్ను ఒక నిరాధారమైన కేసులో సెర్బియా రాజధానిలో అరెస్ట్‌చేశారని, అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ద్వారా చర్యలు చేసుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. మంగళవారం ఆపార్టీకి చెందిన కొందరు ఎంపీలు కేంద్రమంత్రి జైశంకర్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌పై విడుదలవుతారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అయితే ఇది సివిల్‌ వివాదమని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని కేంద్రమంత్రి జైశంకర్‌ కొందరు ఎంపీలతో అన్నట్లు సమాచారం. విదేశీ జైల్లో ఉన్న వ్యక్తిని కలుసుకొనే అవకాశమివ్వాలని కోరడం మినహాయించి భారత్‌ ప్రభుత్వం అంతకు మించి ఏమీ చేయలేదని చెప్పినట్లు తెలిసింది.